AP women commission: సోషల్ మీడియా పోస్ట్ లపై మహిళా కమిషన్ నిర్వహించిన సమావేశం ఉద్రిక్తతలకు దారితీసింది. కమిషన్ అధికారికంగా నిర్వహించిన సమావేశం వద్దకు తెలుగు దేశం, జనసేన నేతలు హజరు కావటంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు.


సోషల్ మీడియా పోస్ట్ లపై రచ్చ...
సోషల్ మీడియాలో మహిళలపై అభ్యంతరకర పోస్టులు వ్యవహరం పై ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ఆద్వర్యాన విజయవాడలో ప్రత్యేక సదస్సు నిర్వహించారు. అయితే ఈ సదస్సుకు తెలుగు దేశం, జనసేనకు చెందిన మహిళా నాయకుల కూడ హజరయ్యారు. తమకు ఆహ్వనం ఉన్నందునే సదస్సుకు హజరు అయ్యాయని, తెలుగు దేశం , జనసేన నేతలు చెబుతుండగా, కమీషన్ కు చెందిన అదికారులు మాత్రం నో ఎంట్రీ చెప్పారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. తెలుగు మహిళలు, జనసేన వీర మహిళలను పోలీసులు అడ్డుకొని పక్కకు పంపేశారు. దీంతో కొద్ది సేపు ఉద్రిక్తత పరిస్దితి ఏర్పడింది. రాష్ట్రంలో సోషల్ మీడియా ను అడ్డుకొని, అసభ్య పరంగా పోస్ట్ లు పెడుతున్నారని తెలుగు మహిళలు మండిపడ్డారు. మరోవైపు ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ జోక్యం చేసుకొని మహిళలను సమావేశంలోకి పిలిపించారు. తెలుగు మహిళలు, జనసేన వీరమహిళల నుండి వినతి పత్రం స్వీకరించారు.


ప్రతి శుక్రవారం మహిళల ఆత్మగౌరవ దినం... 
 ప్రతి శుక్రవారం మహిళా ఆత్మగౌరవ దినంగా పాటిస్తూ అవగాహన సదస్సులు నిర్వహించాలని నిర్ణయించినట్లు  ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ తెలిపారు.  ప్రస్తుతం రాష్ట్రంలో సోషల్ మీడియాలో రాతియుగం కంటే ఘోరమైన పరిస్థితులు నెలకొన్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలే మహిళల పై అసభ్యకర పోస్టులు పెడుతున్నారని, రాజకీయ కారణాలతో  కొందరు ప్రోత్సహించటం  దారుణమన్నారు. మార్ఫింగ్ ఫోటోలు పెట్టి మహిళలను కించపరుస్తున్న వారి భరతం పట్టాలని, ఇలాంటి చర్యలను ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం  ఉందన్నారు.  సోషల్ మీడియాలో కొందరు ముసుగు వేసుకుని ఇష్టారీతిన  మహిళల పై  అసభ్యకరంగా పోస్ట్ లు పెట్టడం దారుణమని వ్యాఖ్యానించారు.  మహిళల పై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా, అసభ్యకరంగా ప్రవర్తించినా దిశ, సైబర్ మిత్ర తదితర యాప్ ల ద్వారా పోలీస్  సహాయం పొందాలని సూచించారు. ఇలాంటి సంఘటనల పై కలిసికట్టుగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైందన్నాని ఛైర్ పర్సన్ పిలుపునిచ్చారు.  


రిజర్వేషన్లను అడ్డుకుంటున్నారు..
రాష్ట్ర ప్రభుత్వం రాజకీయాల్లో 50 శాతం మహిళలకు రిజర్వేషన్ కల్పించి అన్ని అవకాశాలు కల్పిస్తుంటే, కొందరు దుర్భుద్దితో మహిళలను కించపరుస్తూ పోస్టులు పెట్టడం బాధగా ఉందని ఛైర్ పర్స్ వాసిరెడ్డి పద్మ ఆవేదన వెలిబుచ్చారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కావాలనే రాజకీయ ఉద్దేశంతో అడ్డుకోవటం పై ఆమె అసహనం వ్యక్తం చేశారు. రిజర్వేషన్ ల ద్వార మహిళల స్వావలంభన సాధ్యం అవుతుందని, అన్నారు. దశాబ్దాలుగా మహిళల పై జరుగుతున్న దాడులను ఎదుర్కొనేందుకు ఇంటా, బయటా మహిళలు మనోధైర్యం కల్పించేందుకు కమీషన్ బాద్యతగా వ్యవహరిస్తుందని అన్నారు.


నేనే ఇబ్బంది పడ్డా...
రాజకీయాల్లో ఉన్న మహిళల గురించి సోషల్ మీడియాలో వస్తున్న కథనాల పై   మహిళా కమిషన్  కఠిన చర్యలు తీసుకోవాలని సమావేశంలో పాల్గొన్న విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి కోరారు.  ఇటీవల  తాను కూడా  సోషల్ మీడియా వేధింపులకు గురయ్యానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.  అసత్య కథనాలు , అసభ్యకరమైన పోస్టులు పెట్టటం వలన మహిళల మనోభావాలు దెబ్బతింటున్నాయన్నారు. సోషల్ మీడియా వేధింపులపై  జిల్లా కలెక్టర్ ను కలిసి  ఫిర్యాదు చేశామని మేయర్ తెలిపారు.