Nellore City Assembly Seat: నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ఇప్పటికే ద్విముఖ పోరు కనపడుతోంది. ప్రస్తుత ఎమ్మెల్యే, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ (MLA Anil Kumar Yadav), మాజీ మంత్రి నారాయణ మధ్య పోరు హోరాహోరీగా సాగే అవకాశముంది. జనసేన మద్దతుతో టీడీపీ మరింత బలంగా కనపడుతోంది. ఈ మధ్యలో ఇప్పుడు బీజేపీ (BJP) ఎంట్రీతో సీన్ మారిపోయేలా ఉంది. ఇన్నాళ్లూ బీజేపీని ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు బీజేపీ కూడా సత్తా చూపించడానికి రెడీ అవుతోంది. ముఖ్యంగా నగరాలపై బీజేపీ ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే విజయవాడ ఎంపీ సీటు సుజనా చౌదరి ఖాయం చేసుకున్నానని చెబుతున్నారు. మరికొందరు బీజేపీ నేతలు కూడా ఎక్కడికక్కడ సీట్లు ప్రకటించుకుంటున్నారు. తాజాగా నెల్లూరు జిల్లాకు చెందిన సీనియర్ నేత పి.సురేంద్ర రెడ్డి.. నెల్లూరు సిటీ అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేయడానికి గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. సిటీ అభ్యర్థిగా బరిలో దిగడానికి ఆయన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అదే జరిగితే నెల్లూరు సిటీలో నారాయణకు కష్టకాలం మొదలైనట్టే. బీజేపీ ఇక్కడ గెలుస్తుందని చెప్పలేం కానీ.. ప్రధాన పార్టీల ఓట్లు గణనీయంగా చీల్చే అవకాశాన్ని మాత్రం తిప్పికొట్టలేం.
ఎవరీ సురేంద్ర రెడ్డి..?
నెల్లూరు జిల్లాలో బీజేపీకి ఉన్న అతికొద్దిమంది ప్రముఖ నేతల్లో సురేంద్ర రెడ్డి కూడా ఒకరు. గతంలో ఆయన జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. రాష్ట్ర పార్టీ కార్యదర్శిగా పనిచేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం రాష్ట్ర బీజేపీలో ఐటీ, లీగల్ సెల్ లకు కోఆర్డినేటర్ గా ఉంటున్నారు. జిల్లా సమస్యలపై అవగాహన ఉంది, జిల్లాలో బీజేపీ తరపున జరిగే పోరాటాల్లో ఆయన ముందు వరుసలో ఉంటారు. అన్నిటికీ మించి నగరంలో పార్టీ కేడర్ తో ఆయనకు సత్సంబంధాలున్నాయి. ఆ మాటకొస్తే అటు టీడీపీనుంచి కూడా కొంతమంది ఈయనకు సానుభూతిపరులు ఉన్నారు. వారంతా వచ్చే ఎన్నికల్లో బీజేపీ వైపు వస్తే మాత్రం ఇప్పుడున్న పరిస్థితి తారుమారయ్యే అవకాశముంది.
బీజేపీ పరిస్థితి ఏంటి..?
ప్రస్తుతం ఏపీలో టీడీపీ-జనసేన పొత్తులో ఉన్నాయి. ఆ పార్టీల ఉమ్మడి అభ్యర్థులే వచ్చే ఎన్నికల్లో బరిలో ఉంటారు. బీజేపీతో కూడా పొత్తు ఉంటుందనే ఊహాగానాలు ఉన్నా కూడా అది ఎంతవరకు సాధ్యమవుతుందో చెప్పలేం. ప్రస్తుతానికి బీజేపీ నియోజకవర్గాల వారీగా ఆశావహుల జాబితా తయారు చేస్తోంది. ఈ క్రమంలోనే తాను విజయవాడ ఎంపీ స్థానానికి పోటీ చేస్తానని సుజనా చౌదరి ప్రకటించుకున్నారు. ఇటు నెల్లూరు సిటీ అసెంబ్లీ నుంచి సీనియర్ నేత సురేంద్ర రెడ్డి బరిలో ఉండే అవకాశముంది. పొత్తు లేకపోతే మాత్రం బీజేపీ అభ్యర్థులు.. టీడీపీ-జనసేన కూటమి విజయావకాశాలను దెబ్బతీస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు.
నెల్లూరు సిటీలో ప్రస్తుతం నారాయణ ప్రచారం జోరుగా సాగుతోంది. గతంలో తన హయాంలో చేసిన పనుల్ని చెబుతూనే.. అధికారంలోకి వస్తే ఏమేం చేస్తామనేది ఆయన వివరిస్తున్నారు. ఇప్పటికే వివిధ వర్గాల వారితో విడివిడిగా ఆయన సమావేశమవుతున్నారు. క్రికెట్ టోర్నమెంట్ లు నిర్వహిస్తూ యువతకు దగ్గరవుతున్నారు. అటు విద్యాసంస్థల ఉద్యోగులు కూడా నారాయణకు మద్దతుగా ప్రచార పర్వంలోకి దూకే అవకాశముంది. ఇక సిట్టింగ్ ఎమ్మెల్యే అనిల్ కి టికెట్ కన్ఫామ్ అయ్యే విషయం మరికొన్ని రోజుల్లో తేలిపోతుంది. ఆ తర్వాత ఆయన మరింత ఉధృతంగా జనంలోకి వెళ్తారు. అయితే ఈ దఫా అనిల్ కు సిటీ అభివృద్ధి గురించి చెప్పుకోడానికి పెద్దగా ఏమీ లేదని అంటున్నారు. ఐదేళ్లలో నగరంలో ఒకే ఒక్క ఫ్లైఓవర్ నిర్మించారు. పెన్నా పొర్లుకట్టలు నిర్మాణ దశలోనే ఉన్నాయి. నెల్లూరు బ్యారేజ్ ని ప్రారంభించినా.. దానికి సంబంధించి 90శాతం పనులు టీడీపీ హయాంలో పూర్తయినవే కావడం విశేషం. ఇప్పుడు త్రిముఖ పోరు నెల్లూరు సిటీ ముఖచిత్రాన్నే మార్చేసేలా ఉంది.