Free Bus Scheme Nara Lokesh Speech: మహిళా సంక్షేమానికి చంద్రబాబు నాయుడు ఎప్పుడూ పెద్దపీట వేస్తారు. ఇప్పుడు స్త్రీ శక్తి పథకం ద్వారా ఫ్రీ బస్సు ప్రయాణం ప్రవేశపెట్టారు. ఈ పథకం మహిళలకు మరింత శక్తిని ఇస్తుందని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ లో స్త్రీశక్తి ఉచిత బస్సు ప్రయాణం కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలసి మంత్రి పాల్గొన్నారు.
మహిళలకు ఆర్థికంగా మిగులు కల్పించే స్త్రీశక్తి
స్త్రీశక్తి పథకం వల్ల విద్యార్థినులు, ఉద్యోగాలు చేసుకునే మహిళల పై భారం తగ్గుతుందని తెలిపారు. ఉచిత బస్సు ప్రయాణం ద్వారా నెలకు రూ.1500 భారం తగ్గుతుంది. 2019లో అధికారంలోకి వచ్చిన ఒక రాక్షసుడు మద్యనిషేధం చేస్తానని చెప్పి, విషం కంటే ప్రమాదకర మద్యం అమ్మి మహిళల తాళిబొట్లు తెంచాడు. యువగళం పాదయాత్రలో మీ కష్టాలు చూశాకే సూపర్ -6 పథకాన్ని ప్రవేశపెట్టాలని కోరాను. గతంలో ఒక తల్లికి ఇద్దరు పిల్లలు ఉంటే ఒకరిని స్కూల్ కి పంపి, ఇంకొకరిని పనికి పంపాలి అనేది గత ప్రభుత్వం విధానం. ఇప్పుడు చంద్రబాబు గారు ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి తల్లికి వందనం ఇచ్చారు. 67 లక్షల 27 వేల మందికి 10 వేల కోట్లు ఇచ్చారు. దీపం పథకం ద్వారా 2 కోట్ల సిలెండర్లు ఉచితంగా ఇచ్చారు. సొంత చెల్లెలు రాఖీ కట్టని అన్నలు మహిళా సంక్షేమం గురించి మాట్లాడతారు. సొంత తల్లి, చెల్లి నమ్మని వారు మాపై విమర్శలు చేస్తారు. వారికి నా సమాధానం ఒక్కటే, ముందు ఇంట్లో ఉన్న మహిళల్ని గౌరవించడం నేర్చుకోండి. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రం అభివృద్ధి సాధించాలంటే ప్రభుత్వ కొనసాగింపు చాలా అవసరం. ప్రభుత్వం మారడం వలన 19 నుండి 24 వరకూ రాష్ట్రం ఎంత నష్టపోయిందో మీరు చూసారు. ఇప్పుడు డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది. కేంద్రం లో గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవనన్న నాయకత్వంలో సుపరిపాలనలో తొలి అడుగు పడింది. అభివృద్ధి, సంక్షేమం కొనసాగాలి అంటే ప్రభుత్వ కొనసాగింపు ముఖ్యం.
టీడీపీ ఆవిర్భావంతో మహిళలకు పెద్దపీట
భూమి కంటే ఎక్కువ భారం మోసేది మహిళ. ఏ రంగం తీసుకున్నా మహిళలే నంబర్ 1. ఆవకాయ్ పట్టాలన్నా మీరే... అంతరిక్షంలోకి వెళ్ళాలి అన్నా మీరే. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండే మహిళలకు అన్ని రంగాల్లో ప్రాధాన్యత ఇచ్చింది. విశ్వవిఖ్యాత నటసార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామారావు గారు మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 9 శాతం రిజర్వేషన్లు ఇచ్చారు. మహిళల కోసం తిరుపతిలో శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ ఏర్పాటు చేసారు. డ్వాక్రా గ్రూపులు ఏర్పాటు చేసి మహిళలకు ఆర్థిక స్వాతంత్య్రం ఇచ్చింది చంద్రబాబు నాయుడు. విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఇచ్చింది, మహిళల పేరుతో ఇళ్ల పట్టాలు ఇచ్చింది, మహిళా కండక్టర్లను నియమించింది, దీపం పధకం అమలు చేసింది చంద్రబాబు అని గుర్తుచేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను మంగళగిరి లో స్త్రీ శక్తి అని ఒక కార్యక్రమం ప్రారంభించాను. మహిళలకు కుట్టు మెషిన్, బ్యూటిషన్ ట్రైనింగ్ ఇచ్చాం. 3623 మంది మహిళలకు టైలరింగ్ శిక్షణ ఇచ్చి ఉచితంగా కుట్టు మెషీన్లు అందించాం. ట్రైనింగ్ ఇచ్చి వదిలేయలేదు, వారికి మార్కెట్ లింకేజ్ కూడా ఏర్పాటు చేసాం. జ్యూట్ బ్యాగ్స్, క్లాత్ బ్యాగ్స్ ఇలా అనేక ఐటమ్స్ తయారు చేసి సొంత కాళ్ళ పై నిలబడ్డారు. మహిళలకు అవకాశాలు ఇస్తే అద్భుతాలు సృష్టిస్తారు.
మహిళల్ని కించపరిచే వారికి కఠిన శిక్షలు
కొంత మంది మహిళల్ని కించపరుస్తూ మాట్లాడతారు. శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానిస్తే మా తల్లి కోలుకోవడానికి 3నెలలు పట్టింది. చేతికి గాజులు వేసుకున్నావా? అమ్మాయిలా ఏడవకు? అంటూ కొన్ని పదాలు మాట్లాడతారు. అలాంటివి వాడితే నాకు బాధ కలుగుతుంది. అటువంటి వాటికి ఫుల్ స్టాప్ పెట్టాలి. అవన్నీ ఆగాలి. మార్పు ముందు మన ఇంటి నుండి మొదలు అవ్వాలి. అలాంటి మాటలు ఎవరైనా మాట్లాడితే ఇంకోసారి మాట్లాడొద్దని గట్టిగా చెప్పండి. మళ్లీ మాట్లాడితే అన్న లోకేష్ తోలుతీస్తాడని చెప్పండని భరోసా ఇచ్చారు. సినిమాల్లోనూ, వెబ్ సిరీస్ ల్లోనూ మహిళల్ని అవమానపరిచే డైలాగ్స్ బ్యాన్ చేయాలన్నారు. చట్టాలతోనే భద్రత రాదు. ప్రవర్తనలో మార్పు రావాలి. విద్యార్థి దశ నుండి మహిళల్ని గౌరవించడం నేర్పాలి. మార్పు మన ఇంటినుంచే మహిళలను గౌరవించాలి. అందుకే చాగంటి కోటేశ్వరరావు గారు రూపొందించిన నైతిక విలువల పుస్తకాలు పిల్లలకు ఇస్తున్నాం. పాఠ్యపుస్తకాల్లో ఇంటి పనుల ఫోటోలు చెరో సగం ఉండేలా చేశాం. మొన్న జరిగిన మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ లో పిల్లలతో తల్లికి వందనం చేయించామని మంత్రి లోకేష్ తెలిపారు