Nara Lokesh as TDP Working President : యువగళ సారధి.. పసుపు దళపతి కాబోతున్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదా నుంచి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ గా ప్రమోషన్ అందుకోనున్నారు. కడప మహానాడు వేదికపై నుంచే దీనిని ప్రకటించనున్నారు. తెలుగుదేశంలో వినిపిస్తున్న మాటైతే.. ప్రకటన  దాదాపు ఖాయం. దీనికి రుజువు కావాలంటే మహానాడు పోస్టర్ చూడొచ్చు.. పార్టీ వ్యవస్థాపకుడు  నందమూరి తారకరామారావు- పార్టీ అధినేత చంద్రబాబు, యువనేత లోకేష్ వీళ్లు ముగ్గురేకదా.. పార్టీ ముఖచిత్రం. ఇంక ఇందులో డౌటెందుకు..?  పేరుకు చంద్రబాబు అధ్యక్షుడు అయినా పార్టీ రోజువారీ వ్యవహారాలను చక్కబెడుతోంది లోకేషే.. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో పార్టీలో కీలక పాత్రనే పోషిస్తున్నారు. అయితే ఆయనకంటూ ప్రత్యేకమైన పదవి ఉండాలన్నది నాయకులు, కార్యకర్తల అభిలాష. చంద్రబాబు యాక్టివ్‌గా ఉన్నంత కాలం ఆయనే పార్టీ అధ్యక్షుడిగా ఉంటారు. ఇందులో ఎవరికీ సందేహం లేదు. అందుకే అలాంటి తరహా పోస్ట్… మరెవ్వరికీ లేని హోదా.. నారాలోకేష్‌కు దఖలు పరచాలన్నది పార్టీ క్యాడర్ కోరిక.. అందుకోసం జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవని తెలుగుదేశంలో కొత్తగా సృష్టించనున్నారు.

పార్టీలో లోకేష్ నెంబర్ -2

 తెలుగుదేశం సుప్రీమో చంద్రబాబు తర్వాత పార్టీపై పూర్తి అధికారం ఉంది నారాలోకేష్‌కు అన్న విషయంలో ఎలాంటి సందేహం లేదు. తెలుగుదేశంలో జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో ఆయనున్నారు. ఆయనతో పాటు మరికొందరికి కూడా ఆ హోదా ఉంది. అయినప్పటికీ.. తెలుగుదేశం వ్యవస్థాపక వారసుడిగా ఆయనకు ప్రత్యేక అధికారం.. కార్యకర్తల్లో ప్రత్యేక అభిమానం ఉన్నాయి. కార్యకర్తలు ఆమోదించగలిగారు కాబట్టే ఆ హోదాను ఆయన పొందగలిగారు. అయితే లోకేష్ ఆయాచితంగా పార్టీ పదవిని తీసుకోలేదు. వారతసత్వంగా పెద్ద పదవి వచ్చిందేమో కానీ.. ఆయన మాత్రం 14 ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడుతూనే ఉన్నారు. పార్టీ నిర్మాణం దగ్గర నుంచి ఎన్నికల మందు యువగళం వరకూ తన వంతు కంట్రిబ్యూషన్ పార్టీకి అందించారు.

అసలైన చంద్రబాబు వారసుడు

నారా లోకేష్ చంద్రబాబుకు వంశపారంపర్య వారసుడే కాదు.. రాజకీయాల్లోనే ఆయన్ను వంటబట్టించుకున్నారు. తెలుగుదేశాన్ని ఎన్టీఆర్ స్థాపించినా.. పార్టీ నిర్మాణాన్ని చూసుకుంది చంద్రబాబే. పార్టీ క్యాడర్ నిర్మాణం.. పటిష్టమైన కమిటీలుతో బూత్‌లెవల్‌ వరకూ పార్టీని విస్తరించింది చంద్రబాబు. పార్టీ సభ్యత్వాన్ని కంప్యూటరీకరించిన తొలిపార్టీ తెలుగుదేశం.. దానికి నాంది పలికింది చంద్రబాబు. అదే పరంపంరను కొనసాగించిన వాడు లోకేష్. కార్యకర్తల కోసం సంక్షేమ నిధిని ప్రారంభించి.. దానిని నిర్మాణాత్మకంగా మలిచాడు.

 

కోటిమంది క్యాడర్

తెలుగుదేశం పార్టీ సభ్యత్వాలు ఈ ఏడాది కోటి దాటాయి. ఓ రీజనల్ పార్టీకి కోటిమంది సభ్యత్వం రావడం ఇదే తొలిసారి. కేవలం 45రోజుల్లో ఈ ఫీట్‌ను సాధించడం ద్వారా తెలుగుదేశం పార్టీ రికార్డ్ సృష్టించింది. అలాగే పార్టీ కార్యకర్తల కోసం జీవిత బీమాను కూడా లోకేష్ ప్రవేశ పెట్టారు. ఈ ఏడాది కార్యకర్తల కోసం ఏకంగా 49కోట్ల బీమాను పార్టీ ప్రీమియంగా కట్టింది. ప్రమాదాల్లోనో.. సహజంగానో చనిపోయినప్పుడు వచ్చే ఈ మొత్తం పార్టీ కార్యకర్తల్లో కొండంత భరోసాను నింపింది. కార్యకర్తల్లో లోకేష్ ఇమేజ్ పెరగడానికి ఈ స్కీమ్ ముఖ్య కారణం

యువగళ సారథి

2014 ఎన్నికలకు ముందు నుంచి పార్టీ కోసం పనిచేస్తున్నా.. ఆ ఎన్నికల్లో లోకేష్ ఓడిపోవడం.. పార్టీని.. చంద్రబాబును కూడా ఇబ్బంది పెట్టింది. లోకేష్‌ను చిన్నబుచ్చేలా వైసీపీ మాటల దాడి చేసింది. ఆయన సమర్థతపై తటస్థులకు కూడా సందేహాలు కలిగే రీతిలో ముప్పేట దాడి చేశారు. సినిమాల్లో ట్రోల్ చేశారు. కానీ వీటిన్నింటినీ తట్టుకుని.. ఓడిపోయిన చోటే గెలుస్తానని చెప్పి.. మంగళగిరిలో తిరుగులేని మెజార్టీ సాధించారు లోకేష్. నాయకుడిగా ఆయనకు అది తిరుగులేని కిరీటం. అయితే అంతకు ముందే లోకేష్ తన సమర్థతను నిరూపించుకున్నారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు అరెస్ట్ కావడంతో ఢిల్లీలో ఉండి.. తండ్రి విడుదుల కోసం తీవ్ర ప్రయత్నాలు చేశారు. పార్టీ స్థైర్యం దెబ్బతినకుండా వ్యవహరించారు.  అన్నింటికి మించి.. ఈ సారి ఎన్నికలకు ఆయనే స్టార్ క్యాంపెయినర్. యువగళం పేరు తో దాదాపు ౩వేల కిలోమీటర్లకు పైగా పాదయాత్ర నిర్వహించి… తెలుగుదేశం కార్యకర్తకు కేరాఫ్ అయ్యారు. ఆ సందర్భంగా కొన్నివేల మంది కార్యకర్తలను లోకేష్ ప్రత్యక్షంగా కలిశారు. ఫిజికల్‌గా చాలా కష్టపడ్డారు. తనును తాను మలుచుకోవడమే కాక.. పార్టీకి మంచి ఊపు తీసుకొచ్చారు.

ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ..?

 2024లో తెలుగుదేశం చరిత్రలోనే అతిభారీ విజయాన్ని ఆపార్టీ పొందింది. 9౩శాతం స్థానాలను గెలుచుకుంది. లోకేష్ మళ్లీ మంత్రయ్యారు… కూటమి కట్టడంతో.. డిప్యూటీ సీఎం భాగస్వామ్య పక్ష అధినేత పవన్ కల్యాణ్‌కు ఇచ్చారు. ప్రభుత్వంలో పెద్ద పదవి తీసుకునే అవకాశం లేకపోవడంతో లోకేష్‌కు ప్రాధాన్యత కల్పించాలని ఆయన అభిమానులు, పార్టీ క్యాడర్ కూడా డిమాండ్ చేస్తున్నారు. కొన్నాళ్ల కిందట ఆయనకు కూడా డిప్యూటీ సీఎం అనే  స్లోగన్ వచ్చింది. కానీ చంద్రబాబు వారించడంతో ఆ డిమాండ్ ఆగిపోయింది. అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న తొలిమహానాడు కావడంతో కార్యకర్తలు మాంఛి జోరుమీదున్నారు. లోకేష్‌కు పదవి ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. క్యాడరే కాదు.. పార్టీలోని ముఖ్య నాయకులు కూడా ఇదే వ్యాఖ్యలు చేశారు.

లోకేష్‌కు 42 ఏళ్లు వచ్చాయి. ఇప్పుడు కాకపోతే.. పదవి ఇంకెప్పుడు అని ప్రశ్నిస్తున్నారు. పైగా జగన్ కు ప్రత్యర్థిగా నిలివాల్సిన లోకేష్‌కు జగన్ గడ్డపై జరుగుతున్న  మహానాడు ద్వారా ఎలివేషన్ ఇఛ్చి  నిలబెట్టడం కన్నా వేరే సందర్భం ఏముంటుదంటున్నారు.  తెలుగుదేశంలో ఎవరు కాదన్నా.. ప్రస్తుతానికి ఉన్న పరిణామాల్లో  లోకేషే తర్వాత తరం వారసుడు. ఇప్పుడు కాకపోతే.. ఇంకొన్ని రోజుల తర్వాతైనా అది ప్రకటించాల్సిందే. దానికి సన్నాహకంగా. ఇప్పుడు ఆయన్ను వర్కింగ్ ప్రెసిడెంట్ చేయడం అవసరం అనే మాట వినిపిస్తోంది.

మహానాడులో లోకేష్ మార్క్..

ఈసారి మహానాడులో కూడా లోకేష్ ముద్ర స్పష్టంగా కనిపిస్తోంది. మహానాడు వేదికపై.. ప్రాంగణంలో కూడా ఆయనే హైలైట్.. అయ్యారు.  “నా తెలుగు కుటుంబం” పేరుతో  లోకేష్ మహానాడులో తన విజన్‌ను ఆవిష్కరించారు. తెలుగుజాతి కోసం అంటూ ఆరు శాసనాలను ప్రకటించారు. తెలుగుజాతి విశ్వఖ్యాతి, స్త్రీ శక్తి, యువగళం, పేదల సేవలో, అన్నదాతకు అండగా.. కార్యకర్తలే అధినేత అంటూ మొత్తం ఆరు వర్గాలను ఆకట్టుకునే థీమ్‌ను లోకేష్‌ స్వయంగా శ్రద్ధ తీసుకుని ఆవిష్కరించుకుంటున్నారు. దీని ద్వారా తన సందేశాన్ని అందించాలన్నది ఆయన సంకల్పం.

వారసత్వం కొత్త కాదు.

ప్రాంతీయ పార్టీలో కుటుంబ వారుసులను రాజకీయ వారసులుగా ప్రకటించడం కొత్తేం కాదు. జాతీయ పార్టీల్లో సాధ్యం కాకపోవచ్చు కానీ.. ప్రాంతీయ పార్టీల్లో ఇది జరుగుతుంది. భారత రాష్ట్ర సమితి.. అధ్యక్షుడిగా తర్వాత వచ్చేది కుటుంబంలోని వారే  అన్నది స్పష్టం. ఇప్పటికే అక్కడ కేసీఆర్ కుమారుడు కేటీఆర్‌ను వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ఎన్నుకున్నారు. డిఎంకే అధినేత స్టాలిన్ తన వారసుడుని ముందుకు తెచ్చారు. ఉదయనిధి స్టాలిన్‌ ను డిప్యూటీ సీఎం చేయడం ద్వారా తన డిప్యూటీ ఆయనే అని చెప్పారు. వైఎస్సార్సీపీ.. అసలే ఎన్నికలే వద్దన్నట్లుగా వైఎస్ జగన్‌ను శాశ్వత అధ్యక్షుడుగా చేయాలని ప్రయత్నించినా ఈసీ నిబంధనలు ఒప్పుకోలేదు. దానర్థం.. ఆ కుటుంబం నుంచి పార్టీ బయటకు పోకూడదనే.. మాయావతి తన బంధువుకు.. లాలూ ప్రసాద్ తన కొడుకులకు పార్టీ పగ్గాలు అప్పగించారు.

సైలంట్‌గా టీడీపీ

పార్టీ మాత్రం ఈ విషయాన్ని గుంభనంగా ఉంచుతోంది. మహానాడులో పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకుంటారు కానీ పదవులను పార్టీ అధినేతనే ప్రకటిస్తారు. తెలుగుదేశం పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు ఉంటే.. ఆంధ్రప్రదేశ్ అధ్యక్షడిగా పల్లా శ్రీనివాసరావు, తెలంగాణ అధ్యక్షడిగా బక్కాని నరసింహులు ఉన్నారు. తెలంగాణ కోసం వర్కింగ్ ప్రెసిడెంట్‌గా అప్పట్లో రేవంత్ రెడ్డిని ప్రకటించారు. అయితే పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి మాత్రం ఇప్పటి దాకా లేదు. దానిని కొత్తగా సృష్టించాలి. క్యాడర్ లో జోష్ నింపడంకోసం.. తదుపరి నాయకుడిగా..చాటటం కోసం చంద్రబాబు తన డిప్యూటీని ప్రకటిస్తారా.. అనఫిషియల్ నెంబర్‌-2 ని అఫీషియల్ చేస్తారా చూడాలి.