Mithun Reddy granted interim bail in AP liquor scam:  ఆంధ్రప్రదేశ్‌ లిక్కర్ స్కామ్ కేసులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) రాజంపేట ఎంపీ పీవీ మిథున్ రెడ్డికి  ఏసీబీ కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో ఆయన A-4 నిందితుడిగా ఉన్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు మధ్యంతర బెయిల్ కావాలని ఆయన ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన కోర్టు పదకొండో తేదీ వరకూ మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. తొమ్మిదో తేదీన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయనున్నారు. పదకొండో తేదీ సాయంత్రం5 గంటలకు మళ్లీ జైల్లో సరెండర్ కావాల్సి ఉంది. యాభై వేల ష్యూరిటీ, ఇద్దరు పూచికత్తులు సమర్పించాలని ఏసీబీ కోర్టు ఆదేశించింది. 

2019-2024 మధ్య YSRCP ప్రభుత్వ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్‌లో మిథున్ రెడ్డి కీలక పాత్ర పోషించినట్లు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) ఆరోపిస్తోంది. సిట్ రిమాండ్ రిపోర్టు ప్రకారం, ప్రధాన నిందితుడు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి (రాజ్ కసిరెడ్డి) నాయకత్వంలో నెలకు రూ.50-60 కోట్ల ముడుపులు వసూలు చేశారు.  ఈ సొమ్ము విజయసాయి రెడ్డి (A-5), పీ కృష్ణమోహన్ రెడ్డి (A-32), కె ధనుంజయ రెడ్డి (A-31), బాలాజీ గోవిందప్ప (A-33) మరియు మిథున్ రెడ్డి ద్వారా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి చేరినట్లు సిట్ ఆరోపణలు చేసింది. 

మిథున్ రెడ్డి జులై 19, 2025న విజయవాడలో సిట్ విచారణ కోసం హాజరైన తర్వాత అరెస్టయ్యారు. ఏసీబీ కోర్టు  రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపింది. సిట్ రిమాండ్ రిపోర్టులో మిథున్ రెడ్డిని "ప్రధాన కుట్రదారుడు"గా పేర్కొంది, ఆ యన ఎక్సైజ్ పాలసీలో మార్పులు, డిస్టిలరీల నుంచి లంచాల సేకరణలో కీలక పాత్ర పోషించినట్లు ఆరోపించింది.                   

మిథున్ రెడ్డి సెప్టెంబర్ 9, 2025న జరగనున్న ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు మధ్యంతర బెయిల్ కోసం ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన ఏసీబీ కోర్టు జడ్జి  సెప్టెంబర్ 11, 2025 సాయంత్రం 5 గంటల వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేశారు.  మిథున్ రెడ్డి తరపు న్యాయవాదులు, ఆయన ఎంపీగా రాజ్యాంగబద్ధ బాధ్యతను నిర్వర్తించేందుకు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయడం అవసరమని వాదించారు. ఈ వాదనను పరిగణనలోకి తీసుకున్న కోర్టు, తాత్కాలిక ఉపశమనం కల్పించింది.             

మిథున్ రెడ్డి గతంలో ముందస్తు బెయిల్ కోసం ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించగా, ఏప్రిల్ 3, 2025న హైకోర్టు ఆయన పిటిషన్‌ను తిరస్కరించింది. సిట్ సమర్పించిన సాక్ష్యాధారాలు బలంగా ఉన్నాయని, బెయిల్ మంజూరు చేయడం విచారణకు ఆటంకం కలిగిస్తుందని హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ తర్వాత, జులై 18, 2025న సుప్రీం కోర్టు కూడా మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది, విచారణ కీలక దశలో ఉందని పేర్కొంది. అన్ని ప్రయత్నాలు విఫలం కావడంతో ఆయన అరెస్టు కావాల్సి వచ్చింది.