నేను మణులడిగానా.. మాణిక్యాలడిగినా.. నా పొలంలో ఒక్క బోర్‌ని.. అదీ కూడా జలకళ పథకం కింద ఉచితంగా వేయించమని అడిగాను.. దానికే.. అంబటి రాంబాబు అంతగా అన్నేసి మాటలనాలా.. అని తెలుగు-సంస్కృతం అకాడెమీ అధ్యక్షురాలు.. వైసీపీ కీలక నేత లక్ష్మి పార్వతీ మథనపడుతూ ఉంటారు. ఎందుకంటే.. ఆమెకు చెందిన పొలంలలో ఓ బోర్ వేయించమని.. తన మనిషిని పంపిస్తే.. అంబటి రాంబాబు అవమానించి పంపేశారు. ఫోన్లు చేస్తే.. దారుణంగా మాట్లాడారు. ఇప్పుడా ఆడియో టేపులు వైరల్ అవుతున్నాయి. 


అసలు విషయం ఏమిటంటే... లక్ష్మి పార్వతి గుంటూరు జిల్లాకు చెందిన వారు. ఆమెకు అక్కడ ఆస్తులు ఉన్నాయి. సత్తెనపల్లి నియోజకవర్గం కిందకు వచ్చే ధూళిపాళ్ల అనే గ్రామంలో ఆమెకు రెండున్నర ఎకరాల భూమి ఉంది.  ఆ భూమిని కోటేశ్వరరావు అనే వ్యక్తికి కౌలుకు ఇచ్చారు. అయితే ఈ కోటేశ్వరరావు.. గతంలో లక్ష్మిపార్వతిపై ఆరోపణలు చేసిన కోటి అనే వ్యక్తి కాదు. ఇతను రాజకీయ నాయకుడు. ప్రస్తుతం సత్తెనపల్లి బీజేపీ మండల అధ్యక్షుడిగా ఉన్నారు. అప్పట్లో.. కోటి కూడా బీజేపీలో చేరారు కానీ.. ఆయన .. ఈయన ఒకరు కాదని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. 


ఈ కోటేశ్వరరావుతో... జలకళ పథకంలో భాగంగా తన పొలంలో బోరు వేయించాలని... దీనిపై ఎమ్మెల్యే అంబటి రాంబాబును కలవాలని సూచించారు. లక్ష్మి పార్వతి చెప్పారు కదా అని.. ఆయన అంబటి రాంబాబును సంప్రదించారు. అయితే స్థానిక రాజకీయాల కారణంగా లక్ష్మిపార్వతి పొలంలో బోరు వేయడానికి వైసీపీ నేతలు అంగీకరించలేదు. అనేక ప్రయత్నాలు చేసినా.. లక్ష్మిపార్వతి పొలానికి బోరు వేయడానికి అవకాశం దక్కలేదు. దీంతో.. లక్ష్మిపార్వతి చెప్పినట్లుగా..  నేరుగా అంబటి రాంబాబునే సంప్రదించారు కోటేశ్వరరావు.  


అప్పటికే పార్టీ నేతల ద్వారా  విషయం తెలుసుకున్న అంబటి... లక్ష్మీ పార్వతి పొలం గురించి తనకు ఫోన్ చేయొద్దని తేల్చేశారు.  గవర్నర్, సీఎం జగన్‌కు ఫిర్యాదు చేస్తానని కోటేశ్వరరావు అంటే.. ప్రధాని, రాష్ట్రపతికి కూడా ఫిర్యాదు చేసుకోమని సలహా ఇచ్చి మరీ చెప్పి ఫోన్ పెట్టేశారు. కోటేశ్వరరావు ఈ ఆడియో కాల్‌ను ఆయన సోషల్ మీడియాలో పెట్టారు. ఇప్పుడీ వ్యవహారం కలకలం రేపుతోంది. లక్ష్మిపార్వతికి కనీసం.. తన పొలంలో జలకళ పథకం కింద బోర్ వేసుకునే అధికారం కూడా లేదా.. అని కొంత మంది అంటూంటే.. మరికొంత మంది మాత్రం.. అంబటితో పెట్టుకుంటే అంతేనని సెటైర్లు వేస్తున్నారు. ఈ అంశంపై బహిరంగంగా అటు అంబటి రాంబాబు కానీ.. ఇటు లక్ష్మి పార్వతి కానీ స్పందించలేదు. ఇద్దరు పార్టీ పరువు బజారున పడకుండా..సమస్యను పరిష్కరించుకంటే సమస్య లేదు కానీ.. మీడియాకు ఎక్కితే మాత్రం.. రచ్చ రచ్చ అయిపోవడం ఖాయం అంటున్నారు.