Nara Lokesh On Anna Canteens Damage: టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్లపై మరోసారి దాడి జరిగింది. అర్ధరాత్రి అన్నా క్యాంటీన్లపై వైసీపీ దాడి ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయ దిగజారుడు తనానికి నిదర్శనం అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. కుప్పం ఆర్టీసీ బస్టాండు కూడలి వద్ద 56 రోజులుగా నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ పై వైసీపీ శ్రేణులు దాడి చేసి ధ్వంసం చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. అధికారంలోకి రాగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 201 అన్న క్యాంటీన్లను వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిందని తెలిపారు. ఇప్పుడు పేదవాడి నోటి దగ్గర కూడు లాక్కుంటున్నా ఘనత వైసీపీ సొంతం అన్నారు. అర్ధరాత్రి కుప్పంలోని అన్న క్యాంటీన్ పై దాడి చేసిన వైసీపీ రౌడీ మూకలపై కఠిన చర్యలు తీసుకోవాలని నారా లోకేష్ (Nara Lokesh) డిమాండ్ చేశారు.
అన్నం పెట్టే అన్న క్యాంటీన్లను ధ్వంసం చేస్తారా..
ఏపీలో ఉన్మాది పాలన సాగుతోందని, రాష్ట్రంలో చిల్లర రాజకీయాలు చేస్తున్నారని చంద్రబాబు నాయుడు ఇటీవల కుప్పం పర్యటనలో విమర్శించారు. కుప్పంలో మూడో రోజుల పర్యటనలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. గురువారం నాటి కుప్పం ఘటన తానెన్నడూ చూడలేదన్నారు. వైసీపీ రౌడీ మూకలతో దాడులకు పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ రౌడీ ప్రతాపాలు తన దగ్గర కాదు... జగన్ దగ్గర చూపించుకోవాలన్నారు. తానిచ్చిన ఇళ్లను ఎందుకు రద్దు చేశారని చంద్రబాబు ప్రశ్నించారు. పులివెందులకు టీడీపీ హయాంలోనే నీళ్లు వచ్చాయని ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తుచేశారు. పేదలకు అన్నంపెట్టే అన్న క్యాంటీన్లను ధ్వంసం చేస్తారా? అంటూ చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పేదల పొట్టకొట్టిన వైసీపీ శ్రేణులకు మాట్లాడే అర్హత లేదన్నారు. పోలీసుల కనుసన్నల్లోనే అన్న క్యాంటీన్‌పై దాడి జరిగిందని విమర్శించారు. పోలీస్ వ్యవస్థ భ్రష్టు పట్టడానికి కారణం సీఎం జగన్, డీజీపీయేనని ఆరోపించారు.
వైసీపి అధికారంలోకి వచ్చి మూడున్నర సంవత్సరాలు పూర్తి అవుతున్నా.. ఇప్పటి వరకూ ఒక్క అభివృద్ధి పనులు చేపట్టలేదని టీడీపీ అధినేత మండిపడ్డారు.. కనీసం రైతులకు ఎంతగానో ఉపయోగపడే హంద్రీనీవా ప్రాజెక్టు పనులు కూడా ఎక్కడికక్కడే నిలిపి వేశారని మండిపడ్డారు. టీడీపీ హయాంలో హంద్రీనీవా పనుల కోసం విడుదల చేసిన డబ్బులు సైతం ఖర్చు పెట్టకుండా నిర్వీర్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.. హంద్రీనీవా పనులు పూర్తి చేయక పోతే జగన్ రెడ్డి చరిత్రహీనుడిగా మిగిలిపోతారని ఆయన హెచ్చరించారు.