Mudragada Padmanabham To Join YSRCP : కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. గతంలో ఎప్పటినుంచో ఆయన చేరికపై వార్తలు వస్తున్నా.. తాజాగా ముద్రగడ చేరికకు ఓకే అన్నట్లు తెలుస్తోంది.   మళ్లీ యాక్టివ్ రాజకీయాల్లో పాల్గొనాలని ఆయన కోరుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఆయన వైసీపీలో చేరితే పోటీ చేస్తారా లేకపోతే.. కుమారుడికి టిక్కెట్ అడుగుతారా అన్నది తేలాల్సి ఉంది. అయితే పార్టీ హైకమాండ్ ఆయనకు పెద్దాపురం సీటును ఆఫర్ చేసినట్లుగా తెలుస్తోంది. గత ఎన్నికల్లో పెద్దాపురం నుంచి తోట నరసింహం భార్య పోటీ చేశారు. ఈ సారి తోట నరసింహానికి జగ్గంపేట టిక్కెట్ ఇవ్వాలని వైసీపీ హైకమాండ్ నిర్ణయించింది.                      
 
కాపు రిజర్వేషన్ల ఉద్యమ కర్తగా ముద్రగడ వ్యవహరించారు.  గతంలో ఆయన కాపు రిజర్వేషన్ల కోసం జరిగిన ఉద్యమం సందర్భంగా చంద్రబాబు ప్రభుత్వంతో ఢీ అంటే ఢీ అన్నట్టుగా వ్యవహరించారు. ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చినా ఆయన పెద్దగా యాక్టివ్ కాలేదు. టీడీపీ, జనసేన పొత్తుల కారణంగా కాపు ఓటు బ్యాంక్ చెదిరి పోకుండా ముద్రగడను పార్టీలో చేర్చుకోవాలని అనుకున్నారు. గతంలో పవన్ వారాహి యాత్రలో కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై విమర్శలు చేసినప్పుడు ముద్రగడ  పవన్ పై విరుచుకుపడ్డారు. అప్పుడే ఆయన వైసీపీలో చేరుతారన్న ప్రచారం జరిగింది.                  


ఇప్పుడు  వచ్చే ఎన్నికలకు అభ్యర్థులను  ఖరారు చేస్తున్న సీఎం జగన్  వైసీపీ ఇన్ చార్జులను మారుస్తున్నరు. ఈ క్రమంలో ఆయన పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. తన కన్నా..  తన  కుమారుడు చల్లారావు భవిష్యత్ కోసం అధికార పార్టీలో చేరేందుకు సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ విషయమై ఉభయ గోదావరి జిల్లాల వైసీపీ ఇన్ చార్జిగా ఉన్న మిథున్ రెడ్డితో పలువురు ముద్రగడ ఇంటికి వెళ్లి పలుమార్లు చర్చలు జరిపారు. తమ కుమారుడి భవిష్యత్ కు బాటలు వేసేందుకు ఇదే అనువైన సమయమని ఆయన భావించారు. ఇదే విషయమై క్లారిటీ వస్తే ముద్రగడ చేరిక దాదాపు ఖరారైనట్టే.                                                      


ఆమేరకు మార్పులు చేర్పులు చేస్తున్నట్టు వైసీపీ నుంచి స్పష్టమైన హామీ వచ్చినందునే ముద్రగడ పార్టీలో చేరేందుకు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. అయితే పోటీ చేసేందుకు ఆర్థిక స్థోమత లేదని, తన కొడుకు చల్లారావును పోటీ చేయించి గెలిపించే బాధ్యత వైసీపీదేనని కోరినట్టు తెలుస్తోంది. ఈ విషయంపై మరో రెండు రోజుల్లో పూర్తి స్పష్టత రానున్నట్లు సమాచారం. ముద్రగడతో  పోటి చేయిస్తారా.. ఆయన కుమారుడితోనా అన్నదానిపై వైసీపీ అధికారిక ప్రకటన చేసే ్వకాశం ఉంది.