Nagababu on Janasena: రాష్ట్రంలో జనసేన పార్టీ అధికారంలోకి రావాలని, ముఖ్యమంత్రి జగన్ పోవాలని.. అప్పుడు రాష్ట్రానికి బంగారు భవిష్యత్తు వస్తుందని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు అన్నారు. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం హరిపురంలో ఎలమంచిలి నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయాన్ని ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో నాగబాబు మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన పార్టీ పొత్తులపై చర్చలు వద్దని చెప్పారు. జనసే పార్టీ తరఫున ఎవరు పోటీ చేస్తే వారిని గెలిపించడమే ధ్యేయంగా పని చేయాలన్నారు. అలాగే ప్రజల్లో చైతన్యం మొదలైందన్నారు. గత ఎన్నికల్లో 7 శాతం ఓట్లు రాగా.. ఇప్పుడు ఓటింగ్ శాతం 35కు పెరిగిందని అంచనాలు చెబుతున్నాయి. పార్టీకి మహిళలు ఆక్సిజన్ లాంటి వాళ్లని, పవన్ కల్యాణ్ కు సలహాలు ఇవ్వొద్దని అన్నారు. అలాగే ఆయన నిర్ణయాన్ని అంతా గౌరవిద్దామని నాగబాబు చెప్పుకొచ్చారు.
అధికారాన్ని అడ్డం పెట్టుకొని నాయకులు రూ. లక్షల కోట్లు స్వాహా చేస్తుంటే.. ప్రజలకు మంచి చేయడానికి డబ్బులు ఎందుకు ఉండవని నాగబాబు ప్రశ్నించారు. పవన్ అధికారంలోకి వస్తే అన్ని పంటలకు గిట్టుబాటు ధర ఇప్పిస్తారని చెప్పారు. పార్టీ రాష్ట్ అధికార ప్రతినిధి సుందరపు విజయ్ కుమార్ తన ప్రసంగంలో ఎలమంచిలి ఎమ్మెల్యే రమణమూర్తి రాజు అక్రమాలను ఎండగట్టారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బాధిత కుటుంబ సభ్యులకు విజయ్ కుమార్ తన వ్యక్తిగత నిధులు రూ.5 లక్షలను సాయంగా అందించారు. ఈ సందర్భంగా అనకాపల్లి నుంచి హరిపురం వరకూ రెండు వేల మందిలో భారీ బైకు, కార్ల ర్యాలీ నిర్వహించారు.
జనవరిలో అనంతపురంలో పర్యటించిన నాగబాబు
అనంతపురం నగరంలో జనసేన పార్టీ పీఏసీ సభ్యుడు, టాలీవుడ్ నటుడు నాగబాబు పర్యటించారు. నగరంలోని చెరువు కట్టపై ఉన్న రోడ్డును జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సోదరుడైన నాగబాబు పార్టీ కార్యకర్తలతో కలిసి పరిశీలించారు. ఇక్కడ రోడ్లు ఎలా ఉన్నాయో, ఆంధ్రప్రదేశ్ పరిస్థితి కూడా అలాగే ఉందని నాగబాబు ఎద్దేవా చేశారు. వైసీపీ ప్రభుత్వం పోలీసుల సహకారంతో తమను ఇబ్బంది పెట్టినంత మాత్రాన తమ కార్యక్రమాలను జనసేన ఆపదని స్పష్టం చేశారు. సీఎం జగన్ ఎలాగూ రోడ్లు వేయరని, జనసేనికులు రోడ్లు వేయాలని భావించారు. అయితే జనసేన శ్రేణులు రోడ్లు వేయడం మొదలుపెట్టగానే వైసీపీ ప్రభుత్వం ఆ మంచి పనిని కూడా ఏదో ఓ కారణం చెప్పి అడ్డుకుందని మండిపడ్డారు. ప్రజాస్వామ్య దేశంలో ఇల్లీగల్, చట్ట వ్యతిరేక పనులు తప్ప ప్రజలకు ఉపయోగపడే పనులు ఎవరైనా, ఎప్పుడైనా చేయొచ్చు అన్నారు. కానీ ప్రభుత్వం చేయడం లేదని తాము మంచి పనులు మొదలుపెట్టినా ఏపీ ప్రభుత్వం అడుగడుగునా అడ్డంకులు సృష్టించడం నిజం కాదా అని నాగబాబు ప్రశ్నించారు.