నెల్లూరు జిల్లాలో సచివాలయం మహిళా పోలీసులకు యూనిఫామ్ కొలతలు తీసుకునే విషయంలో పురుషులను అనుమతించడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేగింది. పురుషులే మహిళ పోలీసుల యూనిఫామ్ కొలతలు తీసుకుంటున్నట్టు ఫొటోలు వీడియోలు బయటకొచ్చాయి. దీంతో నెల్లూరు జిల్లా పోలీసులు హడావిడి పడ్డారు. ఎస్పీ విజయరావు, అడిషనల్ ఎస్పీ వెంకటరత్నమ్మ.. ఈ ఘటనపై సీరియస్ అయ్యారు. యూనిఫామ్ కొలతలు తీసుకుంటున్న ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్ లోకి వెళ్లి పరిస్థితి సమీక్షించారు. టైలర్ మెజర్ మెంట్స్ తీసుకునే దగ్గర ఇంచార్జ్ గా ఉన్న హెడ్ కానిస్టేబుల్ పై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం మహిళలతోనే అక్కడ కొలతలు తీసుకుంటున్నారు. కొంతమంది కావాలని వీడియోలు వైరల్ చేస్తున్నారని, మహిళా కానిస్టేబుళ్లకు తెలియకుండా వారి యూనిఫామ్ కొలతలు తీసుకునే సమయంలో ఫొటోలు వీడియోలు తీశారని, వారిపై కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. 






పరిస్థితిని సమీక్షించిన ఎస్పీ 


వాస్తవానికి మహిళా కానిస్టేబుళ్ల యూనిఫామ్ తయారీ ప్రైవేటు వ్యక్తులకు అప్పగించారు. కానీ కొలతలు తీసుకునే దగ్గర మహిళా స్టాఫ్ ఉండాల్సింది, బయట నుంచి పురుషులు వచ్చినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో పురుషులు తమ యూనిఫామ్ కొలతలు తీసుకోవడంతో కొంతమంది మహిళా కానిస్టేబుళ్లు ఇబ్బంది పడ్డారు. ఆ విషయం వైరల్ కావడంతో ఎస్పీ వెంటనే అక్కడికి వచ్చారు. ప్రస్తుతం మహిళా స్టాఫ్ తో మాత్రమే యూనిఫామ్ కొలతలు తీసుకుంటున్నారు. అసత్య ప్రచారాలు నమ్మొద్దని, మహిళల గోప్యతకు భంగం కలిగించే వీడియోలు, ఫొటోలు ప్రసారం చేయొద్దని అంటున్నారు ఎస్పీ విజయరావు.  జిల్లా వ్యాప్తంగా ఉన్న మహిళా పోలీసుల మెజర్ మెంట్స్ ను ఎవరికీ అసౌకర్యం కలగకుండా తీసుకునేందుకు తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. మహిళల రక్షణ, వారి గౌరవం పెంచడమే పోలీసుల ప్రథమ కర్తవ్యమని ఆయన అన్నారు.  ఎటువంటి అసత్య ప్రచారాలు నమ్మొద్దని కోరారు.  


ఏబీపీ ప్రతినిధితో ఎస్సై శిరీష


ఈ వివాదంపై ఏబీపీ ప్రతినిధి ఎస్సై శిరీషను ఫోనులో సంప్రదించారు. ఆమె మాట్లాడుతూ కొలతలు తీసుకునే ప్రదేశంలో ఉమెన్ టైలర్స్ కూడా ఉన్నారని, ఫొటో తీసిన వ్యక్తి కేవలం పురుషుల ఉన్న ఫొటోనే తీశారని చెప్పుకొచ్చారు. పురుషులకు అనుమతి లేని ప్రదేశంలోకి వచ్చిన ఫొటోలు తీసినందుకు సదరు వ్యక్తిపై చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే ఈ ఫొటోలను పూర్తిగా పరిశీలించి, బాధ్యులపై చర్యలకు ఉన్నతాధికారులను సంప్రదిస్తామని ఎస్సై అన్నారు.  


Also Read: లేడీ కానిస్టేబుల్స్‌కి యూనిఫాం కొలతలు పురుషులతో..! వివాదాస్పదంగా పోలీసుల తీరు