Andhra News :  రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ ను ప్రతిపక్ష నేత చంద్రబాబు దెబ్బతీస్తున్నారని మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు.  అనకాపల్లిలో జరిగిన బహిరంగ సభలో అమరావతి రాజధానిగా ఉండాలని జనంతో  చంద్రబాబు చెప్పించే ప్రయత్నం చేశారని మండిపడ్డారు.  దీన్ని బట్టి చూస్తే చంద్రబాబు నాయుడుకి విశాఖపట్నంపై ఎంత ద్వేషం ఉందో అర్థమవుతుందని ఆయన అన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమరావతిపై ఎప్పుడూ పక్కన పెట్టలేదని, దానిని కూడా అభివృద్ధి చేస్తామని చెబుతున్నారని స్పష్టం చేశారు.  ప్రజలు త్యాగాలు చేస్తే.. యోగాలు, భోగాలు అనుభవించే చంద్రబాబు నాయుడు రాష్ట్ర సర్వతో ముఖాభివృద్ధిని ఎప్పుడూ కోరుకోలేదని గడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు .


రాష్ట్రంలో అమలు జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాల మీద చంద్రబాబు విమర్శలు చేయడం విడ్డూరంగా ఉన్నాయని.. పేదలకు 2 లక్షల పదివేల కోట్ల రూపాయల సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని, ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలను అన్ని విధాలుగా ఆదుకుంటున్నామని తెలిపారు.  రాష్ట్రమంతా తిరుగుతూ మీటింగులు పెడుతున్న చంద్రబాబు నాయుడు 2024లో ఏం చేస్తాడో చెప్పకుండా పోతున్నాడని, ఆయనకు మేనిఫెస్టో మీద నమ్మకం లేదని మరోసారి నిరూపించుకున్నాడన్నారు. చంద్రబాబు తనకు ముందు చూపు ఉందని నిన్న సభలో చెప్తుంటే విన్నాను. కానీ అది తప్పు. ఆయనకున్నది వెనక చూపు మాత్రమే. ఆ చూపుతోనే ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచాడు అని మంత్రి అమర్నాథ్ అన్నారు. 


2014-19 మధ్య రాష్ట్రంలో ఏ ఒక్క పేదవాడికైనా ఒక సెంటు భూమైన పంచి పెట్టావా? అని అమర్నాథ్ ప్రశ్నించారు. రాష్ట్రంలో  లక్షల మందికి భూమి పంపిణీ చేయడమే కాకుండా అక్కడ ఇంటి నిర్మాణానికి అవసరమైన ఖర్చు కూడా ప్రభుత్వమే భరిస్తోందన్నారు.  ఇళ్ల స్థలాలను సమాధులుగా వర్ణిస్తున్న చంద్రబాబు నాయుడుకి వచ్చే ఎన్నికల్లో లబ్ధిదారులే తగిన సమాధానం చెప్తారని అమర్నాథ్ అన్నారు. జీవీఎంసీ పరిధిలో 1,50,000 మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి తమ ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తే, చంద్రబాబు నాయుడు కోర్టుకు వెళ్లి ఆ కార్యక్రమానికి అడ్డు తగిలాడని.. ఇది పేదలపై ఆయనకున్న అభిమానానికి నిదర్శమని అమర్నాథ్ అన్నారు.


"విస్సన్నపేట గ్రామంలో 609 ఎకరాల భూమిని కబ్జా చేశానని చంద్రబాబు నాయుడు నాపై విమర్శ చేశారు. అంతేకాకుండా ఆ కబ్జాని నిరూపిస్తారని కూడా సవాలు విసిరారు. ఆ సవాలు స్వీకరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను.అందులో అర సెంట్ భూమి నైనా నేను కానీ.. నా కుటుంబ సభ్యులు కానీ ఆక్రమించినట్లు నిరూపిస్తే నేను రాజకీయాల నుంచి వైదొలుగుతాను. నిరూపించకపోతే లోకేష్ ను రాజకీయాల నుంచి తప్పిస్తావా?" అని మంత్రి అమర్నాథ్ చంద్రబాబుకు ప్రతి సవాల్ విసిరారు. తప్పు చేయాల్సి వస్తే.. తన పీక తీసి పక్కన పెట్టుకుంటానే తప్ప, నీలాంటి అవినీతిపరుడుతో మాటలు అనిపించుకోనని చంద్రబాబుకు అమర్నాథ్ స్పష్టం చేశారు. మైకు పట్టుకోడానికి ఓపిక లేని చంద్రబాబుకు ఇంకా రాజకీయాలు ఎందుకు? అని ఆయన ప్రశ్నించారు. 


రాష్ట్రంలో తన ప్రభ తగ్గుతోందని గమనించిన చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ ను మళ్ళీ తెరమీదకు తీసుకు వస్తున్నారని అన్నారు. ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచిన దెయ్యాలన్నీ అతనికి శతజయంతి ఉత్సవాలు నిర్వహించటం బాధాకరంగా ఉందని అన్నారు. ఎన్డీఏ కన్వీనర్ గా కేంద్రంలో చక్రం తిప్పానని చెప్పుకుంటున్న చంద్రబాబు ఆ సమయంలో ఎన్టీఆర్ కి ఎందుకు భారతరత్న ఇప్పించలేకపోయారని ఆయన ప్రశ్నించారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కనీసం ఒక్క జిల్లాకైనా ఎన్టీఆర్ పేరు పెట్టారా అని ప్రశ్నించారు.