Chevireddy : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను అనే వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా ఈ జాబితాలో చిత్తూరు జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా చేరారు. తన నియోజకవర్గంలో కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన ఆయన ఎన్నికల సమయంలో సీఎం జగన్ తన వెంట ఉండాలని కోరారని అందుకే తాను ఎన్నికల్లో పోటీ చేయడం లేదన్నారు. తన కుమారుడు చెవిరెడ్డి మోహిత్‌కు సీఎం జగన్ టిక్కెట్ ఇస్తారని ఆయనను ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. అంటే చెవిరెడ్డి పోటీ నుంచి వైదొలిగి తన కుమారుడికి అవకాశం ఇప్పించుకుంటున్నారని వైఎస్ఆర్‌సీపీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
నిజానికి వైసీపీలో చాలా మంది సీనియర్ నేతలు ఇప్పటికే తాము ఇక పోటీ చేయబోమని తమ వారసులకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచే సీఎం జగన్ కు ఇలాంటి విజ్ఞప్తులు చాలా వచ్చినట్లుగా తెలుస్తోంది. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కూడా తన కుమారుడు అభినయ్ రెడ్డికి ఈ సారి టిక్కెట్ కేటాయించాలని కోరుతున్నారు. మంత్రి ధర్మాన ప్రసాదరావు, మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ ఇద్దరూ తమ వారసుల కోసం ప్రయత్నిస్తున్నారు. అలాగే స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా మారుడికి సీట్ కావాలని లాబీయింగ్ ప్రారంభించారు.
మచిలీపట్నం నుంచి పేర్ని నాని కుమారుడు పోటీచేస్తారని ఇంతకు ముందే ప్రకటించారు. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న మోపిదేవి వెంకటరమణారావు తన తనయుణ్ని ఈసారి ఎన్నికల్లో రేపల్లె నుంచి బరిలోకి దింపాలనే యోచనలో ఉన్నారు. గంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే ముస్తఫా ఈసారి ఎన్నికల్లో తన కుమార్తె ఫాతిమాను ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించేసుకున్నారు. ఒంగోలులో ఈ సారి బాలినేనికి టిక్కెట్ లేదని ఆయనే చెప్పుకుంటున్నారు. ఓసారి తన కుమారుడు అంటారు..మరోసారి తన భార్య అంటారు..కానీ ఆయన మాత్రం కుమారుడు కోసం పట్టుబడుతున్నారు. మంత్రాలయం కాటసాని రాంభూపాల్‌రెడ్డి, ఎమ్మిగనూరు చెన్నకేశవరెడ్డి, శ్రీశైలం శిల్పా చక్రపాణిరెడ్డి వారు కూడా తాము పోటీ చేయబోమని.. తమ వారసులకు టిక్కెట్ కావాలని అడుగుతున్నారు.
రామచంద్రాపురంలో మంత్రి వేణుగోపాల కృష్ణ తన కొడుక్కి టిక్కెట్ ఇవ్వాలని అడుగుతున్నారు. రామచంద్రాపురం నుంచి మండపేటకు వెళ్లిన తోట త్రిమూార్తులు ఈ సారి తన కుమారుడు ఫృధ్వీరాజ్ కు టిక్కెట్ అడుగుతున్నారు. పిల్లి సుభాష్ కూడా తన కుమారుడు సూర్యప్రకాష్ కు టిక్కెట్ ఇవ్వాలంటున్నారు. విజయనగరంలో డిప్యూటీ స్పీకర్ కూడా వారసత్వాన్ని తెరపైకి తెచ్చారు. తాను ఇక పోటీ చేయనంటున్నారు. ఒకరు కాదు.. ఇద్దరు కాదు అందరూ వారసులకు టిక్కెట్లు అడుగుతూండటంతో సీఎం జగన్ ఒకరిద్దరికి కాదు అందరీ ఇవ్వట్లేదు అని చెప్పేస్తున్నారని వైసీపీ వర్గాలంటున్నాయి. కానీ కొంత మంది మాత్రం తమ వారసులకే టిక్కెట్లు ప్రకటించేసుకుంటున్నారు.