Pitapuram News:  పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధి, సమస్యల పరిష్కారంపై పవన్ కళ్యాణ్ కు ఎప్పటికీ ప్రత్యేక దృష్టి ఉంటుందని ఎమ్మెల్సీ నాగబాబు అన్నారు.  ప్రజలకు ఏ చిన్న సమస్య వచ్చినా తక్షణం స్పందించే నాయకుడు పవన్ అని..   అలాంటిది తన సొంత నియోజకవర్గంలో ప్రజలకు ఎలాంటి సమస్య రానివ్వరని హామీ ఇచ్చారు. సమస్య ఉందీ అంటే పరిష్కారం అయ్యే వరకు వదిలిపెట్టరని స్పష్టం చేశారు. శుక్రవారం సాయంత్రం పిఠాపురం పట్టణ పరిధిలోని జగ్గయ్య చెరువు కాలనీలో మహిళలతో ముఖాముఖీ సమావేశం నిర్వహించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. డ్రెయినేజీ, తాగునీరు, రోడ్డు సౌకర్యాలు లేక ఏళ్ల తరబడి ఇబ్బందులు పడుతున్నట్టు ఆ ప్రాంతవాసులు వివరించారు. 

గతంలో రోడ్లు వేయకుండా కూడా వేసినట్టు బిల్లులు తీసుకున్న సందర్భాలు ఉన్నాయని ప్రజలు ఈ సందర్భంగా నాగబాబు దృష్టికి తీసుకెళ్లారు.  సమస్యలు చెప్పడం ప్రజల హక్కు.. ప్రజా ప్రతినిధులుగా వాటిని పరిష్కరించడం మా బాధ్యత అన్నారు.  రాష్ట్రవ్యాప్తంగా  తన దృష్టికి వచ్చిన ఎవరెవరో సమస్యలను పవన్  పరిష్కరిస్తారు. జగ్గయ్య చెరువు కాలనీవాసుల సమస్యలు కూడా ఆయన దృష్టికి వచ్చాయి. మీరు చెప్పిన సమస్యలన్నింటికీ త్వరలోనే పరిష్కారం చూపుతామని హమీ ఇచ్చారు.  

 పవన్ కళ్యాణ్  ప్రతినిధులుగా జగ్గయ్య చెరువు కాలనీవాసుల సమస్యలు తెలుసుకునేందుకు వచ్చామని మీ సమస్యలపై అధ్యయనం చేసి ఒక నివేదిక సమర్పించమని పవన్ కళ్యాణ్ గారు ఆదేశించారన్నారు. త్వరలో ఒక అధికార బృందాన్ని ఈ ప్రాంతానికి పంపి సమస్యలపై ఇంటింటి సర్వే నిర్వహిస్తాం. తక్షణం వాటి పరిష్కారంపై దృష్టి సారిస్తామని భరోసా ఇచ్చారు.  ప్రజలు సమస్యలు చెప్పుకుంటే భారంగా భావించే నాయకుడు కాదు   పవన్ కళ్యాణ్  తన దృష్టికి వచ్చిన సమస్యలు ఎప్పుడు పరిష్కరిద్దామా అని ఆలోచన చేసే నాయకుడన్నారు. 

జగ్గయ్య చెరువు కాలనీవాసులంతా సంతోషపడే విధంగా ఈ ప్రాంతంలో సౌకర్యాలు కల్పిస్తాము. సమస్యల తక్షణ పరిష్కారానికి కృషి చేస్తామని జనసేన నేతలు భరోసా ఇచ్చారు. పిఠాపురంలో చాలా కాలంగా జగ్గయ్య చెరువు ప్రాంతంలో మౌలిక సదుపాయాల కొరత ఉంది. ఈ అంశంపై పవన్ తన దృష్టికి రాగానే పరిష్కారానికి బృందాన్ని పంపారు.