జగన్‌పై సెటైర్లు పేల్చిన మేకపాటి- సస్పెన్షన్‌పై ఆయన రియాక్షన్ ఏంటంటే?

జగన్ కు మద్దతుగా అప్పట్లో కాంగ్రెస్ నుంచి బయటకొచ్చినందుకు, ఇన్నాళ్లూ ఆయనతోనే ఉన్నందుకు పార్టీలో చాలా మర్యాదలు చేశారు అంటూ సెటైర్లు వేశారు చంద్రశేఖర్ రెడ్డి.

Continues below advertisement

వైసీపీకి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి దూరం జరగడం ఎంత ఆశ్చర్యకరమో, అదే జిల్లాలో మేకపాటి కుటుంబం పార్టీకి దూరమైందనే వార్త కూడా అంతే ఆశ్చర్యం కలిగిస్తోంది. అయితే మేకపాటి కుటుంబంలో కేవలం చంద్రశేఖర్ రెడ్డిపై మాత్రమే పార్టీ వేటు వేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విప్ ని ధిక్కరించినందుకు ఆయనను సస్పెండ్ చేసింది. ఈ సస్పెన్షన్ వేటుపై చంద్రశేఖర్ రెడ్డి సెటైర్లు వేశారు. సస్పెన్షన్ వల్ల ఎంతో రిలాక్స్ గా ఫీలవుతున్నానన్నారు. ఇప్పుడే తనకు ఎక్కువ సంతోషంగా ఉందన్నారు. మంచి చేసిన వారికి కూడా కొందరు చెడు చేస్తారని జగన్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు మేకపాటి.

Continues below advertisement

వెన్నుపోటు నాకే పొడిచారు..
కాంగ్రెస్ నుంచి జగన్ బయటకొచ్చిన తర్వాత ఆయనతోపాటు కలసి నడిచిన అతికొద్ది మందిలో మేకపాటి కుటుంబం కూడా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టకముందు నుంచీ ఆ కుటుంబం జగన్ తో సన్నిహితంగా ఉంటూ వచ్చింది. పార్టీ పెట్టాక మేకపాటి కుటుంబానికి కూడా జగన్ అత్యంత ప్రాధాన్యతనిచ్చారు. మేకపాటి కుటుంబంలో ఇద్దరికి పోటీ చేసే అవకాశమిచ్చారు. మంత్రివర్గంలో గౌతమ్ రెడ్డిని తీసుకున్నారు. ఆయన మరణం తర్వాత అదే కుటుంబానికి టికెట్ ఇచ్చారు, కానీ మంత్రి పదవి మాత్రం ఇవ్వలేదు. ఇప్పుడు మేకపాటి కుటుంబంలో ఒకరిపై వేటు వేశారు. 

పార్టీకి నమ్మకంగా ఉన్న తమపై వేటు వేయడం సరికాదంటున్నారు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి. తనకు కేటాయించిన జయమంగళ వెంకట రమణకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాను ఓటు వేశానని బల్లగుద్ది చెబుతున్నారు. అయినా తనను సస్పెండ్ చేశారని, నమ్మినవారిని నట్టేట ముంచడం అంటే ఇదేనన్నారాయన. 

ప్రమాణానికి సిద్ధమా సజ్జలా..?

పార్టీనుంచి గెంటేస్తూ.. ఆ నలుగురిపై పెద్ద నిందేవేసింది అధిష్ఠానం. ఒక్కొకరు చంద్రబాబు దగ్గర 15కోట్ల నుంచి 20కోట్ల రూపాయల వరకు డబ్బులు తీసుకున్నారని, అందుకే టీడీపీ అభ్యర్థికి ఓటు వేశారని చెప్పుకొచ్చారు సజ్జల. ఈ డబ్బుల వ్యవహారంపై మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి సీరియస్ గా స్పందించారు. తాను రూ.20 కోట్లు తీసుకున్నట్టు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రమాణం చేసేందుకు సిద్ధమా? అంటూ సవాల్‌ విసిరారు.

అనుకున్నది చేసేయడం వైసీపీలో అలవాటుగా మారిందని విమర్శించారు చంద్రశేఖర్ రెడ్డి. జగన్ కు మద్దతుగా తామంతా అప్పట్లో కాంగ్రెస్ నుంచి బయటకొచ్చినందుకు, ఇన్నాళ్లూ ఆయనతోనే ఉన్నందుకు.. పార్టీలో చాలా మర్యాదలు చేశారు అంటూ సెటైర్లు వేశారు. కావాలంటే ఇప్పుడే రాజీనామా చేస్తానని అన్నారు, ఉదయగిరిలో ఎవరు గెలుస్తారో చూద్దామంటూ సవాల్ విసిరారు. పార్టీ అగ్రనేతలకు మానవతా విలువలు అవసరం అని హితవు పలికారు మేకపాటి. సస్పెన్షన్ వ్యవహారంతో.. చాలామంది వైసీపీ ఎమ్మెల్యేల్లో గుసగుసలు మొదలయ్యాయని అన్నారు. 

మేకపాటిలో అసంతృప్తి దేనికి..?
మేకపాటి కుటుంబం జగన్ కి సన్నిహితమే అయినా.. ఉదయగిరి నియోజకవర్గంలో స్థానికంగా అసమ్మతి పెరిగిపోయింది. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిపై చాలా ఫిర్యాదులొచ్చాయి. ఇటీవల ఆయన అనారోగ్యంతో నియోజకవర్గంలో పెద్దగా తిరగలేకపోవడం, తనతోపాటు తన భార్యకు కూడా పెత్తనం ఇవ్వాలని చూడటంతో అది చాలామందికి నచ్చలేదు. చివరకు అధిష్టానం సూచనతో ఆయన భార్యను రాజకీయ కార్యక్రమాలకు తీసుకు రావడంలేదు. గౌతమ్ రెడ్డి మరణం తర్వాత మేకపాటి కుటుంబంలో కూడా విభేదాలొచ్చాయని, అన్నదమ్ముల మధ్య ఆస్తి పంపకాల్లో గొడవలున్నాయని అంటారు. ఈ వ్యవహారాలన్నిటితో వచ్చే ఎన్నికల్లో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి ఉదయగిరి టికెట్ ఇవ్వలేనని జగన్ తేల్చి చెప్పారు, కావాలంటే ఎమ్మెల్సీ ఇస్తానన్నారు. కానీ ఆయన ఒప్పుకోలేదు. ఇక్కడే వ్యవహారం తేడా కొట్టిందంటారు. మేకపాటి క్రాస్ ఓటింగ్ కి పాల్పడ్డారనే అనుమానం మొదలైంది. అయితే పార్టీ దాన్ని నిర్థారించి ఏకంగా సస్పెన్షన్ వేటు వేసింది. 

Continues below advertisement