Pawan Kalyan : జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్  విశాఖ చెందిన పార్టీ నేతలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఇటీవల విశాఖ ఎయిర్ పోర్టు వద్ద జరిగిన ఘటనకు సంబంధించి జైలుకెళ్లి బెయిల్‌పై బయటకు వచ్చిన 9 మంది నేతలు, వారి కుటుంబ సభ్యులతో పార్టీ పవన్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో విశాఖ ఘటనలో తాము ఎదుర్కొన్న ఇబ్బందులను పార్టీ నేతలు పవన్‌ కల్యాణ్ కు వివరించారు. జనసైనికులు, వారి కుటుంబాలకు  పార్టీ అండగా ఉంటుందన్నారు. ధైర్యంగా పోరాడాలని వారికి భరోసా ఇచ్చారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. తొమ్మిది మంది జనసేన నేతలను పవన్‌ కల్యాణ్ శాలువాతో సత్కరించారు.






జనసేన పీఏసీ సమావేశం


జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఎసీ) సమావేశం కు డేట్ ఫిక్స్ అయ్యింది..ఈనెల 30వ తేదీన సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తో పాటుగా పార్టీ అగ్రనేతలు నాదెండ్ల మనోహర్, నాగబాబు ఇతర నాయకులు సమావేశంలో పాల్గొంటారు. ఇటీవల విశాఖ ఎయిర్ పోర్ట్ ఘటన తరువాత పరిణామాలను గురించి పార్టీలో అంతర్గతంగా చర్చించి భవిష్యత్ కార్యచరణను రెడీ చేస్తామని పార్టీ వర్గాలు ప్రకటించాయి. రెండు రోజుల పాటు పవన్ పార్టీ కార్యాలయంలో నే రాజకీయ వ్యవహారాలను గురించి చర్చిస్తారు. జనసేన పార్టి అద్యక్షుడు పవన్ కల్యాణ్ అధ్యక్షతన జరిగే సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.


విశాఖ ఘటనపై చర్చ!


విశాఖపట్టణం ఎయిర్ పోర్ట్ ఘటన పై కీలకంగా చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఘటన జరిగిన తరువాత చోటు చేసుకున్న పరిణామాలు గురించి లోతుగా చర్చించటంతో పాటుగా భవిష్యత్ కార్యచరణను రెడీ చేసేందుకు సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు ప్రకటించాయి. విశాఖ ఎయిర్ పోర్ట్ ఘటన తరువాత రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులు, రాజకీయంగా ఈ అంశంలో కలసి వచ్చిన అంశాలతో పాటుగా అధికార పక్షాన్ని ఢీ కొట్టేందుకు అవసరం అయిన మిగిలిన అస్త్రాలను ఎలా రెడీ చేయాలి. ఇందుకు అవసరం అయిన చర్యలు తీసుకునే విషయాలు గురించి పవన్ కీలకంగా చర్చిస్తారు. ఇదే సమయంలో పవన్ ను ఉద్దేశించి వైసీపీ నేతలు, మంత్రులు చేసిన వ్యాఖ్యలపై కూడా చర్చించాలని నాయకులు భావిస్తున్నారు. విశాఖ ఘటనపై న్యాయ పరంగా కూడా ముందుకు వెళ్ళాలని పవన్ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. దీనిపై కూడా పార్టీ నేతలతో చర్చించే అవకాశం ఉందని నాయకులు చెబుతున్నారు. పవన్ కల్యాణ్‌పై వైఎస్ఆర్‌సీపీ నేతలు పూర్తిగా వ్యక్తిగత దూషణలకే ప్రాధాన్యం ఇస్తున్నారని జనసేన వర్గాలు అంటున్నాయి. పవన్ వ్యక్తిగత జీవితాన్ని ప్రస్తావిస్తూ.. మూడు పెళ్లిళ్ల అంశంపై ప్రతీ రోజూ ఏదో ఓ కామెంట్ చేస్తున్నారు. అదే సమయంలో ఈ అంశంపై మహిళా కమిషన్ కూడా నోటీసులు ఇచ్చింది. వీటిపైనా చర్చించే అవకాశం ఉంది.