Nellore Kakani Govardhan Reddy: వైఎస్ఆర్‌సీపీ మాజీ మంత్రి, నెల్లూరు సీనియర్ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డికి ఏపీ హైకోర్టులో బిగ్ షాక్ తగిలింది. క్వార్ట్జ్ తవ్వకాలపై పొదలకూరులో నమోదైన కేసులో అరెస్ట్ విషయంలో తొందరపడకుండా పోలీసులను ఆదేశించాలని, పోలీసులు పెట్టిన కేసులను కొట్టివేయాలని కాకాణి విజ్ఞప్తిని హైకోర్టు తిరస్కరించింది. ఆయన పిటిషన్ పై విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. దీంతో ఆయన అరెస్టుకు అడ్డంకులు తొలగిపోయినట్లే.
కాకాణి గోవర్ధన్ రెడ్డి కోసం పొదలకూరు పోలీసులు గాలిస్తున్నారు. ఆయన ఎక్కడ ఉన్నా అరెస్టు చేసేందుకు ప్రత్యేక బృందాలు తిరుగుతున్నాయి. అయితే అరెస్టు కోసం అని కాకుండా విచారణకు హాజరయ్యేందుకు ఆయనకు నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. నెల్లూరులోని ఆయన నివాసానికి నోటీసులు అంటించారు. హైదరాబాద్‌లోని ఆయన ఇంట్లో బంధువులకు విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు. ఆయన అల్లుళ్లకు కూడా నోటీసులు ఇచ్చారు. అయితే ఎవరూ విచారణకు హాజరు కాలేదు. అందరూ ఆజ్ఞాతంలో ఉన్నారు.
కాకాణిపై నమోదు అయిన కేసు ఏమిటంటే ?
నెల్లూరు జిల్లాలో లీజు ముగిసినా క్వార్జ్ తరలించారని.. రూ.250 కోట్ల విలువైన క్వార్జ్ తరలించారని మైన్స్ అధికారులు గుర్తించారు. పోలీసులకు ఫి ర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు మాజీ మంత్రి కాకాణి పేరును ఏ4గా ఎఫ్‌ఐఆర్‌లో చేర్చాడు. క్వార్ట్‌జ్ అక్రమాల వ్యవహారంలో ఏ4గా మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై 120బీ, 129, 220, 447, 427, 379, 506తో పాటు ఎక్స్‌ప్లోజివ్ సబ్‌స్టెన్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు సమాచారం. తూర్పు రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయిన శ్యాంప్రసాద్ రెడ్డి ఏ1 కాగా, ఏ2, ఏ3లుగా పార్టీ నేతలు వాకాటి శివారెడ్డి, వాకాటి శ్రీనివాసులు రెడ్డి ఉన్నారు. ఏ6, ఏ8గా ఉన్న మరో ఇద్దరు నిందితుల్ని అరెస్టు చేసి గూడూరు కోర్టులో హాజరు పరిచగా.. కోర్టు వారికి 14 రోజుల పాటు రిమాండ్ విధించింది.
వైసీపీ హయాంలోనే టీడీపీ నేత సోమిరెడ్డి కేంద్ర మైనింగ్ శాఖకు విచారణకు ఆదేశించాలని ఫిర్యాదు చేశారు. రూ.250 కోట్లకు పైగా క్వార్ట్జ్ దోచుకుపోయారని ఫిర్యాదు చేశారు. ఆపై రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడటంతో కేసులో పురోగతి కనిపిస్తోంది. ప్రాథమిక దర్యాప్తు చేపట్టిన మైనింగ్ శాఖ అధికారులు సైతం పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఏ4గా కాకాణి పేరు చేర్చారు. శ్యాంప్రసాద్‌రెడ్డి, వాకాటి శివారెడ్డి, వాకాటి శ్రీనివాసులు రెడ్డిలపై గతంలో ఎఫ్‌ఐఆర్ నమోదు అయింది. వారికి హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
కాకాణి గోవర్ధన్ రెడ్డి కేసులకు భయపడేది లేదని ప్రకటించారు. అయితే ఆయన కనిపించకుండా పోవడం నోటీసులకూ స్పందించకపోవడంతో నెల్లూరులో ఆయన గతంలో చేసిన ప్రకటనలపై విస్తృత చర్చ జరుగుతోంది. ఆయన విచారణకు హాజరై ఉంటే అరెస్టు ముప్పు తప్పేదని విచారణకు హాజరు కాకుండా ఉండటం వల్ల పారిపోయారన్న భావన వస్తోందని వైసీపీ వర్గాలంటున్నాయి. ఇప్పుడు హైకోర్టులోనూ ఊరట లభించకపోవడంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది.