Election Campaign in Macherla: పల్నాడు ప్రాంతంలో ఎన్నికల ప్రచారం రక్తమోడుతోంది. మాచర్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి సతీమణి రమపై కొంత మంది దాడి చేశారు. తమపై దాడికి పాల్పడ్డవారు టీడీపీ కార్యకర్తలు అని ఎమ్మెల్యే వర్గీయులు ఆరోపిస్తు్న్నారు. మాచర్లలో ఎన్నికలు దగ్గర పడే కొద్దీ స్థానిక టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి ఆరాచకాలు శృతి మించుతున్నాయని వైసీపీ వర్గీయులు ఆరోపిస్తున్నారు. చివరికి అవి రాజకీయ ప్రత్యర్థులను దాటి వారి కుటుంబ సభ్యులపై మహిళలపై దాడి చేసే వరకూ వస్తున్నాయని వారు అంటున్నారు. 


రాజకీయ ప్రత్యర్థులను భయంభ్రంతులను చేసి ఎన్నికలలో ఓటింగ్ కి రాకుండా చేసే ఫ్యాక్షన్ తత్త్వం ప్రత్యర్థులకు మెండుగా ఉందని వైసీపీ ఎమ్మెల్యే ఆరోపించారు. నేడు వెల్దుర్తి మండలం శిరిగిరిపాడు గ్రామంలో ఎన్నికల ప్రచారం చేస్తున్న మాచర్ల వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి సతీమణి పిన్నెల్లి రమతో పాటు ఆమె వెంట ఉన్న వాహనాలపై కొంత మంది రాళ్లు, కర్రలతో దాడి చేశారు. దీంతో వారికి గాయాలు అయ్యాయి.


ఈ దాడిలో పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి సతీమణి రమకు స్వల్ప గాయాలు కాగా, మాజీ కౌన్సిలర్ అనంత రావమ్మ, మాజీ ఎంపీపీ చౌడేశ్వరమ్మలతో పాటు పలువురు మహిళలకు తీవ్రంగా గాయాలు అయ్యాయి. అడ్డుకొన్న పోలీసులకు సైతం గాయాలు అయ్యాయి.


పల్నాడు జిల్లా మాచర్లలో బాంబుల కలకలం


పల్నాడు జిల్లా మాచర్ల సమీపంలోని దుర్గి మండలం సంగమేశ్వర పాడు గ్రామంలో బాంబుల కలకలం రేపాయి. పోలీసులకు అందిన సమాచారం ప్రకారం సోదాలు జరపగా నిర్మాణంలో ఉన్న ఓ ఇంట్లో  17 బాంబులు, మూడు బరిసెలు, మూడు వేట కొడవళ్ళు, ఒక చిప్పగొడ్డలి, ఇనుప రాడ్లు లభ్యం అయ్యాయి. పోలీసులు వాటిని స్వాధీనం చేసుకొని విచారణ చేస్తున్నారు.