వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. ఆయన రాష్ట్రానికి చెందిన పలు అంశాలను హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లుగా మీడియాకు తెలిపారు. రఘురామ కృష్ణరాజుపై అనర్హతా వేటు వేయాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్న సమయంలో ఆయన వరుసగా బీజేపీ పెద్దలతో సమావేశం కావడం రాజకీయవర్గాల్లో చర్చకు కారణం అవుతోంది. తనపై రాజద్రోహం కేసు పెట్టి అరెస్ట్ చేసిన సీఐడీ పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారని ఇప్పటికే అన్ని రాజ్యాంగ వ్యవస్థలకూ ఫిర్యాదు చేశారు. కొద్ది రోజుల నుంచి ఆయన అమిత్ షాతో భేటీ కావాలని అనుకుంటున్నారు. అపాయింట్‌మెంట్ దొరకడంతో కలిశారు. రఘురామ అరెస్ట్ అయినప్పుడు ఆయన కుటుంబసభ్యులు అమిత్ షాతో సమావేశమయ్యారు.
రఘురామ కృష్ణరాజు వైసీపీ ప్రభుత్వాన్ని అదే పనిగా విమర్శిస్తూ ప్రెస్‌మీట్లు పెడుతున్నారు. ఇలా పెడుతున్నందున అంతు చూస్తామని మరో ఎంపీ గోరంట్ల మాధవ్ బెదిరించినట్లుగా రఘురామ లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. లోక్‌సభలో విపక్ష పార్టీలు.. పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నాయి. పెగసస్ పై విచారణకు పట్టుబడుతున్నాయి. వైసీపీ ఎంపీలు మాత్రం కొన్ని సందర్భాల్లో పార్టీ ధిక్కరించిన వారిపై అనర్హతా వేటు వేయాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు. దీనికి సంబంధించిన దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
తనపై అనర్హతా వేటు వేయించాలన్న వైసీపీ ఎంపీల ప్రయత్నాలను రఘురామ కృష్ణరాజు ఎప్పటికప్పుడు తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారు. వారు ఎవరికి ఫిర్యాదు చేస్తారో .. వెంటనే రఘురామ వారికి వివరణ పంపుతున్నారు. తనపై అనర్హతా వేటు ఎలా సాధ్యం కాదో వివరిస్తున్నారు. తానేమీ పార్టీని ధిక్కరించలేదని ఇతర పార్టీల్లో చేరలేదని.. ఆయన చెబుతున్నారు. చట్టం ప్రకారం తానేమీ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటం లేదంటున్నారు. అదే సమయంలో ప్రభుత్వంలో తప్పులు ఎత్తి చూపడం ప్రజాస్వామ్యమని వాదిస్తున్నారు. దీంతో అనర్హతా వేటు వేయించాలన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీల ప్రయత్నాలు పెద్దగా సఫలం కావడం లేదు.
మరో వైపు రఘురామ కృష్ణరాజు ఏపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా కేంద్ర ప్రభుత్వ శాఖలకు లేఖలు రాస్తూనే ఉన్నారు. తాజాగా ఏపీలో అమ్ముతున్న మద్యం శాంపిల్స్ సేకరించి ప్రజారోగ్య నిపుణులతో పరీక్షించాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ ఎల్.మాండవీయకు లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వంలోని వారికి చెందిన వ్యక్తుల డిస్టిలరీల నుంచి వస్తున్న మద్యం.. శ్రామికుల ఆరోగ్యానికి ముప్పుగా మారిందని ఆయన ఫిర్యాదు చేశారు. ఉపాధి హామీ నిధులు దారి మళ్లించారని కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి గిరిరాజ్‌కు మరో లేఖను రఘురామ రాశారు.