Nellore News: కొత్తగా నెల్లూరు జిల్లాలో చేరిన నియోజకవర్గం కందుకూరు. 1999 తర్వాత ఇక్కడ తెలుగుదేశం పార్టీ(TDP)కి అవకాశమే రాలేదు. నవ్యాంధ్ర ప్రదేశ్ ఏర్పడిన తర్వాత కూడా రెండుసార్లు వైసీపీ(YSRCP) అభ్యర్థులే ఇక్కడి నుంచి గెలిచారు. ఈసారి మాత్రం ఇక్కడ టీడీపీ పాగా వేయాలనుకుంటోంది. అందు కోసం కాస్త బలంగానే ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇప్పటి వరకూ ఇక్కడ టీడీపీ ఇన్ చార్జ్ గా ఇంటూరి నాగేశ్వరరావు(Inturi Nageswara Rao) ఉన్నారు. దాదాపుగా ఆయనే టీడీపీ అభ్యర్థి అనే ప్రచారం జరిగింది. అయితే సడన్ గా ఇప్పుడు ఆయనకు పోటీ వస్తున్నారు ఓ మహిళా నేత. ఆమె టీడీపీలో సీనియర్ కాదు, అలాగని రాజకీయాలకు కొత్త మాత్రం కాదు. ప్రస్తుతం బీజేపీలో ఉండి, బీజేపీ కందుకూరు ఇన్ చార్జ్ గా ఉన్న ఉన్నం నళినీ దేవి(Unnam Nalini Devi) ఇప్పుడు టీడీపీలో చేరుతున్నారు. టీడీపీ కందుకూరు టికెట్ ఆమెకేననే ప్రచారం బలంగా జరుగుతోంది. ఆ హామీతోనే ఆమె టీడీపీలో చేరుతున్నారని కూడా తెలుస్తోంది. మరి ఎన్నికల వేళ చంద్రబాబు ఎవరికి టికెట్ ఇస్తారో వేచి చూడాలి.
కందుకూరు ప్రత్యేకం..
ఏడాది క్రితం కందుకూరు నియోజకవర్గం పేరు రాష్ట్రవ్యాప్తంగా మారుమోగింది. 2022 డిసెంబర్ చివర్లో కందుకూరులో జరిగిన టీడీపీ మీటింగ్ లో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో 8మంది చనిపోయారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ ప్రమాదం సంచలనంగా మారింది. ఆ తర్వాత కందుకూరు ఒక్కసారిగా వార్తల్లోకెక్కింది. ప్రమాదం జరిగిన వెంటనే టీడీపీ స్పందించిన తీరు, స్థానిక నేతలు బాధితుల్ని ఆదుకున్న తీరు స్థానిక ప్రజలకు ఇంకా గుర్తుండే ఉంటుంది. ప్రమాదం వల్ల కందుకూరులో టీడీపీ క్రేజ్ తగ్గుతుందని అందరూ భావించినా.. వారికి మాత్రం ఎలాంటి నష్టం జరగలేదని అంటున్నారు.
వైసీపీ సంగతేంటి..?
కందుకురూ వైసీపీ ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి ఈసారి అంత టఫ్ ఫైట్ ఇచ్చేలా లేరు. ప్రస్తుతం పార్టీ ఆయనకు ఇంకా టికెట్ ఖరారు చేయలేదు. ఇటీవల అధిష్టానంతో మానుగుంటకు వ్యవహారం చెడిందనే వార్తలు కూడా వినపడుతున్నాయి. టీడీపీ, జనసేన నేతల్ని ఘాటుగా విమర్శించాలని ఐప్యాక్ టీమ్ ఎమ్మెల్యేకి సూచించడంతో రాజకీయ కలకలం రేగింది. పక్క పార్టీలవారిని తిట్టి టికెట్ దక్కించుకోవాల్సిన అవసరం తనకు లేదంటున్నారు మానుగుంట. ఈ దశలో అసలాయనకు వైసీపీ అధిష్టానం టికెట్ ఇస్తుందో లేదో కూడా తెలియదు.
టీడీపీలో ఎవరికి..?
ఇప్పటి వరకు ఇంటూరు నాగేశ్వరరావు టీడీపీ ఇన్ చార్జ్ గా ఉన్నారు. అదే నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున పోరాటాలు చేసిన ఉన్నం నళినీ దేవి సడన్ గా టీడీపీలోకి వస్తుండటంతో పరిస్థితులు మారిపోయాయి. మహిళ కావడంతో ఆమెకు అక్కడ టీడీపీ టికెట్ దక్కే ఛాన్స్ లు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. ఆ హామీతోనే ఆమె టీడీపీలోకి వస్తున్నారనే ప్రచారం కూడా ఉంది.
ఉన్నం నళినీ దేవి కందుకూరు నియోజకవర్గ అభివృద్ధిపై ముందు నుంచీ ఫోకస్ తో ఉన్నారని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. రామయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టి స్థానికంగా పట్టుందని అంటున్నారు. స్థానికంగా ఆటల పోటీలు నిర్వహించి క్రీడాకారులకు స్పోర్ట్స్ కిట్ లు అందిస్తుంటారామె. బీజేపీ తరపున వివిధ కార్యక్రమాల్లో కూడా ఆమె చురుగ్గా పాల్గొన్నారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందరేశ్వరితో కూడా ఆమెకు సత్సంబంధాలున్నాయి. బీజేపీలో కూడా ఆమె చురుగ్గా ఎదుగుతున్నారు. అయితే ఆమె సడన్ గా టీడీపీ స్టాండ్ తీసుకోవడం విశేషం. టీడీపీలో స్థానిక నేతలు కూడా ఆమె రాకను స్వాగతిస్తున్నారు. అయితే ఇంటూరి నాగేశ్వరరావు వర్గం మాత్రం ఆమెతో పోటీ తప్పదని ఫిక్స్ అయింది. మరి కందుకూరు టికెట్ పై చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.