Butta Renuka assets Auction: ఎల్‌ఐసీకి అప్పు ఎగ్గొట్టిన వైసీపీ మాజీ ఎంపీ - ఆస్తుల వేలం ప్రకటన ఇచ్చిన సంస్థ
YSRCP leader Butta Renuka: వైసీపీ మాజీ ఎంపీ బుట్టా రేణుక ఆస్తులను ఎల్ఐసీ హెచ్ఎఫ్‌ఎల్ సంస్థ వేలం వేస్తోంది. అప్పుతీసుకుని చెల్లించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

YSRCP leader Butta Renuka assets auction: వైసీపీ మాజీ ఎంపీ బుట్టా రేణుక, ఆమె భర్త నీలకంఠ శివ బుట్టాకు ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ భారీ షాక్ ఇచ్చింది. గతంలో తమ వ్యాపార అవసరాల కోసం బుట్టా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, మెరిడియన్ ఎడ్యుటెక్ వంటి సంస్థల పేరిట ఎల్‌ఐసీ నుంచి వీరు సుమారు రూ. 340 కోట్ల రుణం తీసుకున్నారు. ప్రారంభంలో వాయిదాలు సక్రమంగానే చెల్లించినప్పటికీ, గత ఐదేళ్లుగా చెల్లింపులు నిలిచిపోవడంతో వడ్డీతో కలిపి ఆ మొత్తం ఇప్పుడు ఏకంగా రూ. 782.07 కోట్లకు చేరుకుంది.
ఎన్ని చాన్సులిచ్చినా కట్టని బుట్టా దంపతులు
బకాయిల రికవరీ కోసం ఎల్‌ఐసీ సంస్థ గతంలోనే పలుమార్లు నోటీసులు జారీ చేసింది. రుణం రీషెడ్యూల్ చేయాలని, కోవిడ్ వల్ల వ్యాపారాలు దెబ్బతిన్నాయని బుట్టా దంపతులు కోరినప్పటికీ, నిబంధనల ప్రకారం చెల్లింపులు జరగకపోవడంతో ఇరు వర్గాల మధ్య ఒప్పందం కుదరలేదు. ఈ కారణంగా తనఖా పెట్టిన ఆస్తులను వేలం వేసి బకాయిలు వసూలు చేసుకోవాలని ఎల్‌ఐసీ హెచ్‌ఎఫ్‌ఎల్ నిర్ణయించింది. ఇప్పటికే ఈ వ్యవహారం నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ వరకు వెళ్ళింది.
వేలంలో మెరిడియన్ స్కూల్ భవనం
తాజా వేలం ప్రకటనలో హైదరాబాద్‌లోని అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో ఉన్న ఆస్తులను చేర్చారు. ముఖ్యంగా కేపీహెచ్‌బీ ఫేజ్-6లో ఉన్న సుమారు 3,833 చదరపు గజాల స్థలాన్ని విక్రయానికి ఉంచారు. ప్రస్తుతం ఇక్కడే ప్రముఖ విద్యాసంస్థ మెరిడియన్ స్కూల్ నడుస్తోంది. ఈ స్కూల్ భవనం ఉన్న ఆస్తికి రిజర్వు ధరను సుమారు రూ. 65 కోట్లుగా నిర్ణయించారు. వీటితో పాటు మాదాపూర్, ఖానామెట్ పరిసరాల్లోని ఇతర విలువైన స్థలాలు కూడా వేలం జాబితాలో ఉన్నాయి.
కొనుగోలుదారులకు అవకాశం
ఈ ఆస్తులను కొనుగోలు చేయాలనుకునే వారికి ఎల్‌ఐసీ హెచ్‌ఎఫ్‌ఎల్ అవకాశం కల్పిస్తోంది. మార్చి 23వ తేదీ వరకు ఈ-బిడ్ ఫారాలను సమర్పించవచ్చని, మార్చి 24న ఆన్‌లైన్ ద్వారా ఈ-వేలం నిర్వహించనున్నట్లు సంస్థ స్పష్టం చేసింది. రాజకీయంగా మరియు వ్యాపారపరంగా ఎంతో పలుకుబడి ఉన్న బుట్టా కుటుంబం, ఈ ఆర్థిక సంక్షోభం నుంచి ఎలా బయటపడుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
కర్నూలు నుంచి ఓ సారి ఎంపీగా గెలిచిన బుట్టా రేణుక
బుట్టా రేణుక 2014 సార్వత్రిక ఎన్నికల్లో రాజకీయ అరంగేట్రం చేసి వైసీపీ తరపున కర్నూలు లోక్‌సభ నియోజకవర్గం నుండి ఎంపీగా భారీ మెజారిటీతో విజయం సాధించారు. అయితే, ఆ తర్వాత మారిన రాజకీయ సమీకరణాల వల్ల ఆమె తెలుగుదేశం పార్టీ కి మద్దతు ప్రకటించారు. తిరిగి 2019 ఎన్నికల సమయంలో మళ్లీ వైసీపీ గూటికి చేరినప్పటికీ, ఆ ఎన్నికల్లో ఆమెకు పోటీ చేసే అవకాశం దక్కలేదు. పార్టీ పట్ల విధేయతను చాటుకున్నందుకుగానూ, వైఎస్ జగన్ ప్రభుత్వం ఆమెకు ఏపీ స్టేట్ హ్యాండ్లూమ్ వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్‌గా పదవిని ఇచ్చి గౌరవించింది. 2024 ఎన్నికల్లో ఆమె ఎమ్మిగనూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం ఆమె వైసీపీలో క్రియాశీలకంగా ఉంటున్నారు.






















