TDP Janasena alliance: తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అయిపోయిందని, అధికార పార్టీ వైఎస్సార్‌సీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) జోస్యం చెప్పారు. టీడీపీ, జనసేన అభ్యర్థుల తొలి జాబితా (TDP Janasena First List) విడుదల కావడంపై స్పందించారు. తన పనితీరు బావుంది కాబట్టే, చంద్రబాబు తనకు సీట్ కేటాయించారని చెప్పారు. మంగళగిరిలో వార్ వన్ సైడెడ్ అని.. రాష్ట్రంలోనూ వైసీపీ పని అయిపోయిందన్నారు. తాను చేసిన దాంట్లో పది శాతం కూడా వైసీపీ ప్రభుత్వం చేసిందా అన్నారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే ఇల్లు ఎక్కడ ఉందో, మీకు ఏమైనా తెలుసా... ఆయన తన గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.


అధికారంలో వైసీపీ, సేవ చేసింది నేనే.. 
వైసీపీ నేతలు తనను నాన్ లోకల్ అని, ఎన్నికల తరువాత వేరే ప్రాంతానికి వెళ్తారని ప్రచారం చేస్తున్నారని మీడియా అడిగిన ప్రశ్నకు లోకేష్ స్పందించారు. అధికారంలో లేకున్నా గత 4 సంవత్సరాల 10 నెలలు ప్రజలకు తాను అందుబాటులో ఉన్నానని పేర్కొన్నారు. అధికారంలో ఉన్నది వైసీపీ అని, కానీ నియోజకవర్గ ప్రజలకు సేవ చేసింది మాత్రం తానేనన్నారు. మంగళగిరికి వైసీపీ ప్రభుత్వం చేసింది ఏమీ లేదని, తాను చేసిన పనుల్లో పది శాతం కూడా వాళ్లు చేయలేదన్నారు. తనకు ఓటు హక్కు ఇక్కడే ఉందని, తన ఇల్లు సైతం ఇక్కడే ఉందన్నారు. కానీ మంగళగిరి ఎమ్మెల్యే ఇల్లు ఎక్కడ ఉందో మీకు తెలుసా అని లోకేష్ ప్రశ్నించారు. 


టీడీపీ, జనసేన భారీ మెజార్టీతో విజయం..
అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమి భారీ మెజార్టీతో విజయం సాధిస్తుందని, వైసీపీకి ప్రతిపక్ష హోదా సైతం రాదని లోకేష్ జోస్యం చెప్పారు. మంగళగిరిపై వైసీపీ ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ చేసిందన్న విషయంపై స్పందిస్తూ.. తనను ఓడించేందుకు వందల కోట్లు ఖర్చు పెట్టడానికి బదులుగా ప్రజలకు సేవ చేస్తే బాగుండేదన్నారు. సీఎం జగన్ ఇంటి సమీపంలో సైతం రోడ్లు, బ్రిడ్జి లాంటివి సరిగ్గా వేయలేని చేతకాని ప్రభుత్వం వైసీపీ సర్కార్ అంటూ ఎద్దేవా చేశారు. ప్రతిపక్షంలో ఉండి తాను 29 సంక్షేమ కార్యక్రమాలు చేశానన్నారు. మంగళగిరిలో గత ఎన్నికల్లో ఓడిపోయిన రోజు నుంచి తాను ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నానని లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే యువగళం పాదయాత్ర చేసిన రోజులు ఇందుకు మినహాయింపు అన్నారు. 


మంగళగిరిలో 80 శాతం తిరిగానని, ఓడిపోయిన చోటే విజయం సాధిస్తానని నమ్మకం ఉందన్న లోకేష్.. అందుకే తాను నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ దగ్గరగానే ఉన్నట్లు చెప్పుకొచ్చారు. మరికొన్ని రోజుల్లో ఎన్నికలు వస్తున్నాయని, నియోజకవర్గంలో ఓటర్ల వద్ద నుంచి అభిప్రాయాన్ని సేకరించి.. చంద్రబాబు తనకు మంగళగిరిలో పోటీకి అవకాశం ఇచ్చినట్లు తెలిపారు. తనను అడిగిన ప్రశ్నల్ని ఎమ్మెల్యే ఆర్కేను సైతం మీడియా మిత్రులు అడగాలంటూ లోకేష్ నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.
Also Read: టీడీపీ 94 స్థానాల జాబితా అభ్యర్థులు వీళ్లే - జనసేన మొదటి లిస్టులో ఎంతమంది అంటే?