Nellore YSRCP News: ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పదికి పది అసెంబ్లీ స్థానాలు, రెండు పార్లమెంట్ స్థానాలు వైసీపీ ఏకపక్షంగా గెలుచుకుంది. అప్పటినుంచి ఇప్పటి వరకు ఇక్కడ ప్రతిపక్షం బలపడలేదు. ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో కూడా వైసీపీ హవా కనపడింది. నెల్లూరు నగర కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా వైసీపీ క్లీన్ స్వీప్ చేయడంతో టీడీపీ ప్రాధాన్యం అస్సలు లేదని తేలిపోయింది. ప్రతిపక్ష ప్రభావం నామమాత్రమే అయినా నెల్లూరులో రాజకీయ వేడి మాత్రం తగ్గలేదు. వైసీపీ వర్సెస్ వైసీపీ అన్నట్టుగా ఉంది ఇక్కడ పరిస్థితి.
ఇటీవల జరిగిన మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణతో నెల్లూరు పాలిటిక్స్ మరోసారి రచ్చకెక్కాయి. నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ కు మంత్రి పదవి పోవడం, అదే సమయంలో సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డికి కొత్తగా మంత్రి పదవి దక్కడంతో సరికొత్త రాజకీయం మొదలైంది.
కోటంరెడ్డితో అనిల్ భేటీ..
ఇటీవల మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణ సందర్భంగా తనకు పదవి రాలేదని మీడియా సమక్షంలోనే కన్నీళ్లు పెట్టుకున్నారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఇక మంత్రి వర్గం నుంచి బయటకొచ్చిన అనిల్ కుమార్ యాదవ్.. తాజా మంత్రి కాకాణిపై చేసిన వ్యాఖ్యలు కూడా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మంత్రి పదవి దక్కలేదని బాధపడిన ఎమ్మెల్యే, మంత్రి వర్గం నుంచి బయటకొచ్చిన ఎమ్మెల్యే.. ఇద్దరూ ఇప్పుడు భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. సహజంగా ఒకరింటికి ఒకరు వెళ్లి పలకరించుకుంటే పెద్దగా చర్చ జరిగేది కాదు. కానీ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ఇప్పుడు పూర్తిగా ప్రజల్లోకి వచ్చేశారు. నెలరోజులపాటు ఇంటికి దూరంగా జగనన్న మాట గడప గడపకు కోటంరెడ్డి బాట అనే కార్యక్రమం చేపట్టారు. ప్రతి రోజూ కార్యకర్తల ఇళ్లలోనే బస చేస్తూ తన యాత్ర కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో పాదయాత్రలో ఉన్న ఎమ్మెల్యే కోటంరెడ్డిని వెళ్లి కలిశారు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్. వీరిమధ్య జరిగిన భేటీ సారాంశం ఏంటనేది బయటకు రాలేదు.
అనిల్ కుమార్ యాదవ్ కూడా ఇప్పుడు సిటీలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. మంత్రిగా ఉన్నప్పుడు నియోజకవర్గానికి కాస్త దూరమైనా, ఇప్పుడు ప్రజల్లోనే ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ దశలో ఇద్దరు ఎమ్మెల్యేలు సమావేశం కావడం, అనంతరం ఎవరూ ఎలాంటి ప్రకటన చేయకపోవడం నెల్లూరు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణ విషయంలో, కొత్తగా కాకాణికి పదవి దక్కిన సందర్భంలో నెల్లూరు వైసీపీలో లుకలుకలు మొదలయ్యాయని అంటున్నారు. కాకాణి, ఆనం రామనారాయణ రెడ్డి ఒక వర్గం కాగా.. మిగతా ఎమ్మెల్యేలలో కొంతమంది మరో జట్టుగా తయారయ్యారని అంటున్నారు. ఇటీవలే నెల్లూరు సిటీలో కాకాణి ఫ్లెక్సీలు తొలగించడం కూడా పలు అనుమానాలకు తావిస్తోంది. మరో రెండు రోజుల్లో మంత్రి కాకాణి సొంత జిల్లాకు వస్తున్న సందర్భంలో నెల్లూరు పాలిటిక్స్ మరింత రసవత్తరంగా మారాయి.