YSRCP MLA Prasanna Kumar Reddy comments on Vemireddy Couple- నెల్లూరు: వేమిరెడ్డి కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ.. ప్రభాకర్ రెడ్డి సతీమణి ప్రశాంతి రెడ్డిపై కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేతలు భగ్గుమన్నారు. ఎమ్మెల్యే ప్రసన్నభాష అత్యంత అభ్యంతరకరం అని విమర్శించారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఎన్నికల సమయంలో వైసీపీ నేతలు ఉచ్ఛ నీచాలు మరిచి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్ష నేతలు, కార్యకర్తల మీద సోషల్ మీడియాలో దాడులు చేస్తున్నారని, అది చాలదన్నట్టు ఇలా వ్యక్తిగత విమర్శలకు దిగడం దారుణం అని అన్నారు కోటంరెడ్డి. 


కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి వైసీపీ తమ ప్రత్యర్థులను సోషల్ మీడియా ద్వారా వేధింపులకి గురి చేస్తోందని అన్నారు కోటంరెడ్డి. వైసీపీ పెయిడ్ ఆర్టిస్టుల ద్వారా కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ కొనుగోలు చేసి ప్రతిపక్షాలను మానసికంగా హింసిస్తున్నారని చెప్పారు. సీఎం జగన్ చెల్లెలు షర్మిల, సునీతపై కూడా సోషల్ మీడియాలో వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని అన్నారు. సీఎం జగన్, ఆయన సలహాదారుల ఆదేశాలతో వారి సొంత పత్రికలో కూడా తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు కోటంరెడ్డి. యథా నాయకుడు, తథా అనుచరులు అన్నట్టుగా వైసీపీ నేతలు కూడా సొంత బంధువులు, చెల్లెళ్లపై మానసిక వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. 


ప్రశాంతి రెడ్డి నీకు చెల్లెలు కాదా..
కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడుతున్న భాష అత్యంత అభ్యంతరకరం అన్నారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ప్రసన్న కుమార్ రెడ్డికి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి వరుసకు చెల్లెలు అవుతారని చెప్పారాయన. ఇదే ప్రసన్న కుమార్ రెడ్డి నెలరోజుల క్రితం.. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆయన సతీమణి ప్రశాంతి రెడ్డిని ఆలయానికి పిలిచి యాగం చేయించారని, వారిద్దరినీ ఆదిదంపతులు అని కీర్తించారని చెప్పారు. నెల రోజుల ముందు ఆదిదంపతులు అన్న నోరు ఇవాళ ఇంకో విధంగా మాట్లాడుతుందేంటని ప్రశ్నించారు. ప్రశాంతిరెడ్డి టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగడమే పాపమా అని అన్నారు కోటంరెడ్డి. 


వైసీపీకి వెన్నుపోటు పొడవలేదు 
వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఉన్నత చదువులు చదివి, వ్యాపారవేత్తగా ఎదిగారని, రాజకీయాల్లోకి రాకముందే వేమిరెడ్డి సామాజిక సేవా కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించారని గుర్తు చేశారు కోటంరెడ్డి. వేమిరెడ్డి వైసీపీకి వెన్నుపోటు పొడవలేదని, వైసీపీయే వేమిరెడ్డికి వెన్నుపోటు పొడిచిందన్నారు. వేమిరెడ్డికి వైసీపీలోని ఎమ్మెల్యే అభ్యర్థులకు తగవులు పెట్టారని, ఆయనపై కుట్ర చేశారని అన్నారు. ప్రసన్న కుమార్ రెడ్డి తన రాజకీయ జీవితంలో ఎన్ని పార్టీల్లోకి మారారో గుర్తుందా...? అని ప్రశ్నించారు కోటంరెడ్డి. వేమిరెడ్డిది వెన్నుపోటు అయితే, ప్రసన్న కుమార్ రెడ్డిది వెన్నుపోటు కాదా...? అని అన్నారు.
ప్రసన్న కుమార్ రెడ్డి ఓటమి భయంతోనే వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని, ఆయన పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు కోటంరెడ్డి. సీఎం జగన్ ని ఆదర్శంగా తీసుకుని ప్రశాంతిరెడ్డిపై ఇష్టారీతిలో మాట్లాడితే తాము కూడా అదే పద్ధతిలో సమాధానం చెబుతామని హెచ్చరించారు. ప్రసన్న భాషలోనే తాము సమాధానం చెబితే, తల ఎక్కడ పెట్టుకుంటారని అన్నారు కోటంరెడ్డి. నెల్లూరు నగర డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ కూడా ఇదే విషయంపై స్పందించారు. తాము మాట్లాడడం మొదలు పెడితే ఎమ్మెల్యే ప్రసన్న కంటే గలీజుగా మాట్లాడతామని, ఆయన చరిత్రను వీధిలో పెడతామని హెచ్చరించారు. ప్రసన్న నోరు అదుపులో పెట్టుకోవాలన్నారు.