Artificial Limb Camp : దివ్యాంగులలో కొంతమందికి కృత్రిమ అవయవాల ఆసరా ఉంటే ఎంతో ఉపయోగపడుతోంది. అయితే కృత్రిమ అవయవాల వినియోగంపై అవగాహన అతికొద్దిమందికి మాత్రమే ఉంటుంది. ఇప్పటికీ గ్రామాల్లో కృత్రిమ అవయవాల అమరిక లేక, చాలామంది కర్రల సాయంతో అడుగులేస్తుంటారు. అలాంటివారందరికీ ఇది శుభవార్త. రాష్ట్రంలోనే అతిపెద్ద ఉచిత కృత్రిమ అవయవ ఏర్పాటు శిబిరం నెల్లూరులో జరగబోతోంది. ఇక్కడ కృత్రిమ అవయవాలు పూర్తి ఉచితంగా అందిస్తారు. ఎలాంటి రుసుములు అక్కర్లేదు. మీరు చేయవలసిందల్లా.. ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకుని, ఆయా తేదీల్లో నెల్లూరుకు రావడమే.
ఉచితంగా కృత్రిమ అవయవాలు
రెడ్ క్రాస్ నెల్లూరు జిల్లా వారి ఆధ్వర్యంలో ఉచిత కృత్రిమ అవయవ ఏర్పాటు శిబిరం నిర్వహించబోతున్నారు. రాయచూరుకు చెందిన రాజ్మల్ కేమ్ రాజ్ భండారి ఫౌండేషన్, జైపూర్ లోని భగవాన్ మహావీర్ వికలాంగుల సహాయక సమితి సహకారంతో ఈ కార్యక్రమాన్ని నెల్లూరు రెడ్ క్రాస్ సంస్థ దివ్యాంగులకు అందుబాటులోకి తెస్తోంది. జైపూర్ కృత్రిమ కాలు, కృత్రిమ చెయ్యిని ఇక్కడ ఉచితంగా అమరుస్తారు. అయితే ముందుగా దీనికోసం స్క్రీనింగ్ టెస్ట్ చేస్తారు. దివ్యాంగులకు అవసరమైన కృత్రిమ అవయవాలు అమర్చేందుకు స్క్రీనింగ్, కొలతల క్యాంపు ఈ నెల 23, 24 తేదీలలో నెల్లూరులో నిర్వహిస్తారు. నెల్లూరులోని మద్రాస్ బస్టాండ్ సమీపంలో ఉన్న రెడ్ క్రాస్ మీటింగ్ హాల్ దీనికి వేదిక కాబోతోంది.
కృత్రిమ అవయవాలు కావాలంటే ఇలా చేయండి
తెలుగు రాష్ట్రాల్లో ఏ ప్రాంతంలో ఉన్న వికలాంగులైనా ఈ సదవకాశాన్ని వినియోగించుకోవచ్చు. కృత్రిమ అవయవాలు కావాలనుకునే దివ్యాంగులు, ఈనెల 21వ తేదీ లోపు నెల్లూరు రెడ్ క్రాస్ కార్యాలయంలో సంప్రదించి తమ పేర్లు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. లేదా ఫోన్ నెంబర్ ద్వారా అయినా రెడ్ క్రాస్ వారిని సంప్రదించవచ్చు. అయితే ముందుగా కొన్ని డాక్యుమెంట్లు సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది.
పాస్ పోర్ట్ సైజ్ ఫోటో, వైకల్యం కలిగిన కాలు లేదా చేయి ఫోటో, ఆధార్ కార్డు జిరాక్స్, దివ్యాంగుల ఫోన్ నెంబర్.. ఈ వివరాలు తమ వద్ద ఉంచుకుని రెడ్ క్రాస్ వారిని ఈ కింది ఫోన్ నెంబర్లలో సంప్రదించాలి. ఆయా నెంబర్లకు ఆ వివరాలను వాట్సప్ ద్వారా పంపించే అవకాశం కూడా ఉంది.
సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్లు
9440529662
9440333432
9490777508
8639310160
9493676146
8309966242
రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత రెడ్ క్రాస్ వారి సూచన మేరకు.. ఈనెల 23, 24 తేదీల్లో నెల్లూరులోని రెడ్ క్రాస్ ఆవరణలో జరిగే ఉచిత కృత్రిమ అవయవాల క్యాంప్ కి హాజరు కావాల్సి ఉంటుంది. క్యాంపునకు వచ్చిన దివ్యాంగులు, వారి సహాయకులకు ఆయా రోజులలో ఉచితంగా భోజనం ఏర్పాటు చేస్తారు. స్క్రీనింగ్ క్యాంప్ నిర్వహించిన తర్వాత నెలరోజులలోపు వారికి ఆయా సైజులలో కృత్రిమ అవయవాలు తయారు చేసి అమరుస్తారు. ఈమేరకు నెల్లూరు రెడ్ క్రాస్ సంస్థ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి ప్రకటన విడుదల చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఇది భారీ క్యాంప్ అని ఆయన అన్నారు.