Nellore News : నెల్లూరు జిల్లా అభివృద్ధి కమిటీ సమావేశంలో ఎమ్మెల్యేలు అధికారులపై చిందులు తొక్కారు. సీఎం జగన్ ఆశయాలకు కొంతమంది అధికారులు తూట్లు పొడుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వావిలేటి పాడులో జగనన్న ఇళ్ల స్థలాలు అభివృద్ధికి అడ్డంకులు తొలగించి పని మొదలు పెట్టేలా హామీ ఇవ్వాలని కోరారు. 15 రోజుల్లో పనులు మొదలు కాకపోతే గాంధీగిరి తరహాలో ధర్నా చేస్తానన్నారు.
ఎమ్మెల్యే ధర్నాలు
నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలో గతంలో కూడా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఈ తరహాలోనే ధర్నాలు చేశారు. దీంతో అప్పటికప్పుడే అధికారులు దిగి వచ్చిన ఉదాహరణలున్నాయి. ప్రస్తుతం ఎమ్మెల్యే ఇళ్ల స్థలాల అభివృద్ధికోసం పట్టుబడుతున్నారు. ఈ సబ్జెక్ట్ ని కూడా మంత్రుల ముందు ఉంచారు. వారితోనే నేరుగా చెప్పేశారు. అధికారులు దిగిరాకపోతే ధర్నా చేస్తానన్నారు దీంతో అధికారులు హడావిడి పడుతున్నారు.
ఆనం ఆగ్రహం
వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి కూడా అధికారులపై ఫైర్ అయ్యారు. కొంతమంది అధికారుల వల్ల అధికార పార్టీకి చెందిన సీనియర్ నేత సైదాపురంకి చెందిన ఉప సర్పంచ్ మరణించారని.. ఇది హత్యకంటే తక్కువైనదేమీ కాదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వారి పేర్లు బయటకు చెప్పను కానీ, వారి లిస్ట్ ఇస్తున్నానని, కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి, జిల్లా ఇన్ చార్జి మంత్రి అంబటి రాంబాబుని కోరారు.
అధికార పార్టీకి చెందిన ఉప సర్పంచ్ ఒకరు ఇంటి నిర్మాణం చేపడితే దాన్ని ఎవరో అడ్డుకోవాలని చూశారని, దానిపై ఎమ్మార్వోకి ఫిర్యాదు అందగా ఆయన అంతా సక్రమంగానే ఉందని చెప్పారని, అయినా పదే పదే కొంతమంది అడ్డుకోవాలని చూస్తున్నారని, వారికి అధికారులు వంతపాడటం సరికాదన్నారు ఆనం రామనారాయణ రెడ్డి. అలాంటి వారి వల్ల ఆ ఉప సర్పంచ్ మానసిక వ్యధతో ప్రాణం వదిలారని, ఆ కుటుంబానికి ఎవరు దిక్కంటూ ప్రశ్నించారు.
అధికారుల సాయం కావాలి
ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలో కొత్త స్కూల్స్ ఏర్పాటుకి, కొన్నిచోట్ల స్కూల్ ప్రహరీల ఏర్పాటుకి అధికారులు సహకారం అందించాలని కోరారు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి. గతంలో పెన్నాకు వరదలు వచ్చిన సమయంలో సంగం మండలంలోని కొన్ని గ్రామాలు.. నీటమునిగిపోయాయని, ఇప్పటికీ అక్కడ వరద భయంతోనే ప్రజలు ఉన్నారని ప్రస్తావించారు. ఆయా గ్రామాల్లో ముంపు భయం తొలగి పోవాలంటే అధికారులు వెంటనే పెన్నాకు బండ్ నిర్మించాలన్నారు. దీనికోసం సీఎం దగ్గర తాను ప్రతిపాదన ఉంచానని, ఆయన సానుకూలంగా స్పందించారని చెప్పారు.
ఇళ్ల నిర్మాణాలపై
పాత ప్రకాశం జిల్లా, ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో కలసిన కందుకూరు నియోజకవర్గంలో కూడా సమస్యలను ప్రస్తావించారు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి. పాటశాలల్లో విద్యా కమిటీ ఛైర్మెన్లుగా ఎన్నికైన వ్యక్తి పేర్లు మార్చేసి, కొత్తవారికి అవకాశమిస్తున్నారని, ఇలా పేర్లు ట్యాంపరింగ్ చేసేవారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని మంత్రులకు ఫిర్యాదు చేశారు. ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రేఖరరెడ్డి కూడా ఈ సమావేశంలో తమ ఇబ్బందులను ప్రస్తావించారు. జగనన్న కాలనీలలో ఇళ్ళ నిర్మాణాలు వెంటనే పూర్తి చేయాలని, దీనికి అధికారులు సహకరించాలని కోరారు. ఈ సమావేశానికి నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్, కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి హాజరు కాలేదు. మొత్తమ్మీద నెల్లూరు జిల్లా అభివృద్ధి కమిటీ మీటింగ్ నేతల ప్రశ్నలు, ఆరోపణలతో హాట్ హాట్ గా సాగింది.