Natural disaster relief Additional funds: ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి కమిటీ  భేటీలో ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన రాష్ట్రాలకు ఊరటనిచ్చే కీలక నిర్ణయం తీసుకున్నారు. 2025లో సంభవించిన ఆకస్మిక వరదలు, మొంథా తుపాను  కారణంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ సహా ఆరు రాష్ట్రాలకు అదనపు ఆర్థిక సాయం అందించేందుకు కమిటీ ఆమోదం తెలిపింది. మొత్తం రూ.1,929.99 కోట్ల అదనపు కేంద్ర సాయాన్ని జాతీయ విపత్తు ప్రతిస్పందన నిధి  నుండి విడుదల చేయనున్నారు.

ఈ నిధులలో అత్యధికంగా గుజరాత్ రాష్ట్రానికి రూ.778.67 కోట్లు కేటాయించగా, ఆంధ్రప్రదేశ్‌కు రూ.341.48 కోట్లు మంజూరయ్యాయి. అలాగే జమ్ముకశ్మీర్‌కు రూ.330.34 కోట్లు, హిమాచల్ ప్రదేశ్‌కు రూ.288.39 కోట్లు, నాగాలాండ్‌కు రూ.158.41 కోట్లు , ఛత్తీస్‌గఢ్‌కు రూ.15.70 కోట్ల అదనపు సాయం అందనుంది. క్షేత్రస్థాయిలో నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర ప్రభుత్వం పంపిన అంతర్-మంత్రిత్వ బృందాల నివేదికల ఆధారంగా ఈ నిధులను ఖరారు చేశారు.

ప్రకృతి వైపరీత్యాల సమయంలో రాష్ట్రాలకు అండగా నిలవాలనే కేంద్ర ప్రభుత్వ నిబద్ధతను ఈ నిర్ణయం ప్రతిబింబిస్తోంది. ముఖ్యంగా 2025లో తలెత్తిన అసాధారణ వర్షాలు, తుపానుల వల్ల దెబ్బతిన్న మౌలిక సదుపాయాల పునరుద్ధరణకు, బాధిత ప్రజలను ఆదుకోవడానికి ఈ నిధులు వెన్నుదన్నుగా నిలవనున్నాయి. రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి   లో ఇప్పటికే ఉన్న నిధులకు అదనంగా ఈ మొత్తం అందుతుంది 

తుపాను ప్రభావిత ప్రాంతాల్లో వ్యవసాయ నష్టం, ఆస్తి నష్టం ,  పునరావాస పనుల కోసం ఈ నిధులను వెచ్చించనున్నారు. ఏపీలో తుపాను ధాటికి దెబ్బతిన్న కోస్తా జిల్లాల్లోని రైతులకు, మౌలిక సదుపాయాల మరమ్మతులకు ఈ రూ.341.48 కోట్లు ఎంతో కీలకం కానున్నాయి. విపత్తు నిర్వహణలో రాష్ట్రాలకు ఆర్థిక భారం తగ్గించే దిశగా కేంద్రం ఈ ముందడుగు వేసింది.