టీడీపీ అధినేత ఎలాంటి తప్పు చేయలేదని, ప్రజల సంక్షేమం కోసమే ఆయన నిరంతర పోరాటమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ భావోద్వేగానికి గురయ్యారు. టీడీపీ నేతలు, శ్రేణులతో విస్తృత స్థాయి సమావేశంలో ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు. తన తల్లి భువనేశ్వరి ఐటీ రిటర్న్స్ చూపి కేసు పెడతామని సీఐడీ బెదిరించిందని, సేవా కార్యక్రమాలు తప్ప, రాజకీయాలు తన తల్లికి తెలియవని అన్నారు. 






మంత్రుల విమర్శలపై ఆగ్రహం


భువనేశ్వరి, బ్రాహ్మణి కలిసి చంద్రబాబును చంపేందుకు కుట్రలు పన్నారంటూ వైసీపీ మంత్రులు చేసిన విమర్శలపై నారా లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 'నా తల్లి భువనేశ్వరి, భార్య బ్రాహ్మణి కలిసి చంద్రబాబుకు భోజనంలో విషం కలుపుతారట. భోజనంలో విషం కలపడం, బాబాయిని చంపేయడం వంటివి జగన్ డీఎన్ఏ' అంటూ లోకేశ్ మండిపడ్డారు.


సీఎం జగన్ పై విమర్శలు


2019లో ఒక్క ఛాన్స్ అంటే ప్రజలు జగన్ ను సీఎంగా చేశారని, అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జగన్ నియంతలా వ్యవహరించారని, రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టేశారని మండిపడ్డారు. వేల మంది టీడీపీ నేతలపై కక్ష పూరితంగా కేసులు పెట్టారని, ప్రజా వేదిక కూల్చేశారని అన్నారు. ఇసుక రవాణా, మద్యం విషయాల్లో వైసీపీ నేతలు అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. టీడీపీ హయాంలో పేదల సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగిందని ఇప్పుడు రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదని విమర్శించారు. చంద్రబాబు సీఎంగా కష్టపడి తెచ్చిన పరిశ్రమలను జగన్, వైసీపీ నేతలు రాష్ట్రం నుంచి వెళ్లగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.


'దోపిడీలో బిజీ'


రాష్ట్రంలో అనేక సమస్యలున్నాయని, వర్షాలు లేక పంటలు ఎండిపోతున్నాయని, ప్రాజెక్టులు కాపాడాల్సిన జగన్ దోపిడీలో బిజీగా ఉన్నారని లోకేశ్ ఎద్దేవా చేశారు. పేదలను దోచుకుంటూ పేదలకు - పెత్తందారులకు మధ్య యుద్ధం అంటూ జగన్ ప్రసంగిస్తున్నారని దుయ్యబట్టారు. విద్యుత్ ఛార్జీల బాదుడుతో ఏడాదికి ప్రజల నుంచి రూ.11 వేల కోట్లు దోచుకున్నాడని ఆరోపించారు. జరగబోయేది పేదలకు - దోపిడీదారులకు మధ్య యుద్ధమని చెప్పారు.


టీడీపీ - జనసేన లేకుంటే


టీడీపీ - జనసేన కలిస్తే వచ్చే ఎన్నికల్లో 160 స్థానాల్లో గెలుపు ఖాయమని నారా లోకేశ్ ధీమా వ్యక్తం చేశారు. ఈ 2 పార్టీలు కలిసి పోరాడకుంటే రాష్ట్రాన్ని సీఎం జగన్ ముక్కలు చేసేవాడని అన్నారు. ఏ తప్పూ చేయకున్నా చంద్రబాబును జైల్లో పెట్టారని, డబ్బే సంపాదించాలని భావిస్తే ఆయనకు రాజకీయాలు అవసరం లేదన్నారు. ఉద్యోగాలు కల్పించినందుకు, సంక్షేమం అమలు చేసినందుకు, రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాలని కోరినందుకు, జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని అడిగినందుకు ఆయన్ను జైల్లో పెట్టారా.? అని లోకేశ్ నిలదీశారు.


'రాష్ట్రానికి చంద్రబాబు అనేక పరిశ్రమలు తీసుకొచ్చారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించారు. కుటుంబం గురించి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా అహర్నిశలు ప్రజల కోసమే పరితపించారు. పేదవారి అభివృద్ధి కోసమే కష్టపడ్డారు.' అని లోకేశ్ పేర్కొన్నారు.