Chandrababu Birthday: చంద్రబాబు పేరు మీద అన్ని అన్నక్యాంటీన్లలో భోజనం ఫ్రీ.. సీఎంకు సతీమణి బర్త్‌డే గిఫ్ట్
ఎపీ సీఎం చంద్రబాబు పుట్టిన రోజు నాడు ఆయన సతీమణి భువనేశ్వరి అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చారు. అయితే ఈ గిఫ్ట్ ఆయనకు కాదు.. పేద ప్రజలకు..!

- చంద్రబాబు పుట్టినరోజున అన్న క్యాంటీన్లకు భువనేశ్వరి రూ.76 లక్షల విరాళం.
- రాష్ట్రవ్యాప్తంగా అన్న క్యాంటీన్లలో ఉచిత భోజనం అందించాలని ఆమె కోరారు.
- పేదల ఆకలి తీర్చే ఈ కార్యక్రమానికి అందరూ చేయూతనివ్వాలని భువనేశ్వరి పిలుపు.
- అన్నదానం, అన్న క్యాంటీన్ల సేవలను విస్తరించాలని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు.
Chandrababu Birthday: ఏప్రిల్ 20న ఏపీ సీఎం చంద్రబాబునాయుడు జన్మదినం. ఈ సందర్భంగా ఆయన సతీమణి ఓ అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చారు. అయితే ఈ గిఫ్ట్ ఆమె భర్త చంద్రబాబుకు కాదు. రాష్ట్రంలోని పేద ప్రజలకు.. ఆయన పుట్టిన రోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లలో భోజనాన్ని ఉచితంగా ఇవ్వనున్నారు. ఇందుకోసం 76లక్షల చెక్‌ను ఆమె చంద్రబాబు సమక్షంలో అన్న క్యాంటీన్ సీఈవోకు అందజేశారు.
అమ్మను తలపిస్తోన్న అన్న క్యాంటీన్ల సేవలు
రాష్ట్రంలో అన్న క్యాంటీన్లు అన్నం పెట్టే అమ్మను తలపిస్తున్నాయని నారా భువనేశ్వరి అన్నారు. ప్రతిరోజూ లక్షల మంది పేద ప్రజల ఆకలిని క్యాంటీన్లు తీరుస్తున్నాయని.. పేదల కడుపు నింపే మహోన్నత కార్యక్రమంగా దీనిని అభివర్ణించారు. రూ.5లకే పరిశుభ్ర వాతావరణంలో ప్రభుత్వం గౌరవంగా పేదలకు భోజనం అందిస్తోందని ప్రశంసించారు ఏప్రిల్ 20వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు పుట్టిన రోజు సందర్భంగా నారా భువనేశ్వరి రూ.76 లక్షలు విరాళంగా అందించారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో చెక్ ను అన్న క్యాంటీన్ సీఈవోకు అందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదినం నాడు రాష్ట్ర వ్యాప్తంగా 269 అన్న క్యాంటీన్లలో పూర్తి ఉచితంగా భోజనం అందించాలని భువనేశ్వరి కోరారు. చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా పేదలకు కడపు నింపే అన్న క్యాంటీన్లకు విరాళం ఇవ్వడం ఎంతో సంతృప్తిని ఇచ్చిందని భువనేశ్వరి అన్నారు.
పరిశుభ్రమైన వాతారణంలో అన్న క్యాంటీన్లలో మంచి ఆహారాన్ని అందిస్తున్నారని..రోజువారీ కూలీలు, పేదలు ఈ పథకం ద్వారా ఎంతో లబ్ది పొందుతున్నారని...ఇలాంటి కార్యక్రమాలను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని కోరారు. సాయం చేయగలిగిన స్థాయిలో ఉన్నవారు పేదల ఆకలిని తీర్చే ఈ కార్యక్రమానికి చేయూతనివ్వాలని పిలుపునిచ్చారు. తమ మనవడు దేవాన్ష్ పుట్టిన రోజు సందర్భంగా 12 ఏళ్లుగా ప్రతీ ఏటా తిరుమలలో అన్న ప్రసాదానికి రూ.44 లక్షలు విరాళంగా ఇస్తున్న విషయాన్ని ఆమె ప్రస్థావించారు. చంద్రబాబు నాయుడుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నారా భువనేశ్వరి....అన్న క్యాంటీన్లకు రూ.76 లక్షల విరాళం ఈ ఏడాది మీ పుట్టిన రోజుకు మేమిచ్చే బహుమానం అంటూ వ్యాఖ్యానించారు. తన పేరు మీద అన్న క్యాంటీన్లకు ఒక రోజు అన్నదానానికి రూ.76 లక్షల విరాళం ఇచ్చిన తన సతీమణి భువనేశ్వరిని ముఖ్యమంత్రి అభినందించారు.
ధార్మిక కార్యక్రమాలకు చేయూతనివ్వాలి
ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ... “రాష్ట్రంలో అన్నదాన కార్యక్రమాన్ని ఒక గొప్ప కార్యక్రమంగా ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. తిరుమలలో భక్తుల సహకారంతో 4 దశాబ్దాలుగా అన్నదానం జరుగుతోంది. అలాగే ప్రముఖ దేవాలయాల్లోనూ అన్నదానం నిర్వహిస్తున్నాం. పేదలకు రూ.5 లకే కడుపునింపే అన్న క్యాంటీన్ సేవలను మరింత విస్తరించాలి. నాణ్యతను పాటించడంతో పాటు..పవిత్రంగా, గౌరవంగా, పరిశుభ్రంగా ఆహారం అందించే ఈ కార్యక్రమానికి దాతలు ముందుకు వచ్చి విరాళాలు ఇవ్వాలి. పుట్టిన రోజు, పెళ్లి రోజు సహా తమకు నచ్చిన రోజు భోజనాలకు అయ్యే ఖర్చును విరాళంగా ఇచ్చేందుకు ప్రజలు ముందుకు రావాలి. ఇదొక స్ఫూర్తి దాయకమైన కార్యక్రమంగా మారి బ్రాండ్ ను సృష్టించాలి' అని చంద్రబాబు అన్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు




















