Lokesh Yuvagalam : కుప్పం నుంచి ప్రారంభించిన నారా లోకేష్ యువగళం పాదయాత్ర కర్నూలు జిల్లా ఆదోనిలో వెయ్యి కిలోమీటర్లు పూర్తి చేసుకుంది.  యువగళం మహాపాద యాత్రలో భాగంగా ప్రతి 100 కిలోమీటర్లకు ప్రత్యేకంగా హామీ ఇచ్చి శిలాఫలకం ఆవిష్కరించే ఆనవాయితీని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ కొనసాగిస్తున్నారు.  ఈ క్రమంలోనే లోకేష్ తన పాదయాత్రలో 77వ రోజు  కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గం వర్గం చేరుకున్నారు. ఆదోని గుండా కొనసాగిన పాదయాత్ర సాయంత్రం సిరిగుప్ప క్రాస్ వద్దకు చేరుకోవడంతో 1000 కిలోమీటర్లు పూర్తి అయ్యాయి. 1000 కి.మీ. మైలురాయి చేరుకున్న సందర్భంగా ఆదోని టౌన్ వార్డ్ 21ని దత్తత తీసుకోవాలని నిర్ణయించుకున్నట్టు లోకేష్ ప్రకటించారు. 


ప్రతికూలతల మధ్య ప్రారంభమైన యాత్ర - జోరందుకుందని టీడీపీ సంతృప్తి 


నారా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభించినప్పుడు చాలా నెగెటివ్ ప్రచారం జరిగింది. జన స్పందన లేదని సోషల్ మీడియలో క్యాంపైన్ నిర్వహించారు. అయితే వాటన్నింటినీ పట్టించుకోకుండా లోకేష్ పాదయాత్ర కొనసాగిస్తున్నారు.   లోకేష్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయనపై జరిగిన నెగెటివ్ ప్రచారం అంతా ఇంతా కాదు. ఆయనపై బాడీ షేమింగ్ కు పాల్పడ్డారు. వ్యక్తిత్వ హననం చేశారు. అయితే అన్నింటికీ సమాధానం పాదయాత్ర ద్వారానే ఇస్తున్నారు లోకేష్. కాళ్లకు బొబ్బలెక్కాయని రెస్ట్ తీసుకోవడం లేదు. తప్పనిసరిగా విరామం ఇవ్వాల్సి వస్తే .. పండుగల సమయంలోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. ఎక్కడా ఆపకుండా పాదయాత్ర కొనసాగిస్తున్నారు. 


ఓపికగా సెల్ఫీలు - ప్రజలతో మమేకం


లోకేష్  రోజంతా బిజీగానే ఉంటున్నారు. గంట పాటు క్యాడర్ కు సెల్పీలు ఇస్తున్నారు.  నాలుగైదు గంటలు మాత్రమే నిద్ర. మిగతా సమయం అంతా ప్రజల్లోనే. లోకేష్ పడుతున్న కష్టాన్ని చూసి తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి కన్నీరు పెట్టుకున్నారు. ఆయనతో నడుస్తున్న వారందరికీ ఇదే పరిస్థితి.   ప్రజల కోసం ఎంత కష్టమైన పడటానికి తాను సిద్ధమని లోకేష్ చెబుతున్నారు.  మొత్తం నాలుగు వేల కిలోమీటర్ల పాదయాత్ర. ఇప్పటికి పావు శాతం పూర్తయింది. ఉమ్మడి చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో మాత్రమే పూర్తయింది. కర్నూలులో జరుగుతోంది. కడప జిల్లాతో రాయలసీమలో పూర్తవుతుంది. రాయలసీమలో లోకేష్ పాదయాత్రకు వచ్చి న .. వస్తున్న ఆదరణ చూసి టీడీపీ నేతలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 


భిన్నంగా ప్రజల్లో మమేకం అవుతున్న లోకేష్ 


 ప్రతీ చోటా ప్రజలకు లోకేష్ ఇస్తున్న భరోసా భిన్నంగా ఉంటోంది. తాము వస్తే చేస్తామని వారికి నమ్మకం కలిగేలా చెబుతున్నారు. అన్ని వర్గాల వారినీ కలుస్తున్నారు. మద్దతు ఇస్తున్నారు. సాయం కోసం వచ్చిన వారిని నిరాశపర్చడం లేదు. అప్పటికప్పుడు సాయం చేస్తున్నారు. అన్ని వర్గాలకూ భరోసా ఇస్తున్నారు.  కనీస మౌలిక వసతులు లేక దళితులు, బీసీలు, మైనార్టీలు పడుతున్న బాధలు నేను ప్రత్యక్షంగా చూసానని ప్రగతి పథంలో నడిపించే బాధ్యత నేను తీసుకుంటానని హామీలు ఇస్తున్నారు.  


రాయలసీమ అభివృద్ధి కోసం ఆలోచనలు ఆహ్వానించిన లోకేష్ 


రాయలసీమ ప్రజలకు జగన్మోహన్ రెడ్డి చేసిన అన్యాయాలను ఎండగట్టేందుకు ఈ యాత్ర ఒక ఆయుధంలా ఉపయోగపడిందని లోకేష్ భావిస్తున్నారు. రాయలసీమ సమగ్ర అభివృద్ది కోసం యువత ఆలోచనలు, అభిప్రాయాలను  వాట్సాప్ నెంబర్లో నేరుగా తనకు తెలియజేయాల్సిందిగా కోరారు. వాట్సాప్ నెం.96862 – 96862, Registration form: https://yuvagalam.com//register, Email Id: suggestionsyuvagalam@gmail.com ద్వారా మీ మనోభావాలను నేరుగా నాతో పంచుకోవచ్చునని లోకేష్ పిలుపు నిచ్చారు.