MP Avinash Reddy: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్ చేస్తున్న పాదయాత్ర ఎఫెక్ట్ తో రాష్ట్రంలో వర్షాలు కూడా కురవడం లేదని ఎంపీ అవినాష్ రెడ్డి విమర్శించారు. 1999 నుంచి 2004 మధ్య ఆంధ్రప్రదేశ్ కరువుకు కేరాఫ్ అడ్రస్ లా ఉండేదని.. ఆ తర్వాత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి రాగానే వర్షాలు బాగానే కురిశాయని గుర్తు చేశారు. అంతేకాకుండా సీఎం జగన్ అధికారంలోనూ బాగానే వానలు పడ్డాయని చెప్పుకొచ్చారు. నాలుగేళ్లుగా భారీగా కురుస్తున్న వర్షాలు.. లోకేష్ పాదయాత్ర, మరోవైపు చంద్రబాబు సాగునీటి ప్రాజెక్టుల సందర్శన కారణంగా భయపడి అటే పారిపోయాయని అన్నారు. రెండు బలమైన పాదాల పాదాల ఎఫెక్ట్ వల్లే వరుణుడు కరుణించడం లేదన్నారు.
"ముఖ్యంగా ఇక్కడి గ్రామాల్లో ఒకటే చర్చ ఉంది. ఏమంటే.. నాలుగేళ్లు నిజంగా అవసరానికి మించి వర్షం పడింది నాలుగేళ్లు. ఐదో ఏడాది ఎందుకు పడలేదనే ప్రశ్న అందరిలోనూ మొదలైంది. ఒకపక్క మాజీ ముఖ్యమంత్రి గారి కొడుకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ఉన్నారు. మామూలుగా రాజశేఖర్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు వర్షాలు బాగానే ఉన్నాయి. జగనన్న సీఎం అయ్యాకా బాగానే పడ్డాయి. ఈ ఐదో ఏడాది ఎందుకు పడలేదని చెప్పి గ్రామగ్రామాన ప్రశ్న వస్తోంది. దానికి సమాధానం కూడా వాళ్లే చెబుతున్నరు. రెండు బలమైన పాదాలు, రెండు బలమైన పాదాలు... మా ప్రాంతానికి ఈ మధ్య కాలంలో ఎక్కువగా వచ్చినయ్. ఒకరేమో పాదయాత్ర అని చెప్పి వచ్చినారు. ఇంగొకరేమో సాగునీటి ప్రాజెక్టులపైన యుద్ధం అని వచ్చినారు. చంద్రబాబు నాయుడు గారు, వాళ్ల కొడుకు ఆ పాదాల ప్రాజెక్టు వల్లనే లక్షల ఎకరాల్లో నష్టం వాటిల్లింది. గత 60 రోజులుగా చుక్క వర్షం కూడా కురవకపోవడం వెరసి రైతులు తీవ్రంగా నష్టపోవడం జరుగుతా ఉంది. ఈ నష్టాలకు సంబంధించిన రెండు అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నష్టపరిహారం అందిస్తాం." - ఎంపీ అవినాష్ రెడ్డి