Vijayawada and Tirupati will be Greater cities after the census: ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ అమరావతిలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో గ్రేటర్ విజయవాడ, గ్రేటర్ తిరుపతి ఏర్పాటుతో పాటు రాజధాని రైతులకు సంబంధించిన పలు కీలక అంశాలపై వివరణ ఇచ్చారు. రెండు ప్రధాన నగరాలైన విజయవాడ , తిరుపతిని గ్రేటర్ మున్సిపాలిటీలుగా మార్చాలన్న ప్రభుత్వ సంకల్పానికి తాత్కాలికంగా బ్రేక్ పడింది. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ శనివారం రాజధాని రైతులతో నిర్వహించిన సమావేశంలో ఈ విషయంపై స్పష్టతనిచ్చారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న జనగణన సాంకేతిక నిబంధనలే ఇందుకు కారణమని ఆయన వివరించారు. విజయవాడ, తిరుపతి నగరాలను గ్రేటర్ కార్పొరేషన్లుగా మార్చాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించినప్పటికీ, కేంద్ర ప్రభుత్వం జనాభా సర్వే ప్రక్రియను ప్రారంభించడంతో కొన్ని అడ్డంకులు ఎదురవుతున్నాయి. జనాభా సర్వే ముగిసే వరకు కొత్తగా డివిజన్ల పునర్విభజన చేయకూడదని కేంద్ర నిబంధనలు ఉన్నాయి. అందువల్ల, ఈ సర్వే ప్రక్రియ పూర్తికాగానే గ్రేటర్ విజయవాడ , గ్రేటర్ తిరుపతి ఏర్పాటు పనులు తిరిగి ప్రారంభిస్తామని మంత్రి ప్రకటించారు.
భూ సమీకరణలో భాగంగా భూములు ఇచ్చిన రైతులకు కేటాయించిన ప్లాట్ల విషయంలో ఎదురవుతున్న సమస్యలపై మంత్రి చర్చించారు. భూ సేకరణ భూముల్లో ప్లాట్లు పొందిన వారిలో సుమారు 42 మంది వాటిని మార్చుకోవడానికి సుముఖత వ్యక్తం చేయగా, ఇప్పటికే 16 మందికి లాటరీ ద్వారా కొత్త ప్లాట్లు కేటాయించారు. మిగిలిన రైతులు కూడా తమ ప్లాట్లు మార్చుకోవాలనుకుంటే ప్రభుత్వం వెంటనే సహకరిస్తుందని, ఎవరికీ అన్యాయం జరగనివ్వమని స్పష్టం చేశారు. తమ భూములను కూడా జరీబు భూములుగా గుర్తించాలని రైతుల నుంచి వస్తున్న విజ్ఞప్తులను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంది.
ఈ సమస్య పరిష్కారానికి జాయింట్ కలెక్టర్, గ్రౌండ్ వాటర్ డిపార్ట్‌మెంట్ అధికారులతో కలిపి ఐదుగురు సభ్యుల స్టేట్ లెవల్ కమిటీని ఏర్పాటు చేశారు. 2014 డిసెంబర్ 8 నాటి సాటిలైట్ చిత్రాల ఆధారంగా ఏ భూమి జరీబు, ఏది నాన్ జరీబు అనేది నిర్ధారిస్తారు. ఈ ప్రక్రియను 45 రోజుల్లోగా పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. రాజధానిలో ప్లాట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు. గతంలో రోజుకు 90 వరకు రిజిస్ట్రేషన్లు జరిగేవని, ప్రస్తుతం ఆ సంఖ్య 10 నుంచి 30కి తగ్గిందని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులు బ్యాంకు రుణాల కోసం ఇబ్బంది పడకుండా ఉండేలా 30 ఏళ్ల లింక్ డాక్యుమెంట్లతో సంబంధం లేకుండా రుణాలు ఇచ్చేలా బ్యాంకు అధికారులతో చర్చలు జరిపినట్లు వెల్లడించారు. రాజధాని గ్రామాల్లో కల్పించాల్సిన మౌలిక సదుపాయాల డిజైన్లు పూర్తయ్యాయని, వాటిని స్థానిక ఎమ్మెల్యేలకు అందజేసినట్లు మంత్రి తెలిపారు. ఎమ్మెల్యేలు ఆయా గ్రామాల్లో ప్రజలతో, పెద్దలతో చర్చించి, వారి సూచనలు , సలహాలను డిజైన్లలో చేర్చాలని సూచించారు. గన్నవరం విమానాశ్రయం భూములకు సంబంధించి వచ్చిన మూడు ప్రతిపాదనలపై భూ యజమానులతో మాట్లాడాలని కలెక్టర్‌ను ఆదేశించారు.