Andhra Pradesh Congress: ఇటీవల ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్‌లో వైఎస్సార్‌టీపీని వైఎస్ షర్మిల (YS Sharmila) విలీనం చేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో షర్మిల కాంగ్రెస్‌లో చేరారు. షర్మిలకు వారిద్దరు పార్టీ కండువా కప్పి సాదరంగా కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. షర్మిలను ఏపీలో సీఎం జగన్‌కు వ్యతిరేకంగా హస్తం పార్టీ త్వరలోనే రంగంలోకి దించనుందని, ఆమెకు ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు అప్పగించే అవకాశముందనే ప్రచారం జరుగుతోంది. ఏపీసీసీ పగ్గాలు ఇవ్వనట్లయితే ఏఐసీసీ సెక్రటరీ పదవి ఇస్తారని వార్తలొస్తున్నాయి. సంక్రాంతి పండుగ తర్వాత షర్మిలకు కేటాయించే బాధ్యతలపై ఏఐసీసీ క్లారిటీ ఇవ్వనుంది. తనకు ఎలాంటి పదవి ఇచ్చినా పార్టీ కోసం కష్టపడి పనిచేస్తానని షర్మిల చెబుతున్నారు. దీంతో ఆమెకు ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.


షర్మిల ఏపీ కాంగ్రెస్‌లోకి అడుగుపెడితే ఇతర పార్టీల్లో అసంతృప్తితో ఉన్న నేతలు చాలామంది హస్తం గూటికి చేరేందుకు సిద్దమవుతున్నారు. ఇప్పటికే పలువురు నేతలు కాంగ్రెస్‌లో చేరేందుకు రెడీగా ఉన్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నెలలో ఏపీ కాంగ్రెస్‌లోకి మరిన్ని చేరికలు ఉంటాయని, చాలామంది జాయిన్ అయ్యేందుకు చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. రాహుల్ గాంధీ ప్రధాని కావడం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కల అని, కాంగ్రెస్ ఎంత బాగా చూసుకుంటుందో షర్మిలకు తెలుసని వ్యాఖ్యానించారు. షర్మిల కాంగ్రెస్‌లో చేరడం 2024లో తమ పార్టీకి ఏపీలో మంచి టర్న్‌గా మారుతుందన్నారు. ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్‌గా నియమించిన తర్వాత తొలిసారి ఇవాళ ఏపీకి మాణిక్యం ఠాగూర్ వచ్చారు. గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో హస్తం శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. భారీ ర్యాలీగా మాణిక్యం ఠాకూర్ విజయవాడలోని కాంగ్రెస్ కార్యాలయానికి చేరుకున్నారు.


ఏపీ కాంగ్రెస్ కీలక నేతలతో మాణిక్యం ఠాగూర్ భేటీ అయ్యారు. పార్టీ అంతర్గత సమస్యలు, ఎన్నికల సన్నద్దతపై చర్చించారు. మూడు రోజుల పాటు ఏపీలో ఆయన పర్యటించనున్నారు. డీసీసీ అధ్యక్షులు, ఆఫీస్ బేరర్స్‌తో సమావేశం కానున్నారు.షర్మిలకు కీలక బాధ్యతలు అప్పగిస్తామని తనతో ఖర్గే అన్నారని, త్వరలోనే ప్రకటన ఉంటుందని చెప్పారు. ఏపీలో పార్టీని బలపరుస్తామని, ఖచ్చితంగా సిక్సర్ కొడుతామని తెలిపారు. వైసీపీ నుంచి కాంగ్రెస్‌లోకి భారీ చేరికలు ఉంటాయని అన్నారు. మోదీ ప్రధానిగా ఉండగా ఏపీకి ప్రత్యేక హోదా రాదని, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని తెలిపారు. ఏపీ ఎంపీలు బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి రావాల్సిన ప్రాజెక్టులన్నీ వస్తాయని అన్నారు.


 ఇవాళ మాణిక్యం ఠాగూర్ ఆధ్వర్యంలో పలువురు మాజీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరారు. డేవిడ్ రాజు, డీవై దాస్, నిర్మాత కళ్యాణ్ చక్రవర్తి హస్తం పార్టీలో చేరారు. వారికి మాణిక్యం ఠాగూర్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. అటు ఇప్పటికే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డితో పాటు విజయవాడ సిటీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కాంగ్రెస్‌లో చేరేందుకు రెడీగా ఉన్నారు.