Andhra Pradesh Congress :  ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల సమయం దగ్గర పడటంతో అన్ని రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టాయి. వైసీపీ అధినేత జగన్ ఎనిమిది జాబితాలు విడుదల చేయగా.. టీడీపీ, జనసేన కూటమి ఒక్క జాబితాలోనే 99 మంది అభ్యర్థులను ఖరారు చేశారు. ఈ సారి గేమ్ ఛేంజర్ గా ఉంటామని గట్టి నమ్మకంతో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా అభ్యర్థుల కసరత్తును ప్రారంభించింది. ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను ప్రారంభించారు. గతంలోనే అభ్యర్థిత్వం కావాలనుకునేవారి దగ్గర నుంచి దరఖాస్తులు తీసుకున్నారు. అలా ఆసక్తి చూపిన వారితో షర్మిల  ముఖాముఖి  మాట్లాడుతున్నారు. బలమైన అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు. 


కాంగ్రెస్ తరపున పోటీ చేసేందుకు ద్వితీయ శ్రేణి నేతల ఆసక్తి                    


కాంగ్రెస్‌లో ప్రజాబలం ఉన్న నేతలు చాలా మంది ఇతర పార్టీల్లో చేరిపోయారు. దీంతో ప్రముఖ నేతలు ఎవరూ నియోజకవర్గాల్లో లేరు. కానీ కాంగ్రెస్ పార్టీనే అంటి పెట్టుకుని ఉన్న అనేక మంది ద్వితీయ శ్రేణి నేతలు.. షర్మిల నేతృత్వంలో ఎన్నికల్లో పోటీ చేసి సత్తా చాటాలని అనుకుంటున్నారు. అందుకే గతంలో దరఖాస్తులు ఆహ్వానించినప్పుడు పెద్ద ఎత్తున అప్లికేషన్లు ఇచ్చారు. తాము చేసిన ప్రజాసేవతో పాటు.. కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవల గురించి పూర్తి స్థాయిలో వివరిస్తున్నారు. షర్మిల అందరితోనూ ఓపికగా  మాట్లాడి వీలైనంత బలమైన నేతల్ని ఖరారు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. 


కిటకిటలాడుతున్న ఆంధ్ర రత్న భవన్                             


ఏపీ కాంగ్రెస్ కార్యాలయం అయిన విజయవాడలోని ఆంధ్రరత్న భవన్ గతంలో నిర్మానుష్యంగా ఉండేది. షర్మిల బాధ్యతలు చేపట్టిన తర్వాత కార్యకర్తల సందడి కనిపిస్తోంది. ప్రతీ రోజూ.. ఆంధ్రరత్న భవన్‌లో కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కనిపిస్తున్నారు. ఈ సారి అంతో ఇంతో బలమైన అభ్యర్థులను ఎంపిక చేస్తామని షర్మిల నమ్మకంతో ఉన్నారు. ఈ రోజుతో.. అభ్యర్థుల ఎంపిక  ప్రక్రియకు విరామం ఇస్తారు. మార్చి ఒకటో తేదీన తిరుపతిలో.. ప్రత్యేకహోదా పై సంకల్ప ప్రకటన చేయనున్నారు. ప్రధాని మోదీ తిరుపతిలో ప్రత్యేకహోదా ఇస్తామని చెప్పి.. తర్వాత మోసం చేసినందున..తాము అక్కడే ప్రతిజ్ఞ చేస్తామని షర్మిల అంటున్నారు. 


ఇతర పార్టీల్లో సీటు దక్కని వారు కాంగ్రెస్ వైపు వస్తారా ?             


మరో పది రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది. ఈ లోపే అభ్యర్థుల్ని ఖరారు చేసి విస్తృతంగా ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నారు. ఇతర పార్టీల్లో చోటు దక్కని వారు.. కాంగ్రెస్ తరపున  పోటీ చేసేందుకు వస్తారని షర్మిల భావిస్తున్నారు. కాంగ్రెస్ అగ్రనేతలతో బహిరంగసభలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, సిద్ధరామయ్యలను ఆహ్వానించి .. ప్రచారం చేయాలనుకుంటున్నారు. ఈ సారి ఓటు బ్యాంక్  పెంచుకోవాలన్న లక్ష్యంతో షర్మిల ఉన్నారు.