Mega PTM : రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్‌లు  పార్వతీపురం మన్యం జిల్లా భామిని ఆదర్శ పాఠశాలలో  మెగా పేరెంట్స్-టీచర్స్ మీటింగ్ లో పాల్గొన్నారు.  విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో ముఖాముఖి జరిపారు.  ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా స్థాయిని మెరుగుపరచే రెండు కీలక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. 'గ్యారంటీడ్ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ (ఎఫ్‌ఎల్‌ఎన్)' , 'క్లిక్కర్' విధానాలను ప్రారంభించారు. 

Continues below advertisement

 విద్యార్థుల ప్రదర్శనలు, నైతిక విలువలపై పద్యాలు, పరిసరాల పరిశుభ్రత, స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర, నెలసరి జాగ్రత్తలు, బాల్య వివాహాల నిర్మూలన, బాలికల ఆత్మరక్షణ వంటి అంశాలపై అవగాహనా కార్యక్రమాల్లో విద్యార్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు.   సీఎం చంద్రబాబు ప్రసంగంలో విద్యార్థుల ప్రదర్శనలు, ఆవిష్కరణలు, నైపుణ్యాలను ఆనందంగా అభినందించారు.  ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా స్థాయిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్తున్నామని ..ఎఫ్‌ఎల్‌ఎన్ ద్వారా ప్రతి విద్యార్థి అక్షరాస్యత, గణిత సామర్థ్యాలు సమకూర్చుకోవాలని పిలుపునిచ్చారు.  క్లిక్కర్ విధానం ద్వారా అభ్యసన స్థాయిని రోజూ అంచనా వేస్తూ మెరుగుపరుస్తామన్నారు.  తరగతి గదిలో 'క్లిక్కర్' విధానం ప్రదర్శన చూసి, విద్యార్థుల అభ్యసన స్థాయిని పరిశీలించారు.   

గ్యారంటీడ్ ఎఫ్‌ఎల్‌ఎన్ యాప్‌లో విద్యార్థుల ప్రోగ్రెస్ రిపోర్టులు చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. పాఠశాలలోని స్పోర్ట్స్ రూమ్, స్కిల్ అండ్ లెర్నింగ్ సెంటర్, స్టెమ్ ల్యాబ్‌లను సందర్శించి విద్యార్థుల ప్రాజెక్టులు, ఆవిష్కరణలు ప్రశంసించారు. 9వ తరగతి విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి, పాఠశాల పనితీరు, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం నాణ్యత గురించి తెలుసుకున్నారు. చివరిగా, విద్యార్థులు, తల్లిదండ్రులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు.  

విద్యా మంత్రి నారా లోకేష్ ప్రసంగంలో గ్యారంటీడ్ ఎఫ్‌ఎల్‌ఎన్ యాప్ పనితీరును సీఎంకు వివరించారు.  ఈ యాప్ ద్వారా విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు, ప్రోగ్రెస్‌ను ట్రాక్ చేస్తాం. క్లిక్కర్ విధానానికి 2,300 వీడియోలు సిద్ధం చేశాం. ఇది ప్రతి పాఠశాలలో అమలు చేస్తూ విద్యార్థుల సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాం  అని తెలిపారు. విద్యార్థులతో ముచ్చటించి, వారి సమస్యలు వింటూ పరిష్కారాలు సూచించారు. పాఠశాలలోని ల్యాబ్‌లు, రూమ్‌లను సందర్శించి విద్యార్థుల ఆవిష్కరణలు ప్రశంసించారు. 

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్  చిలకలూరిపేట శారద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సైన్స్ , ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఎగ్జిబిషన్ తోపాటు పాఠశాలలోని తరగతి గదులను, లైబ్రరీని పరిశీలించారు. పిల్లలు ఎక్కువ సమయం ఉపాధ్యాయుల దగ్గరే ఉంటారు కాబట్టి వారు దైవసమానులు అవుతారని విద్యార్థులకు చెప్పారు. తల్లిదండ్రుల తరువాత విద్యార్థుల జీవితాల్లో ఉపాధ్యాయులకు అంత గొప్ప స్థానం ఉంటుంది. అందుకు ఈ పేరెంట్ - టీచర్స్ మీటింగ్ అద్భుతంగా దోహదపడుతుందన్నారు.