CPI Narayana : "వైసీపీ(Ysrcp) రాష్ట్రంలో అధికారంలో ఉంది. ఎంపీలు ఉన్నారు. అయినా సీఎం జగన్(CM Jagan) ఎందుకు భయపడుతున్నారు. కేసులే కారణమా?. దిల్లీకి వెళ్లి దండాలు పెట్టి రాష్ట్రంలో బీజేపీ(BJP)పై శివతాండవం ఆడుతున్నారు. ముంద్రా పోర్టు ద్వారా వచ్చిన డ్రగ్స్(Drugs) ఏపీలోకి వస్తున్నాయి. అన్ని చోట్ల వైసీపీ నేతలు దండుకుంటున్నారన్నారు. రాష్ట్ర సముద్ర తీర ప్రాంతాలను అదానీ(Adani) సంస్థకు అమ్మేస్తున్నారు. రాష్ట్రంలో ప్రతీచోట వైసీపీ ఏజెంట్లు ఉన్నారు. ఇప్పుడు ప్రజాసేవ చేయాలని సీఎం జగన్ అంటున్నారంటే ఇప్పటి వరకూ వైసీపీ నేతలు చేసిందేంలేదు. ఒక్క స్మశానంలో తప్ప అన్ని చోట్ల వైసీపీ ఏజెంట్లు ఉన్నారని" సీపీఐ నారాయణ(CPI Narayana) విమర్శించారు.
పవన్ కల్యాణ్ పై విమర్శలు
బీజేపీతో కలసి వెళ్తున్న జనసేనాని పవన్ కల్యాణ్(Pawan Kalyan) చివరకు మిగిలేది ఏం ఉండదని సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. నెల్లూరు(Nellore)లో ఏపీ జెన్ కో థర్మల్ పవర్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగిన అఖిలపక్ష నిరసన ప్రదర్శనలో నారాయణ పాల్గొన్నారు. పవన్ కల్యాణ్, బీజేపీ పొత్తుపై స్పందించిన నారాయణ.. ఇటీవల జనసేన(Janasena) ఆవిర్భావ సభలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ బీజేపీ రోడ్ మ్యాప్ కోసం వేచి చూస్తున్నానని చెప్పారని అన్నారు. బీజేపీ రోడ్ మ్యాప్(BJP Road Map) కోసం పవన్ కల్యాణ్ ఎందుకు ఎదురుచూడాలని ప్రశ్నించారు. పెళ్లయ్యాక వధూవరులు భర్త చనిపోయిన మహిళ దగ్గరకు ఆశీర్వాదం కోసం వెళ్తే ఏమని దీవిస్తుందని, నువ్వూ నాలాగే ఉండమ్మా అంటుందని చెప్పారు. బీజేపీని నమ్ముకుంటే పవన్ కల్యాణ్ కూడా చివరకు ఏమి మిగలదన్నారు. వైసీపీతో పాటు, బీజేపీతో కూడా పోరాడాలని, కేంద్రంలో బీజేపీ వ్యతిరేక శక్తులన్నీ కలవాలని చెప్పారు నారాయణ.
అఖిలపక్ష నిరసనలు
నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలోని ఏపీ జెన్ కో(AP Genco) థర్మల్ విద్యుత్ కేంద్రం ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అఖిల పక్షం ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. నెల్లూరులోని నర్తకి సెంటర్ నుంచి టీడీపీ(TDP), సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్, జనసేన, బీఎస్పీ నాయకులు ర్యాలీగా వచ్చారు. కలెక్టరేట్ గేటు ముందు బైఠాయించి ధర్నా నిర్వహించారు. థర్మల్ విద్యుత్ కేంద్రం కాంట్రాక్ట్ కార్మికులు కూడా రాజకీయ పార్టీల నేతలతో కలిసి ధర్నాలో పాల్గొన్నారు. అదానీ సంస్థకి విద్యుత్ కేంద్రాన్ని 25 సంవత్సరాల లీజు పేరుతో రాష్ట్ర ప్రభుత్వం అమ్మేయడం సరికాదన్నారు నాయకులు. కృష్ణపట్నం ధర్మల్ విద్యుత్ కేంద్రాన్ని ప్రైవేటుపరం చేయొద్దని డిమాండ్ చేశారు. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, సీపీఐ నారాయణ ప్రభుత్వ తీరుని విమర్శించారు. ధర్నాలో పాల్గొన్న సోమిరెడ్డి స్వల్ప అస్వస్థతకు గురి కావడంతో ఆయన మధ్యలోనే వెళ్లిపోయారు.