తుపాను తీరం దాటినా నెల్లూరు వాసులకు కష్టాలు తప్పలేదు. రాత్రి కరెంటు లేక అందరూ జాగారం చేయాల్సిన పరిస్థితి. ఈరోజు ఇప్పటి వరకూ చాలా ప్రాంతాల్లో కరెంటు లేదు. కరెంటు పునరుద్ధరించేందుకు విద్యుత్ శాఖ సిబ్బంది నిరంతరం పనిచేస్తున్నా కూడా సాధ్యం కావడంలేదు. ఆ స్థాయిలో నెల్లూరు జిల్లాలో విద్యుత్ శాఖకు నష్టం జరిగింది. చెట్లు విపరీతంగా నేలకొరిగాయి. ఎక్కడికక్కడ విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. వీటిని సకాలంలో పునరుద్ధరించడం కుదరలేదు. దీంతో నెల్లూరు వాసులు కరెంటు లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ఓవైపు జోరువాన.. బయట వర్షం పడుతున్నా ఇంట్లో నిత్యావసరాలకు నీళ్లు లేవు. ఓవర్ హెడ్ ట్యాంకుల్లోని నీళ్లన్నీ ఖాళీ అయ్యాయి. మున్సిపల్ వాటర్ కి కూడా వీలు లేదు. దాదాపు ఒకరోజంతా నెల్లూరు వాసులు నీటికోసం కష్టాలు పడ్డారు. అపార్ట్ మెంట్లలో ఉన్నవారి పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఏ పని జరగాలన్నా ట్యాప్ తిప్పాలి, నీళ్లు రావాలి. ట్యాంకులు ఖాళీ అయ్యే సరికి నీళ్లు రావడంలేదు, కరెంటు లేకపోయే సరికి ట్యాంకులు నిండడంలేదు. బయటనుంచి వాటర్ క్యాన్లు కొనాలన్నా.. వాటర్ ప్లాంట్లు కరెంటు లేక పనిచేయలేదు. అటు అధికారులు కూడా పునరావాస కేంద్రాల్లో ఉన్నవారి సహాయంపై పూర్తి స్థాయిలో దృష్టిపెట్టారు కానీ, ఇటు ఇళ్లలో ఉండి ఇబ్బంది పడుతున్నవారిని పెద్దగా పట్టించుకోలేదన్న విమర్శలున్నాయి.
నేలకొరిగిన భారీ వృక్షాలు..
తాజా తుపానుతో జలవిలయంతోపాటు ఎక్కడికక్కడ చెట్లు నేలకొరిగాయి. పెద్ద సంఖ్యలో స్తంభాలు పడిపోయాయి. సాధారణ పరిస్థితుల్లో వెంటనే విద్యుత్ శాఖ యుద్ధప్రాతిపదికన పనులు చేపడుతుంది. వెంటనే విద్యుత్ ని పునరుద్ధరిస్తుంది. కానీ ఈసారి మాత్రం పునరుద్ధరణ పనులకు కూడా వాతావరణం సహకరించలేదు. తుపాను తీరం దాటిన తర్వాతే మరమ్మతు పనులు మొదలయ్యాయి. అప్పటి వరకు కరెంటు లేక అవస్థలు పడ్డారు ప్రజలు.
వాట్సప్ గ్రూపుల్లో ఆవేదన..
స్థానికంగా ఉండే వాట్సప్ గ్రూపుల్లో ప్రజలు తమ ఆవేదన చెప్పుకున్నారు. తమ ప్రాంతంలో కరెంటు లేదంటే, తమ ప్రాంతంలో లేదని, విద్యుత్ అధికారులకు చెప్పుకున్నా పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా లోని పలు ప్రాంతాలతోపాటు, నగరవాసులు ముఖ్యంగా ఇబ్బంది పడ్డారు. తుపాను ప్రభావం తొలగిపోయి గంటలు గడుస్తున్నా కూడా ఈరోజు(బుధవారం) ఇప్పటి వరకు చాలా ప్రాంతాల్లో కరెంటు ఇంకా రాలేదు.
తగ్గిన తుపాను ప్రభావం...
నెల్లూరు జిల్లాపై తుపాను ప్రభావం పూర్తిగా తగ్గింది. మంగళవారం సాయంత్రం నుంచి పరిస్థితిలో మార్పు వచ్చింది. ఈదురుగాలులు తగ్గిపోయాయి. ఈరోజు(బుధవారం) పూర్తిగా వాతావరణం నిర్మలంగా ఉంది. ఈరోజునుంచి జిల్లాలో స్కూల్స్ తిరిగి ప్రారంభమవుతున్నాయి. జిల్లా యంత్రాంగం ప్రాణ నష్టం లేకుండా కాపాడగలిగింది. ఆస్తి నష్టం మాత్రం లెక్క వేయాల్సి ఉంది. వ్యక్తిగతంగా ఇళ్లు, గోడలు కూలిపోవడంతోపాటు పంట నష్టంపై కూడా అంచనాలు వేయాల్సి ఉంది. పంట నష్టం అంచనాలు లెక్క తేలితే.. జిల్లాకు తుపాను నష్టం ఎంతో తేలుతుంది. తుపాను నష్టం అంచనాకు ప్రభుత్వం అధికారుల బృందాల్ని ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇళ్లు కూలిపోయిన వారికి ఇప్పటికే సీఎం జగన్ సాయం ప్రకటించారు. పునరావాస కేంద్రాలనుంచి తిరిగి వెళ్లిపోయేవారికి కూడా ఆర్థిక సాయం చేస్తారు.