కాణిపాకం‌ స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో అత్యంత వైభవంగా మహా‌ కుంభాభిషేకం నిర్వహించారు. మహా కుంభాభిషేకంలో ఆలయ సoప్రోక్షణ చేసిన అనంతరం ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు. వేలూరులోని శ్రీపురం స్వర్ణ దేవాలయం వ్యవస్థాపకులు శక్తి నారాయణి అమ్మ స్వామి.. కాణిపాకం శిలా ఫలాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి కె. నారాయణ స్వామి, రాష్ట్ర అటవీ పర్యావరణ విద్యుత్ శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, రాష్ట్ర పర్యాటక క్రీడలు, సాంస్కృతిక యువజన శాఖ మంత్రి ఆర్కే రోజా, ఎంపీలు పెద్ది రెడ్డి వెంకట మిథున్ రెడ్డి, జడ్పీ చైర్మ న్ గోవిందప్ప  శ్రీనివాసులు, జిల్లా కలెక్టర్ యం. హరి నారాయణన్, ఎస్ పి రిషాంత్ రెడ్డి పాల్గొన్నారు. 



దేవాలయాల అభివృద్దికి కృషి..


అనంతరం ఏపీ డిప్యూటీ సీఎం ‌నారాయణ స్వామి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్య మంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. భగవద్గీత ప్రకారం హిందూమతం ప్రకారం ప్రతి పూజలో మొదట విఘ్నేశ్వరునికి పూజ చేసిన అనంతరం పూజ ప్రారంభిస్తామని అన్నారు. ప్రతి పేదవాడు అభివృద్ధి చెందాలని ప్రతి ఇంట్లో సంతోషంగా ఉండాలని దేవుని ప్రార్థించానని, రాష్ట్ర ముఖ్య మంత్రి అన్ని దేవాలయాలను అభివృద్ధి చేయాలనే ఆశయంతో ఉన్నారని, జి డి నెల్లూరు  నియోజకవర్గంలో 10 దేవాలయాలను అభివృద్ధి చేస్తున్నామని, ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తున్నారని తెలిపారు. 


ఆధ్యాత్మికంగా అభివృద్ది చేస్తాం..


ఈ దేవాలయ పునః నిర్మాణానికి ముందుకు వచ్చిన దాతలను ఏపీ డిప్యూటీ సీఎం ‌నారాయణ స్వామి అభినందించారు. పేద వారు అభివృద్ధిలోకి రావడానికి విద్య ఒకటే తోడ్పడుతుంది అనే ఉద్దేశంతో ప్రభుత్వం విద్యా రంగానికి కృషి చేస్తుందని తెలిపారు. అనంతరం రాష్ట్ర క్రీడలు యువజన సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా మాట్లాడుతూ... స్వామి వారి దర్శనం మాటల్లో చెప్పలేని అనుభూతి అని తెలిపారు. దేవస్థానంలో అందరికీ పాజిటివ్ ఎనర్జీ అనేది అందుతుందని అన్నారు. చిత్తూరు జిల్లాలో ఉన్న ప్రసిద్ధి చెందిన దేవస్థానం కాణిపాక దేవస్థానం అని... ఈ సుప్రసిద్ధి పుణ్య క్షేత్ర అభివృద్ధికి సంబంధిత దేవాలయాలతో అనుసంధానం చేసి ఆధ్యాత్మికంగా అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. శాసనసభ్యులు ఛైర్మన్ ఆధ్వర్యంలో స్వామి వారి ఆలయ అభివృద్ధి పనులు జరగడం వారి అదృష్టం అన్నారని అన్నారు. 


ఘనంగా కుంభాభిషేక కార్యక్రమం...


అనంతరం శ్రీపురం వేలూరు స్వర్ణ దేవాలయం వ్యవస్థాపకులు శక్తి నారాయణి అమ్మ స్వామి.. ఏ పూజ కానీ ఏ కార్యక్రమం కానీ విఘ్నేశ్వరుని అనుగ్రహంతోనే ప్రారంభిస్తామని, ఎంత మంది దేవతలు ఉన్నా ఆయనే మొదట పూజలు అందుకుంటాడని కావున గణనాథుడు అంటారని కాణిపాకంలో స్వయంభుగా వెలిసిన వినాయక స్వామి వారికి అత్యంత వైభవంగా కుంభాభిషేకం జరిగిందని అన్నారు. అనంతరం గౌరవ మంత్రులకు వేద పండితులు స్వామి వారి ప్రతిమలను అందజేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు.