ఆంధ్రప్రదేశ్ మంత్రులు రాజధాని అంశంఫై భిన్నమైన ప్రకటనలు చేస్తూ గందరోగళం సృష్టిస్తున్నారు. ఇప్పటి వరకూ రాజధాని అంశంపై ఎక్కువగా మున్సిపల్ శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ఉంటారు. ఇటీవల రైతులతో మాటల్లేవ్.. మాట్లాడుకోవడాల్లేవ్ అని ప్రకటించి కలకలం రేపారు. అమరావతి మొత్తం 20 గ్రామాలదేనని... అక్కడంతా ఓ వర్గమే ఉంటుందని.. ఓ వర్గం ప్రయోజనాల కోసం రాజధాని ఉండాలా అని ప్రశ్నిస్తున్నారు. ఆయన వ్యాఖ్యలపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేసినా పట్టించుకోవడం లేదు. తాజాగా మరో మంత్రి మేకపాటి గౌతం రెడ్డి కూడా భిన్నమైన వాదన వినిపిస్తున్నారు. అసలు రాజ్యాంగంలో రాజధాని అనే పదం ఎక్కడ ఉందని ఆయన ప్రశ్నిస్తున్నారు.
తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అక్కడే రాజధాని అని స్పష్టం చేశారు. అది పులివెందుల అయినా కావొచ్చు .. విజయవాడ కావొచ్చు.. మరో ప్రాంతం కావొచ్చన్నారు. సీఎం ఎక్కడ ఉంటే అక్కడే సెక్రటేరియట్ ఉంటుందని.. అదే రాజధాని అని తేల్చేశారు. శ్రీభాగ్ ఒప్పందం ప్రకారం సీఎం జగన్ మూడు రాజధానులు ఏర్పాటు చేశారని స్పష్టం చేశారు. నిజానికి మంత్రి మేకపాటి నోటి నుంచి వచ్చిన వ్యాఖ్యలు అసెంబ్లీలో సీఎం జగన్ చెప్పిన మాటలే. గతంలో మూడు రాజధానుల బిల్లులు అసెంబ్లీలో ప్రవేశ పెట్టినప్పుడు మాట్లాడిన సందర్భంలో అసలు రాజ్యాంగంలో రాజధాని అనే ప్రస్తావన లేదన్నారు. సీఎం ఎక్కడ ఉంటే అదే రాజధాని అని తేల్చేశారు.
అయితే అలాంటి దానికి మరి బిల్లులుఎందుకు ప్రవేశ పెట్టారని మూడు రాజధానులు అని ఎందుకు చెబుతున్నారని విపక్షాలు విమర్శించాయి అది వేరే విషయం. ఇటీవలి కాలంలోపలువరుు మంత్రులు కూడా ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అదే రాజధాని అనే వ్యాఖ్యలు చేశారు. మూడు రాజధానుల బిల్లులు న్యాయవివాదాల్లో చిక్కుకోవడంతో కార్యాలయాల తరలింపు సాధ్యం కావడం లేదు. దీంతో సీఎం క్యాంప్ ఆఫీస్‌ను మాత్రం విశాఖకు తరలిస్తారన్న ప్రచారం జరుగుతోంది. అందుకే పలువురు మంత్రులు ఇటీవలి కాలంలో సీఎం ఎక్కడ ఉంటే అదే రాజధాని అన్న వాదన వినిపిస్తున్నారన్న అభిప్రాయం ఉంది. సీఎం ఎక్కడ ఉండాలన్న అంశాన్ని కోర్టులు కూడా నిర్దేశించలేవు.
అయితే కార్యాలయాలను మాత్రం తరలించడానికి సాధ్య పడదు. మరి సీఎం విశాఖ వెళ్లిపోయి.. కార్యాలయాలు అమరావతిలో ఉంటే పాలన ఇబ్బందుల్లో పడుతుంది. అయితే నిజంగా సీఎం జగన్‌కు అమరావతి అంశంలో న్యాయపరమైన సమస్యలు పరిష్కారం కాకుండా విశాఖకు వెళ్లాలని ఉందా లేదా అన్నదానిపై స్పష్టత లేదు . కానీ రాజధాని అంశంపై మాట్లాడాల్సి వచ్చినప్పుడల్లా మంత్రులు మాత్రం వివాదాస్పద రీతిలో స్పందిస్తూనే ఉన్నారు.