Mylavaram MLA Vasantha Krishna Prasad :  ఉమ్మడి కృష్ణా జిల్లా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ సారి ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండనున్నట్లుగా పార్టీ హైకమాండ్ కు తెలిపారు. మైలవరం సీటును మంత్రి జోగి రమేష్ కు కేటాయించారని..  వసంత కృష్ణ ప్రసాద్ ను.. జగ్గయ్య పేట నుంచి పోటీ చేయాలని సూచించినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే దీనికి ఆయన అసంతృప్తికి గురయ్యారు. పార్టీ హైకమాండ్ కు అందుబాులోకి రాకుండా వెళ్లిపోయారు. తాను పోటీ చేయడానికి సిద్ధంగా లేనని సమాచారం పంపినట్లుగా తెలుస్తోంది. మాట్లాడుకుందాం.. సీఎం క్యాంప్ ఆఫీసుకు రావాలని ఆయనకు సమాచారం పంపినా  ఆయన పట్టించుకోలేదు. దీంతో ఆయన ను బుజ్జగించేందుకు వైసీపీ పెద్దలు ప్రయత్నిస్తున్నారు. 


మైలవరం నియోజకవర్గంలో వర్గ పోరాటం చాలా కాలంగా ఉంది.   వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నియోజకవర్గాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అయితే ఇదే నియోజకవర్గంలో సొంత పార్టీకి చెందిన నేతలు గ్రూపులుగా ఏర్పడటం పై జగన్ మోహన్ రెడ్డి సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. స్థానిక శాసన సభ్యుడు వసంత కృష్ణప్రసాద్ ఉండగా, అదే నియోజకవర్గంలో ఉమ్మడి కృష్ణాజిల్లాలో ఏకైక మంత్రిగా ఉన్న జోగి రమేష్ కూడా జోక్యం చేసుకుంటున్నారు. తన పాత నియోజకవర్గం కావటం, తన తండ్రి ఇతర కుటుంబ సభ్యులు సైతం అదే నియోజకవర్గంలో పార్టీ కోసం ఆవిర్బావం నుంచి కష్టపడటంతో జోగి రమేష్ మైలవరం నియోజకవర్గంపై మనస్సు పెట్టుకున్నారు.                              


అక్కడ జోగి రమేష్ వర్గం ఒకటి ఏర్పడి, స్థానిక శాసన సభ్యుడిగా ఉన్న వసంత కృష్ణప్రసాద్ కు వ్యతిరేకంగా పని చేయటం ఆరంభించారు. ఇది వసంతకు ఇబ్బందిగా మారింది. ఒకే పార్టీలో ఉండి కూడా స్థానిక శాసన సభ్యుడికి వ్యతిరేకంగా కార్యకలాపాలు చేపట్టటం అదే సమయంలో జోగికి మంత్రి పదవిని కూడా ఇప్పించటంతో వసంత అవమానంగా భావించారు.  మైలవరంలో మంత్రి జోగి రమేష్, శాసన సభ్యుడు వసంత కృష్ణప్రసాద్ మధ్య విభేదాలపై ఇరువురు నేతలు బాహాటంగానే కామెంట్స్ చేసుకున్నారు. అయితే ఈ వ్యవహరంపై పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి పంచాయితీ కూడా చేశారు. అయినా ఇరువురు నేతలు తమ వైఖరిని మార్చుకోలేదు.                                          
 
ముఖ్యమంత్రి జోక్యంతో ఈ వివాదం సమసిపోయిందని ఎవరి పని వారు చేసుకుంటామని వసంత గతంలో వెల్లడించారు. అంతే కాదు తాను ఎప్పటికి జగన్ వెంటనే ఉంటానని కూడా క్లారిటి ఇచ్చారు. తీరా ఇప్పుడు ఎన్నికలకు ముందు నియోజకవర్గం మారాలని చెప్పడంతో వసంత కృష్ణ ప్రసాద్ ఫీలయ్యారని అంటున్నారు. గత నాలుగేళ్లుగా అవమానాలను భరిస్తున్నానని ఇక తన వల్ల కాదని ఆయన సైడ్ అయిపోయినట్లుగా చెబుతున్నారు.