పోలవరం నిర్వాసితులకు పరిహారం ఎందుకు ఇవ్వడం లేదని నారా లోకేశ్ ప్రశ్నించారు. పోలవరం ముంపు ప్రాంతాల్లో పర్యటనలో భాగంగా కూనవరం మండల పరిధిలో ఏర్పాటు చేసిన సమావేశంలో నిర్వాసితులతో మాట్లాడారు. 2019లో వరదలు వచ్చినప్పుడు నిర్వాసితులను ప్రభుత్వం కనీసం ఆదుకోలేదన్నారు. రూ.2,500 సాయం చేయలేని వైకాపా సర్కార్.. రూ.10 లక్షలు ఎలా ఇస్తుంది? అని అడిగారు.
నిర్వాసితులకు మొత్తం ఇళ్లు కట్టిస్తామని చెప్పి.. ఇప్పటివరకు ఒక్కటీ కట్టలేదని లోకేశ్ ఆరోపించారు. ఈ ఏడాది జులై నాటికి పోలవరం పూర్తి అవుతుందని చెప్పారని.. కానీ ఈ రెండున్నర ఏళ్లలో కేవలం రూ.850 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారని చెప్పారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ ఏమయ్యాయో చెప్పాలని? ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. చంద్రబాబు పోరాటం వల్లే విలీన మండలాలు ఏపీలో కలిశాయని గుర్తు చేశారు. గిరిజనులపై అట్రాసిటీ కేసులు పెట్టిన ఘనత జగన్ ప్రభుత్వానిదేనని ధ్వజమెత్తారు.
వరదల సమయంలో వైకాపా ప్రభుత్వం కనీసం వాటర్ ప్యాకెట్ కూడా ఇవ్వలేదని లోకేశ్ విమర్శించారు. రెండు బంగాళాదుంపలు ఒక కోవొత్తు ఇచ్చి పొమ్మన్నారని.. పోయిన ఏడాది వరదలు వచ్చినప్పుడు ఇస్తామన్న రూ.2.000 సాయం కూడా ఈ రోజు వరకూ ఇవ్వలేదు.నిత్యావసర సరుకుల కూడా ఇవ్వడం లేదన్నారు.
పోలవరం నిర్వాసితులను జగన్ రెడ్డి జల సమాధి చేస్తున్నాడని లోకేశ్ విమర్శించారు. నిర్వాసితుల త్యాగాల ఫలితం పోలవరమని చెప్పారు. ఇది కేవలం 1.90 లక్షల మంది చిన్న సమస్య మాత్రమేనని వైకాపా నాయకులు అంటున్నారని.. ఇది చిన్న సమస్య కాదు..చాలా పెద్ద సమస్య.. ఇది ఐదు కోట్ల ఆంధ్రుల సమస్య అని లోకేస్ చెప్పారు. ఆంధ్రుల జీవనాడి పోలవరాన్ని జగన్ రెడ్డి నాశనం చేస్తున్నారన్నారు.
లోకేశ్ ఇంకా ఏమన్నారంటే..
రెండున్నర ఏళ్ల పాలనలో రివర్స్ టెండరింగ్ పేరుతో కాలక్షేపం తప్ప ప్రాజెక్ట్ ముందుకు కదిలింది లేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గాలి కబుర్లు చెప్పి గిరిజనుల్ని మోసం చేశారు జగన్ రెడ్డి. గిరిజనుల దగ్గరకొచ్చి ముద్దులు పెట్టాడు, మొసలి కన్నీరు కార్చాడు, మోసపు హామీలు ఇచ్చాడు. 25 రకాల సౌకర్యాలతో నిర్వాసితులకు పునరావాస కాలనీలు కడతాం అన్నారు. ఇచ్చిన ఒక్క హామీ కూడా నిలబెట్టుకొని వాడిని ఏమంటాం?. జగన్ రెడ్డి గిరిజనుల పాలిట శాపంగా మారారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని వ్యక్తి పోలవరం నిర్వాసితులకు పరిహారం ఇస్తాడా? అని లోకేశ్ ప్రశ్నించారు.
పోలవరం నిర్మాణం వెనుక లక్షా 90 వేల మంది ప్రజల త్యాగం ఉంది. పోలవరం నిర్వాసితులను వైకాపా ప్రభుత్వం విస్మరించింది. నిర్వాసితులకు రూ. 10 లక్షలు ఇస్తామన్న హామీ ఏమైంది? పోలవరం నిర్వాసితులకు ఇళ్లు కట్టి ఎప్పుడిస్తారో చెప్పాలి? బినామీల పేరుతో వైకాపా నేతలు రూ.550 కోట్లు కాజేశారు. నిధుల స్వాహాపై సీబీఐ విచారణకు ఆదేశించే ధైర్యం ఉందా? చంద్రబాబు పోరాటం వల్లే విలీన మండలాలను ఏపీలో కలిపారు. చంద్రబాబు ఆధ్వర్యంలోనే పోలవరం పూర్తవుతుంది
- నారా లోకేశ్, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి