నిన్న(బుధవారం) సాయంత్రం నియోజకవర్గ పరిశీలకుడిపై సంచలన ఆరోపణలు చేశారు ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి. సీన్ కట్ చేస్తే, ఈరోజు(గురువారం) ఆయన నెల్లూరులో మంత్రి కాకాణి ఇంటిలో ప్రత్యక్షమయ్యారు. ఒకరితో కలసి ఇంకొకరు ఇలా పార్టీ పరువు తీయడమేంటని కాకాణి కాస్త గట్టిగానే క్లాస్ తీసుకున్నట్టు తెలుస్తోంది. ఉదయగిరి నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యేగా మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారు. ఆయనతోపాటు నియోజకవర్గ పరిశీలకుడిగా కొడవలూరు ధనుంజయ్ రెడ్డిని ఇటీవల పార్టీ నియమించింది. గడప గడపకు మన ప్రభుత్వంలో భాగంగా ధనుంజయ్ రెడ్డి కూడా ఉదయగిరిలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ఆయనకు, స్థానిక ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డికి మధ్య విభేదాలొచ్చాయి. దీనిపై చంద్రశేఖర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మరీ తన ఆవేదన వ్యక్తం చేశారు.
చంద్రశేఖర్ రెడ్డి ఆరోపణల తర్వాత, జిల్లాలో ఈ వ్యవహారం మరింత రచ్చగా మారింది. అసలే నెల్లూరు జిల్లాలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీపై తీవ్ర ఆరోపణలు చేశారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి వ్యాఖ్యలతో నెల్లూరు జిల్లా రాజకీయం వేడెక్కింది. ఈ దశలో చంద్రశేఖర్ రెడ్డి కూడా అసంతృప్త గళం వినిపించే సరికి పార్టీలో అది తీవ్ర చర్చనీయాంశమైంది. దీంతో వెంటనే మంత్రి కాకాణి, చంద్రశేఖర్ రెడ్డిని పిలిపించి మాట్లాడారు.
పార్టీ అంతర్గత వ్యవహారాలు మీడియా ముందు మాట్లాడొద్దని ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డికి సూచించారు మంత్రి కాకాణి. పార్టీ వ్యవహారాలు బయటకు వెళ్లడంతో ఇప్పటికే జిల్లాలో పార్టీ ఇబ్బందికర పరిస్థితుల్లో ఉందని, ఇలాంటి దశలో మరోసారి ఆరోపణలు చేసి పార్టీని ఇబ్బంది పెట్టొద్దని ఆయన సూచించారు. సమన్వయకర్త ధనుంజయ రెడ్డితో ఇబ్బందులు ఉంటే పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని భరోసా ఇచ్చారు. బుజ్జగిస్తూనేమరోసారి ఇలా చేయొద్దని చంద్రశేఖర్ రెడ్డికి కాస్త గట్టిగానే సూచించారు కాకాణి.
కనిపించని శాంతి కుమారి..
ఆమధ్య చంద్రశేఖర్ రెడ్డి భార్యగా నియోజకవర్గ ప్రజలకు పరిచయమైన శాంతి కుమారి అలియాస్ శాంతమ్మ.. కొన్నాళ్లపాటు ఎమ్మెల్యేతో కలసి గడప గడప కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రభుత్వ అధికారుల సమీక్ష, సమావేశాల్లో కూడా ఆమెకు సముచిత స్థానం కల్పించారు ఎమ్మెల్యే. అయితే ఆ తర్వాత మరో కుర్రాడు తాను ఎమ్మెల్యే కొడుకుని అని చెప్పడం, మరో మహిళ కూడా తనకు గౌరవం కల్పించాలనడంతో.. అధిష్టానం ఈ వ్యవహారంపై దృష్టి పెట్టింది. శాంతి కుమారిని అధికారిక కార్యక్రమాలకు తేవొద్దని ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డికి సూచించింది. దీంతో శాంతి కుమారి కూడా ఎక్కడా రాజకీయ కార్యక్రమాల్లో కనిపించడంలేదు. ఆమెను చంద్రశేఖర్ రెడ్డి తన వెంట తీసుకు రావడంలేదు. ఇప్పుడు కొత్తగా నియోజకవర్గ పరిశీలకుడిపై చంద్రశేఖర్ రెడ్డి రాద్ధాంతం చేయడంతో ఉదయగిరి రాజకీయాలు మళ్లీ తెరపైకి వచ్చాయి. కాకాణి సూచనలతో ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి సైలెంట్ గా ఉంటారో లేదో చూడాలి. ఒకవేళ చంద్రశేఖర్ రెడ్డి ఇంకా అసంతృప్తితో ఉంటే మాత్రం ఆ వ్యవహారం అధిష్టానమే తేలుస్తుంది.