Nara Lokesh Sensational Tweet On Jagan: వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌పై (Jagan) మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.  అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన వైసీపీ కార్యాలయాలపై ఆయన ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని 26 జిల్లాల్లో చేసిన భూ కేటాయింపులపై మండిపడ్డారు. 'జగన్.. ఏంటీ ప్యాలెస్‌ల పిచ్చి. ఈ రాష్ట్రం నీ తాత రాజారెడ్డి జాగీరా.?. కేవలం వైసీపీ కార్యాలయాల కోసం 26 జిల్లాల్లో భూ కేటాయింపులు చేశారు. రూ.1000 నామమాత్రపు లీజుతో 42 ఎకరాలకు పైగా కేటాయించారు. ప్రజల నుంచి దోచుకున్న రూ.500 కోట్లతో ప్యాలెస్‌లు కడుతున్నావు. నీ ఒక్కడి భూ దాహానికి కబ్జా అయిన 42 ఎకరాల్లో.. 4,200 మంది పేదలకు సెంటు స్థలాలు ఇవ్వొచ్చు. నీ విలాసాల ప్యాలెస్‌ల నిర్మాణానికి అయ్యే రూ.500 కోట్లతో 25 వేల మంది పేదలకు ఇళ్లు కట్టి ఇవ్వొచ్చు. నీ దన దాహానికి అంతు లేదా.?' అని లోకేశ్ మండిపడ్డారు. అటు, ఇవి ప్రభుత్వ భవనాలు కాదని.. ఊరూరా జగన్ రెడ్డి ప్యాలెస్‌లు అని టీడీపీ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది.










వైసీపీ కార్యాలయాలకు నోటీసులు


అటు, రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లా కేంద్రాల్లో నిర్మిస్తోన్న వైసీపీ కార్యాలయాలకు అధికారులు నోటీసులు ఇచ్చారు. అనుమతులు లేకుండా.. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేస్తున్నారని వారం రోజుల్లో సమాధానం ఇవ్వాలని పేర్కొన్నారు. విశాఖ, అనకాపల్లి, రాజమండ్రి, నెల్లూరు, అనంతపురంలో కార్యాలయ నిర్మాణాలను ఆపేయాలని ఆదేశించారు. కాగా, ఈ నోటీసులపై వైసీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది ప్రభుత్వ కక్ష పూరిత చర్య అంటూ ఆరోపిస్తున్నారు.


తాడేపల్లిలో వైసీపీ కార్యాలయం కూల్చివేత


అటు, అమరావతిలోని తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కార్యాలయాన్ని శనివారం ఉదయం సీఆర్డీఏ అధికారులు కూల్చేశారు. సీతానగరం వద్ద ఉన్న భవనాన్ని భారీ పోలీస్ భద్రత మధ్య.. పొక్లెయినర్, బుల్డోజర్లతో కూల్చారు. అయితే, నీటి పారుదల శాఖ స్థలంలో భవనం నిర్మించారని.. అందుకే చర్యలు చేపట్టామని అధికారులు వివరించారు. న్యాయస్థానం ఆదేశాల మేరకే కూల్చివేత ప్రక్రియ చేపట్టామని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అక్రమ నిర్మాణాలు కూల్చేయకుంటే కోర్టు నిబంధనలు ఉల్లంఘించినట్లు అవుతుందనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాయి. జల వనరుల శాఖ భూమిని వైసీపీ కార్యాలయ నిర్మాణానికి ఇవ్వడం కుదరదంటూ ఈఎన్‌సీ నారాయణరెడ్డి ఇచ్చిన లేఖను ప్రభుత్వ వర్గాలు విడుదల చేశాయి.


Also Read: YSRCP Politics : అసెంబ్లీకి హాజరు కాకపోతే అనర్హతకు చాన్స్ - టీడీపీకి జగన్ అలాంటి అవకాశం ఇస్తారా ?