(Source: ECI/ABP News/ABP Majha)
TDP Chalo Narsipatnam : టీడీపీ చలో నర్సీపట్నం, ఎక్కడికక్కడ నేతల హౌస్ అరెస్టులు
TDP Chalo Narsipatnam : మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఇంటి గోడ కూల్చివేత ఘటనకు నిరసనగా టీడీపీ చలో నర్సీపట్నం కార్యక్రమాన్ని చేపట్టంది. అయ్యన్న కుమారుడు విజయ్ నర్సీపట్నంలోని ఆయన ఇంటి వద్ద నిరసన దీక్షకు దిగారు.
TDP Chalo Narsipatnam : మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడి ఇంటి గోడ కూల్చివేతకు నిరసనగా టీడీపీ చలో నర్సీపట్నం కార్యక్రమానికి పిలుపునిచ్చింది. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ టీడీపీ నేతల్ని పోలీసులు గృహనిర్బంధం చేశారు. అనకాపల్లి జిల్లా టీడీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ బుద్దా నాగ జగదీశ్వరరావుతో సహా స్థానిక నేతలను గృహనిర్బంధం చేశారు. నర్సీపట్నంలో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. పట్టణంలోకి వస్తున్న ప్రతీ వాహనాన్ని పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. అయ్యన్నపాత్రుడి ఇంటి వద్ద గోడ కూల్చిన ప్రదేశాన్ని స్థానిక టీడీపీ, సీపీఐ నేతలు పరిశీలించారు.
టీడీపీ సీనియర్ బీసీ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు లక్ష్యంగా వైసీపీ సర్కారు పాల్పడుతున్న దాడులని నిరసిస్తూ చేపట్టిన ఛలో నర్సీపట్నం కార్యక్రమానికి, పోలీసులు అడుగడుగునా అరెస్టులతో అడ్డు పడినా, పార్టీ నేతలు, బీసీ నేతలు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. pic.twitter.com/6mLPi8t0TW
— Telugu Desam Party (@JaiTDP) June 20, 2022
అయ్యన్న కుమారుడు దీక్ష
రాష్ట్ర ప్రభుత్వం వైఖరిని ఖండిస్తూ అయ్యన్న కుమారుడు చింతకాయల విజయ్ నర్సీపట్నంలో దీక్షకు దిగారు. అయ్యన్న ఇంటివద్ద ఏర్పాటు చేసిన శిబిరంలో ఆయన దీక్షలో కూర్చొన్నారు. మరోవైపు చుట్టుపక్కల జిల్లాల నుంచి నర్సీపట్నం వస్తున్న టీడీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. చలో నర్సీపట్నం కార్యక్రమానికి వెళ్లకుండా పశ్చిమగోదావరి జిల్లా తణుకులో మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ, వెన్నెలపాలెంలో మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తిని పోలీసులు గృహనిర్బంధం చేశారు. విజయనగరంలో మాజీ ఎమ్మెల్యే కేఏ నాయుడును కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. పాడేరులో మాజీ మంత్రి కిడారి శ్రావణ్, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిలను హౌస్ అరెస్టు చేశారు.
నర్సీపట్నంలో పోలీసుల బందోబస్తు
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత, మాజీ మంత్రి మృణాళిని ఇళ్ల వద్ద కూడా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. విశాఖ నుంచి వచ్చిన తెలుగు మహిళలు అయ్యన్నపాత్రుడు ఇంటికి వెళ్లి ఆయన సతీమణి పద్మావతిని పరామర్శించారు. పోలీసులు కళ్లుగప్పి కొందరు టీడీపీ నాయకులు ఆదివారం రాత్రే నర్సీపట్నం చేరుకున్నారు. మాజీ ఎమ్మెల్యేలు గండి బాబ్జీ, పీలా గోవింద్ వెంకట సత్యనారాయణ, కేఎస్‌న్‌రాజు నర్సీపట్నం చేరుకున్నారు. చలో నర్సీపట్నం కార్యక్రమం నేపథ్యంలో పట్టణంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.