నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దీంతో నెల్లూరులోని మాగుంట లేఅవుట్‌లో ఉన్న కోటంరెడ్డి కార్యాలయాన్ని పోలీసులు చుట్టుముట్టడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ టీడీపీ, జనసేన, సీపీఐ పార్టీలు శాంతియుత ర్యాలీకి పిలుపునిచ్చాయి. సాయంత్రం 4 గంటలకు నెల్లూరులోని వీఆర్‌సీ కూడలి నుంచి గాంధీ బొమ్మ కూడలి వరకు ర్యాలీ జరగాల్సి ఉంది. ఈ ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసులు ఉదయం నుంచే మూడు పార్టీలకు చెందిన కీలక నాయకులను గృహనిర్బంధాలు చేస్తున్నారు. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, పలువురు నాయకులను గృహనిర్బంధం చేశారు.
ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డిని గృహనిర్బంధం చేసేందుకు పెద్ద ఎత్తున పోలీసులు చేరుకున్నారు. పోలీసుల రాక తెలిసిన కోటంరెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లారు. అక్కడ ఎమ్మెల్యే లేకపోవడంతో ఆయన ఆచూకీ తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. దీంతో బృందాలుగా విడిపోయిన పోలీసులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కోసం గాలింపు చేపట్టారు. ఎలాగైనా సరే వీఆర్‌సీ కూడలికి వెళ్లేందుకు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు.
టీడీపీలో చేరకపోయినా...ఇన్ చార్జ్
కొన్ని నెలల నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి టీడీపీ కీలక బాధ్యతలు అప్పగించింది. నెల్లూరు రూరల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్‌గా నియమించారు. కోటంరెడ్డి అధికారికంగా టీడీపీలో చేరకపోయినా కొంతకాలంగా టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. లోకేష్ పాదయాత్రకు ముందు టీడీపీ నేతలు కోటంరెడ్డిని కలిశారు. టీడీపీలోకి రావాలని ఆయన్ను ఆహ్వానించారు.. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో లోకేష్ పాదయాత్రను దగ్గరుండి చూసుకున్నారు. లోకేష్ పాదయాత్ర సందర్భంగా నిర్వహించిన సభలో కూడా కోటంరెడ్డి శ్రీధర్ పాల్గొన్నారు. అధికారికంగా పార్టీలో చేరకపోయినా సరే టీడీపీ అధిష్టానం ఆయనకు రూరల్ బాధ్యతల్ని అప్పగించింది. కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అధికారికంగా టీడీపీలో చేరకపోయినా రూరల్ నియోజకవర్గంపై ఫోకస్ పెట్టారు. తన రాకను వ్యతిరేకిస్తున్న టీడీపీ నేత అబ్దుల్ అజీజ్‌తో సమావేశం అయ్యారు.
ఫోన్ ట్యాప్ చేశారంటూ...
వైఎస్సార్‌సీపీలో తనను అవమానించారని, తన ఫోన్‌ను ట్యాప్ చేశారని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోపణలు చేశారు. వైసీపీ సర్కార్ తీరుపై ఘాటు విమర్శలు చేశారు. తనను అనుమానించిన పార్టీతో కలిసి నడిచేది లేదని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీకి అనుకూలంగా ఓటు వేశారని వైసీపీ నుంచి సస్పెండ్ చేశారు. కొంతకాలం క్రితం శ్రీధర్ రెడ్డి సోదరుడు గిరిధర్‌రెడ్డి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. టీడీపీకి 2019 ఎన్నికల్లో ఒక్కు సీటు కూడా గెలుచుకోలేదు.. ఈసారి మాత్రం మెజార్టీ స్థానాల్లో విజయం సాధించాలని పట్టుదలతో ఉంది.
ప్రభుత్వం కక్ష సాధిస్తోంది-కోటంరెడ్డి
మానసికంగా హింసించేందుకే ప్రభుత్వం భద్రత తగ్గించిందన్నారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. బెదిరింపు ఫోన్‌కాల్స్ వస్తున్న సందర్భంలో ఇద్దరు గన్మెన్లను తొలగించడమేంటని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం తనకు 2+2 భద్రత కల్పించిందన్నారు. ఎవరి ఆదేశాలతో గన్మెన్లను తొలగించారని కొద్ది రోజుల క్రితం ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎక్కడికైనా ఒంటరిగా వెళ్తానని, ఏం భయపడనని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజల గొంతుకే తన గొంతుక అని వివరించారు. సినిమా డైలాగులు చెప్పటం లేదన్న ఆయన అసలు నిజమిదేనని తగ్గేదేలే అని హెచ్చరించారు. మరింత పట్టుదలతో ముందుకెళ్తానని అన్నారు.