ఢిల్లీలో లిక్కర్ స్కామ్ వెలుగులోకి వచ్చిన తర్వాత బీజేపీ వైరి వర్గాల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. లిక్కర్ స్కామ్ కి టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సంబంధం ఉందంటూ ఆరోపణలు వినిపించాయి. ఈ ఆరోపణల తర్వాత తెలంగాణలో టీఆర్ఎస్, బీజేపీ మధ్య పెద్ద యుద్ధమే మొదలైంది. భవిష్యత్తులో ఈడీ, సీబీఐ సోదాలు తెలంగాణలో పెరిగే అవకాశముందని సాక్షాత్తూ కేసీఆర్ కూడా ప్రకటించడంతో ఈ వ్యవహారం ఇంకా వాడివేడిగానే ఉంది. ఈ దశలో ఇటు ఏపీలో ఈడీ సోదాలు కలకలం సృష్టించాయి.
దేశవ్యాప్తంగా సీబీఐ, ఈడీ సోదాలు.. బీజేపీ వ్యతిరేక పార్టీల నేతలపైనే జరుగుతున్నాయనేది బహిరంగ రహస్యం. కేంద్ర దర్యాప్తు సంస్థల్ని కేవలం ప్రతీకారం తీర్చుకోడానికే బీజేపీ ఉపయోగిస్తుందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ దశలో వైసీపీ ఎంపీని ఈడీ ఎందుకు టార్గెట్ చేస్తుందనే వాదన కూడా వినిపిస్తోంది. కేంద్రంలో బీజేపీకి వైసీపీ పూర్తి సానుకూలంగా ఉంది. ఇటీవల రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికే వైసీపీ మద్దతిచ్చింది. మరి వైసీపీ ఎంపీని ఈడీ ఎందుకు టార్గెట్ చేసింది..?
వైసీపీతో సఖ్యత ఉన్నా కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్ విషయంలో కేంద్రం సీరియస్ గా ఉంది. అక్కడ ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ సర్కార్ ని ఇబ్బంది పెట్టడంతోపాటు, దానితో సంబంధం ఉన్న ఇతర విపక్షాలను కూడా ముప్పతిప్పలు పెట్టే పనిలో ఉంది. ఈ క్రమంలోనే టీఆర్ఎస్ కి లిక్కర్ స్కామ్ తో సంబంధాలున్నాయని లీకులిచ్చి మరీ కవితను టార్గెట్ చేశారు. ఇటు ఏపీలో వైసీపీ తమకు అనుకూలంగా ఉన్నా కూడా వైసీపీ ఎంపీ ఇంట్లో సోదాలు మొదలయ్యాయి.
ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డికి చెందిన ఇళ్లు, కార్యాలయాలపై ఏక కాలంలో దాడులు జరుగుతున్నాయి. ఢిల్లీలోని మాగుంట నివాసంతోపాటు హైదరాబాద్, ఇటు నెల్లూరులో కూడా విస్తృతంగా అధికారులు సోదాలు చేస్తున్నారు. మాగుంట ఫ్యామిలీ చాన్నాళ్లుగా లిక్కర్ బిజినెస్ లో ఉంది. శ్రీనివాసులరెడ్డి ఒంగోలు ఎంపీ అయినా, ఆయన ఇల్లు, ఇతర కార్యాలయాలు నెల్లూరులో కూడా ఉన్నాయి. నెల్లూరులోని మాగుంట వారి ఇళ్లలో ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. మాగుంట శ్రీనివాసులరెడ్డికి చెందిన ఎస్ఎన్జే డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో కూడా సోదాలు జరుగుతున్నాయి. ఈడీ సోదాల నేపథ్యంలో నెల్లూరులో పలు చోట్ల కేంద్ర బలగాలు కనిపించాయి. అయితే సోదాల గురించి అధికారిక సమాచారం మాత్రం బయటకు రాలేదు.
మాగుంటని ఎందుకు టార్గెట్ చేశారు?
మాగుంట శ్రీనివాసులరెడ్డి ఇటీవల వైసీపీకి కాస్త దూరంగా ఉంటున్నట్టు తెలుస్తోంది. ఆమధ్య ఆయన టీడీపీలోకి వెళ్లిపోతారని కూడా అన్నారు. కానీ వెంటనే మాగుంట ఆ వార్తలను ఖండించారు. అయితే జగన్ తో మాత్రం ఆయనకు పెద్దగా సత్సంబంధాలు లేవనే చెప్పాలి. మిగతా ఎంపీలలాగా ఇతర పార్టీ విషయాల్లో ఆయన అంత హుషారుగా లేరు. దీంతో ఆయన్ను రక్షించే ప్రయత్నాలు కూడా వైసీపీ చేయలేదనే టాక్ వినిపిస్తోంది.
గతంలో వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో బయటకొచ్చినప్పుడు వైసీపీ నుంచి ఎంత సపోర్ట్ వచ్చిందో చూశాం. ప్రతిపక్షం ఎంత రాద్ధాంతం చేసినా వైసీపీ నేతలు మాత్రం మాధవ్ కి మద్దతుగా నిలిచారు. కానీ ఇప్పుడు మాగుంట విషయంలో ఇంకా ఎవరూ నోరు మెదపలేదు. కనీసం చట్టం తన పని తాను చేసుకుపోతోంది అనే డైలాగులు కూడా లేవు. ఈ విషయం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.