Minister Nara Lokesh Comments On Green Energy Policy: ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతున్న కర్బన ఉద్గారాలను తగ్గించి, వాతావరణంలో ఉష్ణోగ్రతలను అదుపు చేయడానికి క్లీన్ ఎనర్జీ ఒక్కటే ఏకైక పరిష్కారమని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) పేర్కొన్నారు. దావోస్ బెల్వెడేర్‌లో వరల్డ్ ఎకనమిక్ ఫోరం (World Economic Forum) వేదికగా 'పర్యావరణ పరిరక్షణ - వాతావరణ ఉద్యమ భవిష్యత్' అనే అంశంపై స్వనీతి ఆధ్వర్యాన నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. '2023 ఇప్పటివరకు అత్యంత వేడి సంవత్సరంగా నమోదైంది. అ ఏడాది పూర్వ పారిశ్రామిక సగటు కంటే 1.45°C అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గ్రీన్ హౌస్ వాయు సాంద్రతలు 2022లో గరిష్ట స్థాయికి చేరాయి. ఆ తర్వాత కూడా అది కొనసాగుతూనే ఉంది.
గత 65 ఏళ్లల్లో ఎన్నడూ లేని విధంగా సముద్రపు వేడి గరిష్ట స్థాయికి చేరింది. 2050 నాటికి క్లీన్ హైడ్రోజన్ డిమాండ్ 125 - 585 ఎంటీపీఏ నడుమ ఉంటుంది. అప్పటికి పవర్ మార్కెట్‌లో 50 నుంచి 65 శాతంతో గ్రీన్ హైడ్రోజన్ పై చేయి సాధిస్తుంది. 2024లో గ్లోబల్ గ్రీన్ హైడ్రోజన్ పరిమాణం $6.49 బిలియన్లను అధిగమించింది. 2032 నాటికి ఇది సగటున 31శాతం పెరిగే అవకాశం ఉంది.' అని పేర్కొన్నారు.
అతిపెద్ద రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్టు
డీకార్బనైజ్డ్ ఎకానమీకి బెంచ్‌మార్క్‌ని సెట్ చేస్తూ సస్టెయినబుల్ ఎనర్జీలో ప్రపంచ అగ్రగామిగా అవతరించడానికి ఏపీ ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోందని మంత్రి లోకేశ్ తెలిపారు. పునరుత్పాదక ఇంధన రంగంలో గణనీయమైన ప్రగతిని సాధిస్తోందన్నారు. 'కర్నూలు జిల్లాలోని 1 గిగావాట్ అల్ట్రా మెగా సోలార్ పార్కు వంటి ప్రముఖ ప్రాజెక్టులతో పాటు కేంద్ర ప్రభుత్వం ఇటీవల 4 గిగా వాట్ల సామర్థ్యం గల 4 సోలార్ పార్కులను ఏపీలో ప్రకటించింది. సాంప్రదాయేతర ఇంధన వనరుల రంగంలో భారీగా పెట్టుబడులను ఆకర్షించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బలమైన ఫ్రేమ్‌వర్క్ ద్వారా ప్రయత్నాలు చేస్తోంది. హరిత ఆర్థిక వ్యవస్థతో పాటు సమగ్రమైన, స్వచ్ఛమైన ఇంధన పర్యావరణ వ్యవస్థను స్థాపించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా సీఎం చంద్రబాబు ఇటీవల 'ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ - 2024'ను ప్రకటించారు.
160 GW పైగా పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని జోడించడం ఈ పాలసీ ప్రధాన లక్ష్యం. రెన్యువబుల్ ఎనర్జీ రంగంలో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు, 7.5 లక్షల మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు సాధించాలన్నది మా లక్ష్యం. రాష్ట్రంలో 34 GW సామర్థ్యంతో పంప్డ్ స్టోరేజ్ పవర్ (PSP) ప్రాజెక్ట్‌ల కోసం 29 స్థానాలను గుర్తించాం. సోలార్, విండ్, సోలార్-విండ్ హైబ్రిడ్ ప్రాజెక్ట్‌ల కోసం 80 వేల ఎకరాల భూమిని ప్రభుత్వం సర్వే చేసింది. జల విద్యుత్ రంగంలో శ్రీశైలం, నాగార్జున సాగర్ డ్యామ్‌ల ప్రాజెక్టులు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ 5230 మెగా వాట్ల సామర్థ్యంతో ప్రపంచంలోనే అతి పెద్ద ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ స్టోరేజ్ ప్రాజెక్ట్ (IRESP)కి కలిగి ఉంది. త్వరలో ఇది ప్రారంభానికి సిద్ధంగా ఉంది. ఒక్కొక్కటి 30 మెగా వాట్ల సామర్థ్యంతో విశాఖపట్నం, కృష్ణపట్నంలో రెండు గ్రీన్ హైడ్రోజన్ హబ్‌లను ప్రతిపాదించాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంధన సామర్థ్య సూచిక (State Energy Efficiency Index SEEI)-2023 దేశంలో 2వ స్థానంలో నిలిచి అత్యుత్తమ పనితీరును కనబరిచింది. 2030 నాటికి 18 గిగా వాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుని ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నాం. చంద్రబాబు సమర్థ నాయకత్వంలో పునురుత్పాదక శక్తిలో ఏపీని అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తున్నాం.' అని లోకేష్ పేర్కొన్నారు.