Free Power for AP Ganesh Mandapams: వినాయక చవితి పండుగను పురస్కరించుకొని రాష్ట్రవ్యాప్తంగా గణేష్ ఉత్సవ మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. వినాయక చవితి ఉత్సవ విగ్రహాలు ఏర్పాటు చేసే ప్రాంతాల్లో పందిళ్ళకు ఉచితంగా విద్యుత్ సౌకర్యం కల్పించాలని పలువురు నిర్వాహకులు మంత్రి నారా లోకేష్ ను కోరారు. దీనిపై స్పందించిన లోకేష్... ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తో మాట్లాడారు.
రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 15వేల గణేష్ విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారు. గణేష్ ఉత్సవ పందిళ్ళకు ఉచిత విద్యుత్ అందించడానికి రూ.25 కోట్లు ప్రభుత్వం భరించాల్సి ఉంది. రాష్ట్రంలోని కోట్లాది గణేష్ భక్తుల సౌలభ్యం దృష్ట్యా ఉచిత విద్యుత్ అందించేలా చూడాలని మంత్రి లోకేష్ చేసిన వినతిపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. ఈ మేరకు ప్రత్యేకంగా జీ.ఓ విడుదలకు ఆదేశాలు జారీచేశారు. అలాగే రాబోయే విజయదశమి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసి దుర్గా దేవి మండపాలకి కూడా ఉచిత విద్యుత్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి అయ్యే ఖర్చు అంతా ప్రభుత్వం భరిస్తుంది.
ఈ నిర్ణయంపై బీజేపీ సంతృప్తి వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపింది.
ఏపీలో గణేష్ మండపాలు ఏర్పాటు చేసే నిర్వాహకులు సింగిల్ విండో విధానం ద్వారా ఆన్‌లైన్‌లోనే అనుమతులు ఇస్తున్నారు. ఈ విధానం ద్వారా అనుమతులు పొందడం సులభతరం చేశారు. గణేష్ మండపాల వద్ద తప్పనిసరిగా ఫైర్ సేఫ్టీ నియమాలను పాటించాల్సి ఉంటుంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని మండపాలను ఏర్పాట్లు చేసుకోవాలి. మండపాల ఏర్పాటుతో ట్రాఫిక్‌కు ఎటువంటి ఆటంకం కలగకుండా చూడాలి. వాహనాలు పార్క్ చేసుకోవడానికి ప్రత్యేక స్థలాలను కేటాయించాల్సి ఉంటుంది. రాష్ట్రంలో వినాయక చవితి సందడి మొదలైనందున, అనుమతుల కోసం పోలీసు వెబ్‌సైట్‌ను ఉపయోగించుకోవాలని సూచించారు. వినాయక చవితి పండుగను దృష్టిలో పెట్టుకుని పోలీసులు మార్గదర్శకాలు జారీ చేస్తారు. వాటిని పాటించడం ముఖ్యం. నిర్వాహకులు వర్షాలను కూడా దృష్టిలో ఉంచుకొని తగిన ఏర్పాట్లు చేసుకోవాలని పోలీసులు సూచించారు.