ఇదే వేదిక నుంచి 2024 ఎన్నికల శంఖారావం పూరించనున్న చంద్రబాబు,పవన్ కళ్యాణ్
విజయనగరం: 2024 ఎన్నికలే లక్ష్యంగా యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర పూర్తైన సందర్భంగా బుధవారం నిర్వహించనున్న యువగళం- నవశకం బహిరంగ సభకు టీడీపీ నేతలు కళ్ళు చెదిరే స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఈ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పాటు ఇరు పార్టీలకు చెందిన కీలక నేతలు హాజరు కానుండటంతో యావత్ ఆంధ్రప్రదేశ్ చూపు విజయనగరం జిల్లా, పోలిపల్లి వద్ద జరిగే బహిరంగ సభపై పడింది. రాష్ట్ర చరిత్రలో గుర్తుండి పోయే విధంగా ఈ సభ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయనీ తెలుగు దేశం నాయకులు చెబుతున్నారు.ఈ యువగళం-నవశకం సభ మధ్యాహ్నం 3 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు జరగనుంది.
భారీ ఎత్తున వస్తున్న టీడీపీ నేతలు
రాష్ట్ర నలుమూలల నుండి టీడీపీ నేతలు... జనసైనకు లు అందుబాటులో ఉన్న వాహనాలతో సభా ప్రాంగణానికి ఇప్పటికే చేరుకుంటున్నారు. ఇందుకోసం టీడీపీ 5 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. ఇవిగాక ప్రైవేటు బస్సులు, లారీలు, కార్లు, ఇతర వాహనాల్లో టీడీపీ అభిమానులు సభా స్థలికి చేరుకుంటున్నారు. ఈ వేదికపై నుండి ఇరు పార్టీల అధినేతలు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఎన్నికల శంఖారావాన్ని పూరించనుండటంతో దీనిపై రాష్ట్ర, జాతీయ మీడియా ఆసక్తిని కనబరుస్తున్నాయి. ఇప్పటికే పెద్దఎత్తున మీడియా ప్రతినిధులు విశాఖపట్నానికి చేరుకున్నారు
సభా ప్రాంగణ ఏర్పాట్లు ఇవే
చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఒకే వేదికపై మాట్లాడటం ఇదే ప్రథమం. పెద్దఎత్తున ఇరు పార్టీల శ్రేణులు హాజరవనున్న నేపథ్యంలో 110 ఎకరాల విశాల ప్రాంగణంలో సభ జరగనుంది. 8 అడుగుల ఎత్తు, 200 అడుగుల పొడవు, 100 అడుగల వెడల్పుతో వేదిక సిద్ధమైంది. వేదికపై సుమారు 600 మంది ఆసీనులవనున్నారు. సభ ఎదురు వీఐపీలు కూర్చుంటారు. సభ వీక్షించేందుకు కుర్చీలు, ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. రాష్ట్ర నలుమూల నుండి సభకు వచ్చే ప్రజలను తరలించడానికి విశాఖపట్నం, విజయనగరం రైల్వే స్టేషన్ల వద్ద ప్రత్యేక రవాణా సౌకర్యం కల్పించారు. ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుండి వచ్చే వాహనాలకు 2, విశాఖ వైపు నుండి వచ్చే వాహనాలకు 2 భారీ పార్కింగ్ లు సభకు ఇరువైపులా ఏర్పాటు చేశారు. ఈ నవశకం బహిరంగ సభ ఈ దశాబ్ధపు అతిపెద్ద వేడుక కావడంతో టీడీపీ శ్రేణులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. సుదూర ప్రాంతాల నుండి వచ్చే కార్యకర్తలు, అభిమానుల కోసం సభా ప్రాంగణం వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
సభాప్రాంగణం వద్ద పండుగ వాతావరణం
పోలిపల్లి వద్ద సభ నిర్వహిస్తున్న సందర్భంగా ఆ ప్రాంతమంతా పండుగ వాతావరణం నెలకొంది. ప్లెక్సీలు, స్వాగత థోరణాలతో చేసిన ఏర్పాట్లతో పరిసర ప్రాంతమంతా పసుపుమయమైంది. విశాఖపట్నం-విజయనగరం మధ్య కట్టిన భారీ కటౌట్లు, జండాలతో ఆ ప్రాంతమంతా పసుపుజాతరను తలపిస్తోంది.
చిత్తూరు నుంచి యువగళం సభకు ప్రత్యేక రైళ్లు..
విజయనగరం జిల్లా పోలిపల్లిలో జాతీయ రహదారి వద్ద నిర్వహించే యువగళం ముగింపు సభకు చిత్తూరు నుండి తెలుగుదేశం పార్టీ నాయకులు భారీ సంఖ్యలో వెళ్లేందుకు జిజేఎం ట్రస్టు ఆధ్వర్యంలో ప్రత్యేక రైలును ట్రస్ట్ అధినేత టిడిపి నాయకులు గురజాల జగన్మోహన్ నాయుడు లాంఛనంగా మంగళవారం ఉదయం ప్రారంభించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఎన్నో సమస్యల పట్ల నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ పోరాటం చేస్తున్నారన్నారు.. ఇందులో భాగంగా యువగళం ముగింపు విజయోత్సవ సభకు సుమారు పది లక్షల మంది హాజరు కానున్నట్లు వెల్లడించారు.
చిత్తూరు పాకాల రేణిగుంట నుండి తెలుగుదేశం పార్టీ నాయకులు యువగళం విజయోత్సవ సభకు చేరుకోవడానికి ప్రత్యేక రైలును జిజేఎం ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసేమన్నారు.. ఈ యువగళం ముగింపు విజయోత్సవ సభకు నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ హాజరవుతారన్నారు.. యువ నాయకుడు నారా లోకేష్ యువగళం పాదయాత్రలో ఎన్నో సమస్యలను ప్రజల వివరించారని, వాటిని అధికారంలోకి వచ్చాక పరిష్కరిస్తారని తెలిపారు.. రాబోయే 2024 ఎన్నికల్లో నారా చంద్రబాబు నాయుడు అధికారం చేపడతారని ఆశాభావం వ్యక్తం చేశారు.. ఈ కార్యక్రమంలో టిడిపి మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, క్రిస్టియన్ సెల్ జిల్లా అధ్యక్షుడు పీటర్, జిల్లా నుండి భారీ ఎత్తున టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.