వైఎస్ఆర్ సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి రాజ్యసభలో నేడు (జూలై 27) సినిమా హీరోలపై కీలక వ్యాఖ్యలు చేశారు. సినిమా అంటే హీరో ఒక్కడే కాదని, ఎంతో మంది కార్మికుల శ్రమ అని అన్నారు. రాజ్యసభలో సినిమాటోగ్రఫీ సవరణ బిల్లుపై నేడు చర్చ జరిగింది. ఈ చర్చలో ఆయన మాట్లాడుతూ.. సినిమా బడ్జెట్ లో ఎక్కువగా పారితోషికం హీరోలకు వెళ్లే పద్ధతి మారాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. సినిమా బడ్జెట్‌ మొత్తంలో ఎక్కువ డబ్బులు ప్రస్తుతం హీరోల రెమ్యునరేషనే ఉంటోందని గుర్తుచేశారు. బాలీవుడ్ స్టార్ సల్మాన్‌ఖాన్ వంటి బడా హీరోలు ఒక్కో సినిమాకి రూ.200 కోట్ల వరకు తీసుకుంటున్నారని చెప్పారు. ఈ విధానం మారాలని అన్నారు. అంతేకాక, హీరో కొడుకులే హీరోలు ఎందుకు అవుతున్నారని ఆయన ప్రశ్నించారు. 


సినిమా చిత్రీకరణలో భాగంగా పని చేసిన కార్మికులకు మాత్రం తక్కువ జీతాలు, భత్యాలు ఇస్తున్నారని విజయసాయి రెడ్డి అన్నారు. అందరూ సమానంగా కష్టపడతారని, కాబట్టి, అందరికీ సముచిత ప్రయోజనం చేకూరాలని కోరారు. దానికి అనుగుణంగా సినిమాటోగ్రఫీ చట్టాన్ని బలోపేతం చేసే దిశగా కేంద్రం ప్రయత్నించాలని కోరారు. 


చివరికి బిల్లు ఆమోదం
సినిమాల పైరసీని అరికట్టేందుకు తీసుకొచ్చిన సినిమాటోగ్రాఫీ సవరణ బిల్లును రాజ్యసభ ఆమోదించింది. సినిమాల పైరసీని అరికట్టేందుకు ఈ బిల్లు ఉపకరించనుంది. దీని కింద సినిమా పైరసీకి పాల్పడే వారికి 3 నెలల నుంచి 3 ఏళ్ల వరకు శిక్ష విధించే వీలుంది. ఇది కాకుండా, సినిమా బడ్జెట్లో  3 లక్షల నుండి 5 శాతం వరకు జరిమానాగా వసూలు చేయవచ్చు. ఈ ఏడాది ఏప్రిల్‌లో కేబినెట్ సినిమాటోగ్రాఫీ చట్టం 2023కి ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత తాజాగా పార్లమెంటులో ప్రవేశపెట్టారు. 


కేబినెట్ ఆమోదం పొందిన అనంతరం, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ దీని గురించి మాట్లాడుతూ.. మన దేశంతో పాటు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కళాకారులకు పైరసీ పెద్ద సవాలుగా మిగిలిపోయిందని అన్నారు. మంచి కంటెంట్‌ని రూపొందించడానికి భారీ టీమ్ అవసరమని, దురదృష్టవశాత్తూ అనేక సార్లు పైరసీ కారణంగా వారి శ్రమ వృథా అయిపోయిందని గుర్తు చేశారు. దీంతో సినిమా పరిశ్రమకు కోట్లలో నష్టం వాటిల్లుతోందని అన్నారు. దీన్ని అరికట్టేందుకు సినిమాటోగ్రాఫ్ సవరణ బిల్లును తీసుకువస్తున్నామని చెప్పారు.


గతంలో 2019లో ఈ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టగా, స్టాండింగ్ కమిటీకి పంపారు. అనంతరం అన్ని రకాల సూచనలు చేశారు. ఈ బిల్లు వల్ల యావత్ సినీ పరిశ్రమకు ఎంతో మేలు జరుగుతుందని చెప్పారు. ఇప్పుడు ఎట్టకేలకు ఈ బిల్లు రాజ్యసభ నుంచి కూడా ఆమోదం పొందింది. సినిమాటోగ్రాఫీ బిల్లు, 1952ని సవరించడం ద్వారా ఈ బిల్లుకు కొత్త రూపం ఇచ్చారు. ఈ బిల్లును జూలై 20న రాజ్యసభలో ప్రవేశపెట్టారు. 


ఈ సవరణలు అమల్లోకి వస్తే, సినిమాలకు సంబంధించి ఎలాంటి పైరసీ చేసినా కఠిన శిక్ష విధించే వీలు కలుగుతుంది. ఎవరైనా సినిమాను షూట్ చేసి పబ్లిక్‌గా అప్‌లోడ్ చేసినా, ఎవరికైనా చూపించినా అది నేరంగా పరిగణిస్తారు. లైసెన్స్ లేని సినిమాలను ప్రదర్శించడం కూడా ఇకపై కఠినంగా మారనుంది.