మంచు మోహన్ బాబు చిన్నకుమారుడు, నటుడు మంచు మనోజ్ కాసేపట్లో టీడీపీ అధినేత చంద్రబాబును కలవనున్నారు. సతీమణి భూమా మౌనిక రెడ్డితో కలిసి మనోజ్ చంద్రబాబు వద్దకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. మౌనిక రెడ్డి సోదరి భూమా అఖిల ప్రియతో పాటు, వారి కుటుంబం ప్రస్తుతం టీడీపీలో ఉన్న సంగతి తెలిసిందే. ఇక మంచు మనోజ్ దంపతులు చంద్రబాబును కలుస్తుండడంపై మనోజ్ కూడా టీడీపీలో చేరతారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు, టీడీపీలో చేరకుండా ఆ పార్టీకి మద్దతుదారుగా ఉండే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది.
మంచు కుటుంబం మొత్తం వైఎస్ఆర్ సీపీకి మద్దతుగా ఉంటున్న సంగతి తెలిసిందే. గతంలో చాలా ఏళ్ల క్రితమే చంద్రబాబుపై వ్యతిరేకత పెంచుకున్న మోహన్ బాబు.. గత ఎన్నికల సమయంలో వైఎస్ జగన్‌కు బాగా దగ్గరయ్యారు. మోహన్ బాబు పెద్ద కోడలు విరోనికకు జగన్ కుటుంబంతో దగ్గరి చుట్టరికం కూడా ఉంది. దీంతో గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా వైఎస్ జగన్ కు పూర్తిస్థాయిలో మద్దతు పలికారు. అనంతరం సీఎం జగన్ ఫీజు రీఎంబర్స్‌మెంట్ల విషయంలో తీసుకున్న నిర్ణయాలు విద్యా సంస్థలకు వ్యతిరేకంగా ఉన్న సమయంలోనూ మోహన్ బాబు స్పందించలేదు. ప్రస్తుతం యూనివర్సిటీతో పాటు విద్యాసంస్థలు నడుపుతున్న మోహన్ బాబు చంద్రబాబు హాయాంలో ఇదే విషయంపై ధర్నాల్లోనూ పాల్గొన్నారు. కానీ, సీఎం జగన్ హాయాంలో మాత్రం నోరు మెదపలేదు.
గతేడాది చంద్రబాబు - మోహన్ బాబు భేటీ
2022 జూలైలో ఓసారి మోహన్ బాబు చంద్రబాబును కలిశారు. దాదాపు పదేళ్ల తర్వాత వారు ఇద్దరూ కలిసి రెండు గంటలకు పైగా మాట్లాడుకున్నారు. తాజా ఏపీ రాజకీయాలపై చర్చించుకున్నట్లుగా అప్పుడు వార్తలు వచ్చాయి. ఆ సమయంలో ఇద్దరి మధ్య సఖ్యత ఏర్పడుతుందని అంతా అనుకున్నారు. కానీ, అప్పటి నుంచి మోహన్ బాబు, చంద్రబాబు ప్రస్తావన ఎక్కడా రాలేదు.
మంచు కుటుంబం మొత్తం సీఎం జగన్ తో ప్రస్తుతానికి సాన్నిహిత్యం ప్రదర్శిస్తుండగా మంచు మనోజ్ మాత్రం టీడీపీ వైపు ఆకర్షితులు అవుతున్నారు! అయితే, తన కుటుంబం అంతా వైఎస్ఆర్ సీపీ వైపు ఉండగా, తాను టీడీపీలో చేరడం సరికాదనే ఉద్దేశంలో మనోజ్ ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. అందుకే, టీడీపీలో చేరకుండానే ఆ పార్టీకి అన్ని విధాలా సహకరిస్తూ మద్దతుదారుగా ఉంటారని సమాచారం.
ఎన్నికల ప్రచారం సమయంలో ఆయా పార్టీలు గ్లామర్ కోసం సినిమా ప్రముఖులను స్టార్ క్యాంపెయినర్ల తరహాలో నియమించుకునే సంగతి తెలిసిందే. వారు నేరుగా పార్టీలో చేరకుండా అవసరం వచ్చినప్పుడు ఆయా పార్టీలకు మద్దతుగా ఉంటుంటారు. వైఎస్ఆర్ సీపీలో అలీ, పోసాని క్రిష్ణమురళి, జోగి నాయుడు తదితరులు చేరగా, మరికొందరు పార్టీలో చేరకుండా కూడా రామ్ గోపాల్ వర్మ తరహాలో మద్దతుదారులుగా ఉంటూ వస్తున్నారు.
టీడీపీలో చేరకపోయినప్పటికీ నిర్మాత అశ్వనీదత్ లాంటివారు కూడా గట్టి మద్దతుదారుగా ఉంటారు. ఇటీవలే నటుడు సప్తగిరి టీడీపీలో చేరతానని ప్రకటించారు. ఎన్నికల సమయంలో ఆయా పార్టీల మద్దతుదారులు అందరూ ప్రచారంలో పాల్గొనే ట్రెండ్ ఎప్పటినుంచో కొనసాగుతూ ఉంది. మంచు మనోజ్ కూడా టీడీపీకి సపోర్ట్ గా ఉంటూ, స్టార్ క్యాంపెయినర్ తరహాలో కొనసాగుతారని తెలుస్తోంది.